Bandi Sanjay: మాగంటి గోపీనాథ్ మృతిపై అనుమానాలు.. బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్
ABN, Publish Date - Nov 07 , 2025 | 03:28 PM
మాగంటి గోపీనాథ్ ఆస్తిపాస్తుల పంపకాల్లో మాజీ మంత్రి కేటీఆర్, సీఎం రేవంత్‌రెడ్డిల మధ్య గొడవలు మొదలయ్యాయని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆస్తిపాస్తుల కోసమే వీరిద్దరి మధ్య పగలు, పట్టింపులు ఎక్కువయ్యాయని ఆక్షేపించారు. గోపీనాథ్ చనిపోయాక ఆయన ఆస్తులను వీళ్లిద్దరూ పంచుకున్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు బండి సంజయ్ కుమార్.
హైదరాబాద్, నవంబరు7 (ఆంధ్రజ్యోతి): దివంగత బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (Maganti Gopinath) మృతి విషయంలో అనేక అనుమానాలు ఉన్నాయని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) సంచలన ఆరోపణలు చేశారు. గోపీనాథ్ తల్లిని కొంతమంది మానసిక క్షోభకు గురి చేశారని ధ్వజమెత్తారు. గోపీనాథ్ కన్న కొడుకు కూడా ఆయన ముఖం చూడనీయకుండా చేయడంపై అనేక అనుమానాలు ఉన్నాయని షాకింగ్ కామెంట్స్ చేశారు. గోపీనాథ్ మరణం ఒక మిస్టరీ అని స్వయానా ఆయన తల్లే చెబుతోందని పేర్కొన్నారు. అసలు గోపీనాథ్ చనిపోయింది ఎప్పుడు..? ముందే మృతిచెందారని ఆయన తల్లి చెబుతున్నారని తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక (Jubilee Hills Bye Election) పై ఈరోజు(శుక్రవారం) హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ శ్రేణులకి బండి సంజయ్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్సీ మల్క కొమరయ్య, బీజేఎల్పీ ఉప నాయకుడు పాయల్ శంకర్, గంగిడి మనోహర్ రెడ్డి, బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు వేముల అశోక్, బీజేపీ ఎస్సీ మోర్చా కార్యదర్శి ఎస్.కుమార్, అధికార ప్రతినిధులు జె.సంగప్ప, సోలంకి శ్రీనివాస్, రితేష్ రాథోడ్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించారు బండి సంజయ్.
గోపీనాథ్ మృతిపై సమగ్ర విచారణ జరిపించాలి..
మాగంటి గోపీనాథ్ ఎవరి కోసమో చనిపోయిన విషయాన్ని తనకు తెలియకుండా ఆపారని ఆయన తల్లి చెబుతున్నారని గుర్తుచేశారు. గోపీనాథ్ మరణంపై రేవంత్‌రెడ్డి ప్రభుత్వం (Revanth Reddy Govt) సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. గోపీనాథ్ కుటుంబ సభ్యులు, ఆస్పత్రి యాజమాన్యం స్టేట్‌మెంట్లను ప్రభుత్వం వెంటనే రికార్డు చేయాలని కోరారు. తన తండ్రిని చూడటానికి రావొద్దంటూ బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తనను బెదిరించారని గోపీనాథ్ కొడుకు ఆరోపించారని గుర్తుచేశారు. అయినా సీఎం రేవంత్‌రెడ్డి గుండె మాత్రం కరగడం లేదు... ఈ విషయంపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నల వర్షం కురిపించారు. గోపీనాథ్ మృతిపై అనేక కారణాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోందని పేర్కొన్నారు. గోపీనాథ్ ఆస్తిపాస్తులపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), మాజీ మంత్రి కేటీఆర్ (KTR)ల మధ్య చర్చలు జరిగాయని.. ఈ పంపకాల వ్యవహారం వారిద్దరి మధ్య ఉందని షాకింగ్ కామెంట్స్ చేశారు. అందుకే మాజీ సీఎం కేసీఆర్ కుటుంబంపై ఉన్న కేసులపై కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ జరిపించడం లేదని విమర్శించారు బండి సంజయ్ కుమార్.
కేటీఆర్, రేవంత్‌రెడ్డి మధ్య గొడవలు..
