CM Revanth Reddy: తెలంగాణ అభివృద్ధిని కిషన్‌రెడ్డి, కేటీఆర్ అండ్ కో అడ్డుకుంటున్నారు.. సీఎం రేవంత్ ఫైర్
ABN, Publish Date - Nov 07 , 2025 | 04:51 PM
కాంగ్రెస్ ప్రభుత్వమే అనేక విద్యాసంస్థలను నెలకొల్పిందని సీఎం రేవంత్‌రెడ్డి ఉద్ఘాటించారు. కాంగ్రెస్ నిర్ణయాలతోనే హైదరాబాద్ అంతర్జాతీయ నగరంగా మారిందని వ్యాఖ్యానించారు.కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ అభివృద్ధి గ్రోత్ ఇంజన్‌గా ఉందని పేర్కొన్నారు సీఎం రేవంత్‌రెడ్డి.
హైదరాబాద్, నవంబరు7 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్ ఓటర్లు విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) కోరారు. తాము చేస్తున్న అభివృద్ధిని చూసి ఓటు వేయాలని విన్నవించారు. పదేళ్లలో జూబ్లీహిల్స్‌కు బీఆర్‌ఎస్ (BRS), బీజేపీ (BJP) పార్టీలు ఏం చేశాయని ప్రశ్నల వర్షం కురిపించారు. కాంగ్రెస్ (Congress) పాలనలో హైదరాబాద్ అభివృద్ధి పథంలో సాగిందని ఉద్ఘాటించారు. ఎవరి హయాంలో హైదరాబాద్ అభివృద్ధి జరిగిందో జూబ్లీహిల్స్ ఓటర్లు ఆలోచించాలని కోరారు. 2014 నుంచి హైదరాబాద్‌లో ఎలాంటి అభివృద్ధి జరుగలేదని ఆరోపించారు. ఈ ఎన్నికలో ప్రజలు ఆలోచనతో నిర్ణయం తీసుకోవాలని సూచించారు. తమ పాలన, బీఆర్ఎస్ పాలన చూసి బేరీజు వేసుకొని ఓటు వేయాలని విన్నవించారు సీఎం రేవంత్‌రెడ్డి.
కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి..
హైదరాబాద్ అభివృద్ధి కాంగ్రెస్ పాలనలో చేసిందేనని ఉద్ఘాటించారు. ఇవాళ(శుక్రవారం)గాంధీభవన్ వేదికగా జూబ్లీహిల్స్ ఉపఎన్నిక (Jubilee Hills Bye Election)పై సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. సచివాలయంలో ఉన్న గుడి, మసీదులను కూలగొడితే కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఎందుకు సైలెంట్‌గా ఉన్నారని ప్రశ్నల వర్షం కురిపించారు. కాంగ్రెస్ ప్రభుత్వమే అనేక విద్యాసంస్థలను నెలకొల్పిందని నొక్కిచెప్పారు. కాంగ్రెస్ నిర్ణయాలతోనే హైదరాబాద్ అంతర్జాతీయ నగరంగా మారిందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ అభివృద్ధి (Hyderabad Development) గ్రోత్ ఇంజన్‌గా ఉందని చెప్పుకొచ్చారు. మిగులు బడ్జెట్‌తో మాజీ సీఎం కేసీఆర్‌కి అధికారం అప్పగిస్తే రూ. 8 .11 లక్షల కోట్ల అప్పును తమకు అప్పగించారని ఫైర్ అయ్యారు. 2004 నుంచి 2014 మధ్య కాలంలోనే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందని ఉద్ఘాటించారు. 2014 నుంచి 2024లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, మాజీ సీఎం కేసీఆర్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కలిసి హైదరాబాద్ అభివృద్ధి చెందడానికి ఏం చేశారని ప్రశ్నల వర్షం కురిపించారు. కేసీఆర్ సేద తీరడానికి ప్రగతి భవన్ ఉపయోగపడిందని ఎద్దేవా చేశారు సీఎం రేవంత్‌రెడ్డి.
ప్రగతి భవన్ ఏమైనా ఉపయోగపడిందా..?..
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రగతి భవన్ ఏమైనా ఉపయోగపడిందా..? అని నిలదీశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న సచివాలయం వాస్తుని చూసే కూలగొట్టారని ఆరోపించారు. కొత్త సచివాలయం వల్ల ప్రజలకు అదనపు లాభం ఏమీ లేదని స్పష్టం చేశారు. కొత్త సచివాలయం కట్టడం వల్ల ఒక్క ఉద్యోగమైనా వచ్చిందా..? అని ప్రశ్నించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో ప్రతిపక్ష నాయకుల ఇళ్ల ముందు సీసీ కెమెరాలు పెట్టి చూడటం తప్పా కేసీఆర్ (KCR) చేసిందేమీ లేదని సెటైర్లు గుప్పించారు. బాత్ రూంలో కూడా బుల్లెట్ ప్రూఫ్‌లు పెట్టుకున్నది కేసీఆరేనని ఎద్దేవా చేశారు. ఈ పదేళ్లలో తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్, మోదీ, కిషన్‌రెడ్డి చేసిన ప్రణాళిక ఏమైనా ఉందా..? అని ప్రశ్నల వర్షం కురిపించారు సీఎం రేవంత్‌రెడ్డి.
