Coldwaves In Telangana: తెలంగాణాలో చలి పంజా.. మరో 2 రోజుల పాటు అంతే.!
ABN, Publish Date - Dec 11 , 2025 | 09:17 PM
రాష్ట్రంలో చలి తీవ్రత అంతకంతకూ పెరుగుతూనే ఉంది. రాబోయే రెండు మూడు రోజుల పాటు పరిస్థితులు ఇలాగే కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
హైదరాబాద్, డిసెంబర్ 11: రాష్ట్రంలో చలి తీవ్రత రోజు రోజుకూ ఎక్కువవుతూనే ఉంది(Coldwaves). అటు పల్లెలు, ఇటు పట్నం.. ఎటుచూసినా తీవ్రమైన శీతల గాలులు వీస్తున్నాయి. ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోతుండటంతో.. ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఓ వైపు ఉదయం వేళ పొగమంచు కప్పేస్తుంటే.. మరోవైపు సాయంత్రమవగానే చలి భయపెడుతోంది. దీంతో ప్రజలు బయటకు వచ్చేందుకు వెనుకడుగు వేస్తున్నారు.
ఇక, హైదరాబాద్(Hyderabad) సహా పలు జిల్లాల్లో రెండు రోజుల పాటు చలి తీవ్రత ఇలాగే కొనసాగే అవకాశముందని రాష్ట్ర వాతావరణ అధికారులు(Meteorological Authorities) తెలిపారు. రానున్న రెండు మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 - 4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశముందన్నారు. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు అధికారులు. ఆదిలాబాద్, కొమరం భీమ్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, సిద్ధిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్ జిల్లాల ప్రజలు డిసెంబర్ 13 వరకూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆ తర్వాత నుంచీ రాష్ట్ర వ్యాప్తంగా పొడి వాతావరణం ఉండే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం(Hyderabad Meteorological Dept) తెలిపింది.
ఇవీ చదవండి:
ఓటుచోరీ గురించి మాట్లాడమంటే అమిత్ షా ఒత్తిడికి లోనయ్యారు: రాహుల్
ఇండిగో కీలక నిర్ణయం.. ఆ ప్రయాణికులకు బంపర్ ఆఫర్.!
Updated Date - Dec 13 , 2025 | 04:49 PM