కేసీఆర్ (KCR), కేటీఆర్‌లని రేవంత్ ప్రభుత్వం ఎందుకు అరెస్టు చేయడం లేదని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. గోపీనాథ్ ఆస్తిపాస్తుల పంపకాల్లో మాజీ మంత్రి కేటీఆర్, సీఎం రేవంత్‌రెడ్డిల మధ్య గొడవలు మొదలయ్యాయని ఆరోపించారు. ఆస్తిపాస్తుల కోసమే వీరిద్దరి మధ్య పగలు, పట్టింపులు ఎక్కువ అయ్యాయని ఆక్షేపించారు. గోపీనాథ్ చనిపోయాక ఆయన ఆస్తులను వీళ్లిద్దరూ పంచుకున్నారని ఎద్దేవా చేశారు. దమ్ముంటే గోపీనాథ్ ఆస్తులెన్ని..? అవన్నీ ఎటుపోయాయో చెప్పే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా..? అని ప్రశ్నించారు. గోపీనాథ్ మృతి, ఆస్తుల వ్యవహారంపై విచారణ జరిపించే దమ్ము సీఎం రేవంత్‌రెడ్డికి ఉందా..? అని సవాల్ విసిరారు. గోపీనాథ్ మరణంపై స్వయానా ఆయన తల్లి చేసిన ఆరోపణలపై ఇంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) ఎందుకు స్పందించడం లేదు..? అని ప్రశ్నల వర్షం కురిపించారు బండి సంజయ్ కుమార్.
గోపీనాథ్ మృతి వెనుక ఏం జరిగిందో..
మాగంటి గోపీనాథ్ మృతితో సీఎం రేవంత్‌రెడ్డికి నిజంగా సంబంధం లేదని భావిస్తే... తక్షణమే గోపీనాథ్ మరణం, ఆస్తిపాస్తులపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. గోపీనాథ్ మరణం వెనుక ఏం జరిగిందో.. ఆయన ఎప్పుడు చనిపోయారో..? రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వెంటనే అసలు విషయాలను బయటపెట్టాలని సవాల్ విసిరారు. గోపీనాథ్ మృతిపై ఆస్పత్రి యాజమాన్యం ఎందుకు ఆలస్యంగా ప్రకటన చేసిందో వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపించాల్సిందేనని డిమాండ్ చేశారు. ఎక్కడైనా ఆస్తుల పంపకాలపై కుటుంబ సభ్యులు కొట్లాడుకోవడం చూశామని... ఇక్కడ మాత్రం గోపీనాథ్ ఆస్తులపై సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్‌లు కొట్లాడుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని ఎద్దేవా చేశారు. గోపీనాథ్ మరణంపై ఆయన అనుచరులకు, బీఆర్ఎస్ కేడర్‌కు కూడా అనేక అనుమానాలు ఉన్నాయని ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గోపీనాథ్ అనుచరులెవరూ బీఆర్ఎస్‌కి మద్దతుగా ప్రచారం చేయడం లేదని విమర్శించారు. ప్రజలకు అసలు వాస్తవాలు అర్థమయ్యాయని చెప్పుకొచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని పేర్కొన్నారు బండి సంజయ్ కుమార్.
ఎన్నికల కమిషన్, పోలీసులపై ప్రశ్నల వర్షం...
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఎన్నికల కమిషన్, పోలీసులు నిష్పక్షపాతంగా ఎందుకు వ్యవహరించడం లేదని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ ప్రశ్నల వర్షం కురిపించారు. కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ పార్టీలకు మద్దతుగా ఎన్నికల కమిషన్, పోలీసులు కొమ్ముకాస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ విషయంలో ఎన్నికల కమిషన్, పోలీసులు సిగ్గుపడాలని విమర్శించారు. తెలంగాణలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ (BRS) పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు కూడబలుక్కునే ఒకరినొకరు తిట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ (BJP) నేతల ప్రచార సభల అనుమతి కోసం దరఖాస్తు చేస్తే.. ఎన్నికల కమిషన్ జాప్యం చేస్తోందని.. చివరి నిమిషంలో ఎందుకు రద్దు చేస్తోందని ప్రశ్నల వర్షం కురిపించారు బండి సంజయ్ కుమార్ .
ఎన్నికల కమిషన్ ఎందుకు స్పందించలేదు..