తెలంగాణ 2047 పేరుతో విజన్ డాక్యుమెంట్..
తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నది కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Kishan ReddY), కేటీఆర్ (KTR) అండ్ కోనేనని ఆరోపించారు. మెట్రో విస్తరణ, మూసీ ప్రక్షాళన, ఫ్యూచర్ సిటీలను అడ్డుకుంటుంది కేటీఆర్, కిషన్‌రెడ్డిలేనని విమర్శించారు. తెలంగాణ 2047 పేరుతో తాము విజన్ డాక్యుమెంట్‌ని రూపొందిస్తున్నామని ఉద్ఘాటించారు. కేసీఆర్ హయాంలో జీహెచ్‌ఎంసీపై రూ.10 వేల కోట్ల అప్పు చేశారని ఆరోపణలు చేశారు. హైదరాబాద్ దాహార్తి తీర్చేందుకు బీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయం ఏముందని ప్రశ్నించారు. ఎల్ అండ్ టీ మునగడానికి కారణం కేసీఆర్, కేటీఆర్ మాత్రమేనని ఆక్షేపించారు. ఎల్ అండ్ టీ కంపెనీని బ్లాక్ మెయిల్ చేసి కేసీఆర్, కేటీఆర్ లక్షలాది రూపాయలు కొల్లగొట్టారని ఆరోపించారు. ఫ్లై ఓవర్ విధానాన్ని తెచ్చిందే కాంగ్రెస్ పార్టీనేనని నొక్కిచెప్పారు. కేసీఆర్ హయంలో ఓ ఆర్ ఆర్‌ను దారుణంగా అమ్ముకున్నారని విమర్శించారు సీఎం రేవంత్‌రెడ్డి.
ఆ సంస్థలన్నీ కాంగ్రెస్ హయాంలోనివే..
నేడున్న జాతీయ, అంతర్జాతీయ సంస్థలన్నీ కాంగ్రెస్ హయాంలోనివేనని స్పష్టం చేశారు. ఐటీ కారిడార్‌ను రద్దు చేసింది మోదీ, కేసీఆర్ కాదా..? అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో వరదలు వచ్చినప్పుడు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం (PM Narendra Modi Govt) నుంచి కిషన్‌రెడ్డి ఏం తెచ్చారు..? అని నిలదీశారు. గత పదేళ్లలో తెలంగాణకు కేసీఆర్, కిషన్‌రెడ్డి చేసిందేంటో చెప్పాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ ఇచ్చిన ప్రాజెక్టులను ప్రధాని మోదీ రద్దు చేశారని ధ్వజమెత్తారు. కిషన్‌రెడ్డి, కేటీఆర్ తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు సీఎం రేవంత్‌రెడ్డి.
వారు బ్యాడ్ బ్రదర్స్...
కేటీఆర్ అండ్ కో మెట్రో విస్తరణను అడ్డుకుంటున్నారని ఆక్షేపించారు. కేటీఆర్ అండ్ కోని హైదరాబాద్ వాసులు బ్యాడ్ బ్రదర్స్ అంటున్నారని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleswaram Project) కట్టడం, కూలడం మూడేళ్లలోనే జరిగిపోయాయని సెటైర్లు గుప్పించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి రూ.లక్ష కోట్లు గోదావరిలో పోశారని ఆవేదన వ్యక్తం చేశారు. సచివాలయం, కాళేశ్వరం, కమాండ్ కంట్రోల్ సెంటర్.. ప్రగతి భవన్ తప్పా పదేళ్లలో కేసీఆర్ ఏం నిర్మించారని ప్రశ్నల వర్షం కురిపించారు. కేసీఆర్ విలాసవంతమైన జీవితం గడిపేందుకే ప్రగతిభవన్ కట్టారని ఆక్షేపించారు. కుమారుడి భవిష్యత్, వాస్తు కోసమే.. రూ.2 వేలకోట్లతో కేసీఆర్ కొత్త సచివాలయం కట్టారని ధ్వజమెత్తారు. గత పదేళ్లలో కేసీఆర్ ఒక్క కొత్త ఎయిర్‌పోర్టు అయినా కట్టారా అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.
మా ప్రభుత్వంలోనే తెలంగాణకి పెట్టుబడులు..
