Kishan Reddy: ఆరు గ్యారెంటీలు పూర్తిగా అమలు చేయలేక రేవంత్ ప్రభుత్వం చేతులెత్తేసింది.. కిషన్‌రెడ్డి ఫైర్
ABN, Publish Date - Jun 22 , 2025 | 04:57 PM
పేదలకు రేవంత్ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఆరు గ్యారెంటీలను పూర్తిగా అమలు చేయలేక రేవంత్ ప్రభుత్వం చేతులెత్తేసిందని కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు.
హైదరాబాద్: మహిళలు, రైతులు, నిరుద్యోగ యువకులు, దళితులకు డిక్లరేషన్ల పేరుతో అనేక హామీలు ఇచ్చి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) వెన్నుపోటు పొడిచారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Union Minister Kishan Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పులు ఇచ్చేవారు లేరని, తనను నమ్మేవారు లేరని.. సీఎం రేవంత్‌రెడ్డి చేతులెత్తేశారని విమర్శించారు. ఇవాళ(ఆదివారం) ఈ మేరకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. పరిపాలన చేతగాక, హామీలు అమలు చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో చేతులెత్తేసిందని మండిపడ్డారు. నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో రేవంత్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి.
కేసీఆర్‌ని వద్దనుకొని, సోనియాగాంధీ మాటలు, ఆరు గ్యారెంటీలను నమ్మి ప్రజలు కాంగ్రెస్‌కి ఓటు వేస్తే.. గడిచిన ఏడాదిన్నరలో ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశారని కిషన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నో పోరాటాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నామని తెలిపారు. త్యాగాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ కేసీఆర్ కుటుంబం చేతిలో పడి ఏ రకంగా నష్టపోయిందో మనకు తెలుసునని చెప్పారు. ధనిక రాష్ట్రంగా మొదలైన తెలంగాణ.. లక్షల కోట్ల అప్పులపాలైందని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం అవినీతి పాలనతో, దోపిడీ, కుంభకోణాలతో, అహంకారంతో తెలంగాణను దెబ్బతీశారో చూశామని అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా బీఆర్ఎస్ పనిచేసిందని ధ్వజమెత్తారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి.
తెలంగాణకు ఏకైక రక్ష బీజేపీ మాత్రమే..
వచ్చే అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా.. మోదీ నాయకత్వంలో తెలంగాణలో కాషాయజెండా ఎగరడం ఖాయమని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణకు ఏకైక రక్ష బీజేపీ మాత్రమేనని స్పష్టం చేశారు. మోదీ నాయకత్వంలో తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రతి కార్యకర్త, నాయకుడు పనిచేయాలని కోరారు. తెలంగాణకు మేలు జరగాలంటే, ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే, ప్రత్యేక రాష్ట్రం కోసం ఆత్మబలిదానం చేసుకున్న అమర వీరుల ఆత్మలు శాంతించాలంటే.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీతోనే సాధ్యమని ఉద్ఘాటించారు. ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా ఎంపీగా నిరంతరం ప్రజల కోసం అహర్నిశలు పనిచేస్తున్న ఈటల రాజేందర్‌ని తెలంగాణ బీజేపీ తరఫున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
మోదీ ప్రభుత్వం ఒక్క రూపాయి దుర్వినియోగం చేయలేదు..
మోదీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం చేయలేదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఈరోజు ప్రధాని మోదీ నేతృత్వంలో గ్రామీణ ప్రాంతంలో స్వచ్ఛభారత్ టాయిలెట్ నుంచి మొదలు పెడితే చంద్రమండలంలో త్రివర్ణ పతాకం ఎగురవేసే వరకు ప్రతి రంగంలో అద్భుత ప్రగతి సాధించామని అన్నారు. ప్రజాప్రతినిధులు అంటే ప్రజలకు అందుబాటులో ఉంటూ.. సమస్యల పరిష్కారం కృషి చేసేవారని ప్రధాని మోదీ అనేవారని తెలిపారు. దేశవ్యాప్తంగా 11 ఏళ్లలో ప్రధాని మోదీ నాయకత్వంలో జరిగిన అభివృద్ధి నేడు ప్రజల ముందు కనిపిస్తోందని అన్నారు. దేశంలో కాంగ్రెస్సేతర పార్టీ 11 ఏళ్లపాటు పరిపాలించడంతోపాటు మరో 11 ఏళ్లు పరిపాలించేందుకు ప్రజల మద్దతుతో బీజేపీ ముందుకు వెళ్తోందని కిషన్‌రెడ్డి తెలిపారు.