ఈరోజు మీనాక్షిపురం(రహమత్ నగర్)లో ఇవాళ(శుక్రవారం) సాయంత్రం సభకు పర్మిషన్ ఇవ్వాలని ఈనెల(నవంబరు) 4వ తేదీన దరఖాస్తు చేసుకున్నామని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ గుర్తుచేశారు. ఈ విషయంపై నిన్నటిదాకా ఎన్నికల కమిషన్ (Election Commission) ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. కానీ ఈరోజు ఉదయం తమకు ఎన్నికల కమిషన్ అధికారులు ఫోన్ చేసి అనుమతి ఇవ్వడం లేదని, వేరేచోట సమావేశం పెట్టుకోవాలని ఎలా చెబుతున్నారని నిలదీశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు మాత్రం ఎక్కడ అడిగితే అక్కడ మీటింగ్‌కు ఎన్నికల కమిషన్ ఎలా అనుమతి ఇస్తోందని ప్రశ్నించారు. చివరి నిమిషంలో తమ సమావేశానికి ఎక్కడైనా అనుమతి ఇచ్చినా చాలా కండీషన్లు ఎందుకు పెడుతున్నారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు డీజేలు పెట్టుకోవడానికి, హంగామా చేయడానికి మాత్రం ఎన్నికల కమిషన్ అధికారులు అనుమతి ఇస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల కమిషన్ అధికారులది ఇదేం ద్వంద్వ వైఖరి..? అని ప్రశ్నించారు బండి సంజయ్ కుమార్.
వారి ఓట్లు రావనే భయం..
బీజేపీ సభలకు అనుమతిస్తే... ఒక వర్గం ఓట్లు రావనే భయం కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు పట్టుకుందని ఎద్దేవా చేశారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నిక (MLC Elections)ల్లో రెండు సీట్లను బీజేపీ గెలుచుకుందని గుర్తుచేశారు. జూబ్లీహిల్స్‌లో బీజేపీ గెలవకూడదనే కుట్రతోనే తమ సభలకు అనుమతి ఇవ్వడం లేదని ధ్వజమెత్తారు. దొంగ సర్వేల పేరుతో బీజేపీ పోటీలో లేదంటూ తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ఆక్రోశించారు. ప్రజల ఆలోచన మాత్రం కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు గుణపాఠం చెప్పాలని ఎదురు చూస్తున్నారని చెప్పుకొచ్చారు. ఈ విషయం తెలిసే కాంగ్రెస్ ముస్లింల మెప్పు పొందేందుకు ప్రయత్నిస్తోందని ఆక్షేపించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ వర్సెస్ ఐఎంసీ(ఇండియన్ ముస్లిం కాంగ్రెస్) మధ్యే పోటీ ఉందని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌కు ముస్లిం ఓట్ల కోసం మాత్రమే ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. హిందువులంతా తమ సత్తా ఏమిటో కాంగ్రెస్‌కు రుచి చూపించాలని కోరారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిందని ఆక్షేపించారు. బీఆర్ఎస్ ముందే ఈ ఎన్నికపై చేతులెత్తేసిందని విమర్శించారు. జూబ్లీహిల్స్ ప్రజలారా... అభివృద్ధి కావాలా..? అరాచక పాలన కావాలా..? తేల్చుకోవాలని పేర్కొన్నారు బండి సంజయ్ కుమార్.
ఆ పార్టీలని గెలిపిస్తే అరాచకాలే..
కాంగ్రెస్ గెలిస్తే మజ్లిస్ గెలిచినట్లేనని ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలని గెలిపిస్తే అరాచకాలు, అక్రమాలకు మళ్లీ తావిచ్చినట్లేనని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ ఆక్షేపించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఓట్ల కోసం దిగజారి మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ అంటేనే ముస్లింలు అని రేవంత్‌రెడ్డి ఎలా చెబుతున్నారని ప్రశ్నించారు. దేశ జవాన్లను అవమానించేలా, హేళన చేసేలా రేవంత్‌రెడ్డి మాట్లాడారని ధ్వజమెత్తారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ గెలుపు తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. పలు సర్వే నివేదికల పేరుతో కాంగ్రెస్, బీఆర్ఎస్ చేస్తున్న కుట్రలు ప్రజలకు అర్థమయ్యాయని చెప్పుకొచ్చారు. హర్యానా ఎన్నికల (Haryana Elections)తో సహా అనేక ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందని పలు సర్వేలు ప్రచారం చేశాయని గుర్తుచేశారు. ఫలితాలు మాత్రం అందుకు భిన్నంగా వచ్చిన విషయాన్ని గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. హర్యానా ఎన్నికలతో సహా అనేక ఎన్నికల్లో బీజేపీ గెలవడం తథ్యమని జోస్యం చెప్పారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు గెలిస్తే... చైన్ స్నాచర్లకు, గంజాయి విక్రేతలకు, సంఘ విద్రోహ శక్తులకు అడ్డాగా మారబోతోందని బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇవి కూడా చదవండి...
మరో ఆర్టీసీ బస్సుకు ప్రమాదం.. వివరాలు ఇవే
గిగ్ వర్కర్లకు గుడ్‌న్యూస్.. సమస్యలపై రేవంత్ సర్కార్ ఫోకస్
Read Latest Telangana News And Telugu News
Updated Date - Nov 07 , 2025 | 04:12 PM