‘మేము అధికారంలోకి వచ్చాకే తెలంగాణ పెట్టుబడులు వస్తున్నాయి. గత రెండేళ్లలో తెలంగాణకు రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం. ప్రజలకు ఉపయోగం లేని ప్రాజెక్టులు నిర్మించిన బీఆర్‌ఎస్.. ఇప్పటికీ వాటిని చూపించి ప్రజలను మభ్యపెట్టేందుకు యత్నిస్తున్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వమే. మేం వచ్చాక 70 వేల ఉద్యోగాలు కల్పించాం. తెలంగాణకు కేటీఆర్ తీసుకొచ్చింది డ్రగ్స్, గంజాయి మాత్రమే. కేటీఆర్ ఒక విషపురుగు.. విష సంస్కృతిని తీసుకొస్తున్నారు. హైదరాబాద్ అభివృద్ధి జరగాలంటే జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ గెలవాలి’ అని సూచించారు సీఎం రేవంత్‌రెడ్డి.
ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం..
కేటీఆర్, కిషన్‌రెడ్డికి సీఎం రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. ‘గత పదేళ్లలో మీరుచేసిన అభివృద్ధి, తెచ్చిన ప్రాజెక్టులపై చర్చకు సిద్ధం. నగర అభివృద్ధికి బీఆర్‌ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు అడ్డంకిగా మారారు. తెలంగాణకు కేటీఆర్ తీసుకొచ్చింది డ్రగ్స్, గంజాయి మాత్రమే. కేటీఆర్ ఒక విషపురుగు.. విష సంస్కృతిని తీసుకొస్తున్నారు. హైదరాబాద్ నగరంలో అత్యాచారాలకు అవే కారణం కాదా?. నగరాన్ని పరిరక్షించి అభివృద్ధి చేసేందుకే హైడ్రా తీసుకొచ్చాం. హైడ్రా ద్వారా ఆక్రమణల నుంచి చెరువులు, పార్కులను కాపాడుతున్నాం. ఆక్రమణలపై మాత్రమే హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. అక్కడక్కడ పేదలకు ఇబ్బంది కలిగితే న్యాయం చేస్తున్నాం. ఈగల్, హైడ్రా వ్యవస్థలపై కేటీఆర్, కిషన్‌రెడ్డి కక్షగట్టారు’ అని ధ్వజమెత్తారు.
కవితను బయటకు పంపించి వేశారు...
‘హైదరాబాద్‌ను డ్రగ్స్‌కు అడ్డాగా కేటీఆర్ మార్చారు. ఈగల్ వ్యవస్థ తీసుకొచ్చి గంజాయి, డ్రగ్స్‌ను అరికడుతున్నాం. గంజాయి, డ్రగ్స్ రవాణాదారులను తొక్కిపట్టి నారతీస్తాం. బీఆర్ఎస్, బీజేపీ నేతలు తెలంగాణకు చేసిందేమీ లేదు.. వాళ్లకు రాజకీయాలే ముఖ్యం. అభివృద్ధి చేసేంది మేమే.. అందుకే ఓట్లు అడుగుతున్నాం. అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇస్తే వీళ్లకు ఎందుకు కడుపుమంట?. బీఆర్ఎస్‌లో ఒక్కొక్కరిని రాజకీయంగా ఎలిమినేట్ చేస్తూ వచ్చారు. బీఆర్ఎస్ పార్టీలోని కీలక నేతలను మాజీ మంత్రి హరీష్‌రావు బయటకు పంపేశారు. చివరకు కుటుంబ సభ్యుల్లోనూ కొందరిని బయటకు పంపేశారు. కవితను కూడా బీఆర్ఎస్ నుంచి బయటకు పంపించేశారు. బీఆర్ఎస్‌ను కబళించేందుకు హరీశ్‌రావు కుట్ర చేస్తున్నారు’ అని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు.
బండి సంజయ్‌కు సీఎం రేవంత్ కౌంటర్..
‘బండి సంజయ్‌కు సీఎం రేవంత్ కౌంటర్ ఇచ్చారు. అన్ని మతాలను మేము సమానంగా గౌరవిస్తాం. ప్రధాని మోదీ టోపీ పెట్టుకోలేదా..? ముందు వారి విధానం చెప్పాలి. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీజేపీకి డిపాజిట్ కూడా రాదు. డిపాజిట్ రాకపోతే హిందువులకు బీజేపీ వ్యతిరేకమని ఒప్పుకుంటారా..? బీజేపీ గెలవడం కిషన్‌రెడ్డికి ఇష్టం లేదు’ అని సీఎం రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు.
ఇవి కూడా చదవండి...
మరో ఆర్టీసీ బస్సుకు ప్రమాదం.. వివరాలు ఇవే
గిగ్ వర్కర్లకు గుడ్‌న్యూస్.. సమస్యలపై రేవంత్ సర్కార్ ఫోకస్
Read Latest Telangana News And Telugu News
Updated Date - Nov 07 , 2025 | 05:44 PM