ప్రధాని మోదీ నేతృత్వంలో.. మొట్టమొదటి కాంగ్రెస్సేతర ప్రభుత్వం.. నీతివంతంగా, పారదర్శకంగా, అద్భుత, సమర్థమంతమైన పరిపాలన అందిస్తోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. యూపీఏ హయాంలో.. ఏ రోజూ పేపర్, టీవీ చూసినా.. కుంభకోణాలే కనిపించేవని విమర్శించారు. పతాక శీర్షికల్లో కాంగ్రెస్ అవినీతి వార్తలు ఉండేవని చెప్పుకొచ్చారు. ఈ దేశంలో అవినీతి ప్రభుత్వం, కీలు బొమ్మ ప్రభుత్వం ఉండకూడదని, సమర్థమంతమైన ప్రభుత్వం కావాలని 2014లో దేశ ప్రజలు మోదీ నేతృత్వంలోని బీజేపీని గెలిపించారని గుర్తుచేశారు. ప్రజల ఆకాంక్షలు, ఆశలను పరిగణనలోకి తీసుకొని ఈ 11 ఏళ్లు ప్రధాని మోదీ సుపరిపాలన అందించారని కొనియాడారు. ఏ పత్రికలో, ఏ టీవీ చానళ్లలో గానీ గత 11 ఏళ్లలో బీజేపీ ప్రభుత్వానికి సంబంధించి ఏ ఒక్క అవినీతి వార్త రాలేదంటే.. మోదీ పారదర్శక పాలనను అర్థం చేసుకోవచ్చని చెప్పారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి.
మన్మోహన్ సింగ్ నేతృత్వంలో రిమోట్ కంట్రోల్ ప్రభుత్వం..
ఆనాడు మన్మోహన్ సింగ్ నేతృత్వంలో ఒక రిమోట్ కంట్రోల్ ప్రభుత్వం ఉండేదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ నగరంలో బీజేపీ నాయకులతో సహా, పోలీస్ అధికారులపై తీవ్రవాదులు దాడులు చేశారని అన్నారు. దిల్సుఖ్నగర్, గోకుల్ చాట్‌తో సహా నగరంలో మూడు చోట్ల ఉగ్రవాదులు బ్లాస్టింగ్స్ చేశారని గుర్తుచేశారు. ఏమీ చేయలేని పరిస్థితిలో భారతదేశం నష్టాన్ని భరించిందని వెల్లడించారు. ఎన్ని దాడులు జరిగినా.. ఆనాటి ప్రభుత్వం పాకిస్థాన్‌ను ఏమీ చేయలేని దుస్థితిలో ఉండేదని తెలిపారు. మరి ఈరోజు ప్రధాని మోదీ నాయకత్వంలో ఎలాంటి మార్పు వచ్చిందో చూస్తునే ఉన్నామని పేర్కొన్నారు కిషన్‌రెడ్డి.
మోదీ ప్రభుత్వంలో సాహోసోపేత ఆపరేషన్లు..
