Operation Sindoor: దేశ భద్రత, రక్షణ కోసం ప్రతి భారతీయుడు సన్నద్దంగా ఉండాలి: పురంధేశ్వరి
ABN, Publish Date - May 07 , 2025 | 11:27 AM
Daggubati Purandeswari: పాకిస్తాన్‌లో తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను భారత బలగాలు ధ్వంసం చేశాయని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడికి భారత్ దీటైన జవాబు ఇవ్వడం ఖాయమని పురంధేశ్వరి తెలిపారు.
విజయవాడ: మన దేశ భద్రత, రక్షణ కోసం ప్రతి భారతీయుడు సన్నద్దంగా ఉండాలని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి (Daggubati Purandeswari) పిలుపునిచ్చారు. ప్రస్తుత సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీకి భారతీయలు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని చెప్పారు. మనమంతా ఒక గళంతో మన సైన్యానికి స్పూర్తిని ఇవ్వాలని పురంధేశ్వరి పేర్కొన్నారు. ఇవాళ(బుధవారం) విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు నిర్వహించారు.
ఈ వేడుకల్లో పురంధేశ్వరితో పాటు బీజేపీ నేతలు పాల్గొని నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడారు. పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడికి భారత్ ధీటైన జవాబు ఇవ్వడం ఖాయమని అన్నారు. 26 మంది అమాయకులైన భారత పర్యాటకులను అన్యాయంగా పాకిస్తాన్ ఉగ్రవాదులు చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్థాన్‌కు తప్పకుండా సమాధానం చెబుతామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముందుగానే ప్రకటించారని అన్నారు. పాకిస్తాన్‌లో తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను భారత బలగాలు ధ్వంసం చేశాయని పురంధేశ్వరి అన్నారు.
భారతదేశంపై దాడులు ఎలా చేయాలనే దానిపై ఈ స్థావరాల్లో శిక్షణ ఇచ్చారని పురంధేశ్వరి తెలిపారు. అలాంటి శిక్షణ స్థావరాలను ఇండియన్ ఆర్మీ నేలమట్టం చేశారని చెప్పారు. కసబ్ కూడా గతంలో ఇక్కడే శిక్షణ పొందారని తెలిపారు. సయ్యద్ హఫీజ్ మసీద్‌ను నడుపుతూ ముస్లిం యువకులను ఉగ్రవాదులుగా మార్చారని మండిపడ్డారు. అలాంటి వారిని సమూలంగా నిర్మూలిస్తే ఉగ్రవాదుల దాడులు ఉండవని చెప్పారు. ఈ ఆపరేషన్‌కు సిందూర్ అని మోదీ నామకరణం చేశారని తెలిపారు. మహిళల నుదుట సింధూరం చెరిపేశారు కాబట్టే మిషన్ సిందూర్ అని పేరు పెట్టారని ఉద్ఘాటించారు. ఉగ్రవాదుల చర్యలు ఎదుర్కోనేలా ఇవాళ దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ జరుగుతుందని తెలిపారు. దాడుల సమయంలో ఎలా స్పందించాలి, ఎలా ఎదుర్కోవాలో ప్రజలకు అధికారులు అవగాహన కల్పిస్తారని పురంధేశ్వరి వెల్లడించారు.
మరిన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ఈ వార్తలు కూడా చదవండి
India Pak War: పాకిస్తాన్‌పై మెరుపుదాడి, 30 మంది ఉగ్రవాదులు హతం..
For National News And Telugu News
Updated Date - May 07 , 2025 | 11:36 AM