ఆనాడు పాకిస్థాన్ ఆడిందే ఆటగా.. పాడిందే పాటగా.. దేశంలోని అన్ని నగరాల్లో ఐఎస్ఐ ఏజెంట్లను పెట్టుకునేదని కిషన్‌రెడ్డి ఆరోపించారు. సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్స్ కావొచ్చు.. ఆపరేషన్ సిందూర్ లాంటి సాహోసోపేత ఆపరేషన్లను మోదీ ప్రభుత్వం చేపట్టిందని వెల్లడించారు. ప్రపంచ దేశాలు నివ్వెరపోయేలా భారత సైనికులు ఆపరేషన్ సిందూర్‌ని సక్సెస్ చేశారని తెలిపారు. గతంలో ఉగ్రదాడులు జరిగితే.. క్యాండిల్స్ వెలిగించే వాళ్లం.. ఎర్రగులాబీలు పెట్టే వాళ్లం.. కానీ ఇప్పుడు పాకిస్థాన్‌కి బుద్ధి చెబుతున్నామని చెప్పుకొచ్చారు. ఆ దేశం నుంచి ఒక్క డ్రోన్ వచ్చినా.. భారత్ నుంచి హైదరాబాద్‌లో తయారైన బ్రహ్మోస్ క్షిపణి దూసుకువస్తుందని హెచ్చరిస్తున్నామని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
ఆ ఘనత ప్రధాని మోదీది
‘గ్రామీణ ప్రాంతాల్లోని పంచాయతీలకు నిధులు, రోడ్లకు నిధులు, మహిళా సంఘాలకు లోన్లు.. జాతీయ రహదారులతో సహా అమెరికా లాంటి దేశాల్లోని రోడ్లను తలదన్నే విధంగా ఈ రోజు భారతదేశంలో నేషనల్ హైవేల నిర్మాణం జరిగింది. ఇదే హైదరాబాద్ నగరం నుంచి.. ఎక్కడికెళ్లినా.. ప్రపంచస్థాయి రోడ్లు ఉన్నాయి. తెలంగాణలో కొత్తగా 33 జిల్లాలు అయితే.. చాలా తక్కువ సమయంలో 32 జిల్లాల్లో రోడ్లను జాతీయ రోడ్లకు అనుసంధానం చేసిన ఘనత ప్రధాని మోదీది. తెలంగాణలో లక్షా 50 వేల కోట్ల రూపాయలతో జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతోంది. 40 రైల్వేస్టేషన్లు ఏకకాలంలో ఆధునీకీకరిస్తున్నారు. కాంగ్రెస్ హయాంలో ఒక్కటంటే ఒక్క రైల్వే స్టేషన్‌ను కూడా డెవలప్ చేయలేదు. దేశవ్యాప్తంగా 1300 రైల్వే స్టేషన్లను అత్యద్భుతంగా మోదీ ప్రభుత్వం నిర్మిస్తోంది. ఈ దేశంలో ఏ ఒక్క గ్రామం కూడా విద్యుత్ సౌకర్యం లేకుండా ఉండకూడదని.. వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి విద్యుత్ సరఫరా అందిస్తున్న ఘనత ప్రధాని మోదీది. విదేశీ ఎగుమతులు, ఐటీ, డిఫెన్స్ ఎగుమతుల్లో ప్రపంచ దేశాలతో భారత్ పోటీ పడుతోంది. ప్రపంచంలో భారత్ బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతోంది. అన్నిరంగాల్లో వృద్ధి కొనసాగుతోంది. మన దేశంలో కొన్ని రాజకీయ శక్తులు.. ఇతర దేశాలు కొన్నింటికి మోదీ నాయకత్వం, దేశం ఎదుగుదల నచ్చడం లేదు. అందుకే దేశంపై బురద జల్లుతున్నారు. ప్రపంచ దేశాలు ఏ సమావేశం నిర్వహించినా.. భారత ప్రధానిగా మోదీ ఫ్రంట్ లైన్ మధ్యలో నిలబడేంతా స్థాయికి భారత్ ఎదిగింది. ఈరోజు 140 కోట్ల ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా మోదీ ప్రభుత్వం పనిచేస్తోంది. కరోనా సమయంలో పేదలకు కడుపునిండా.. అన్నం పెట్టడం కోసం 80 కోట్ల ప్రజలకు మోదీ ప్రభుత్వం ఈరోజు వరకు కూడా ఉచిత రేషన్ అందజేస్తోంది. 140 కోట్ల మంది ప్రజలకు కరోనా వ్యాక్సిన్ ఇచ్చాం’ అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రన్‌వేపై విమానం.. ఆందోళనలో ప్రయాణికులు
అంబటి రాంబాబుపై మళ్లీ కేసులు నమోదు
For Telangana News And Telugu News
Updated Date - Jun 22 , 2025 | 05:36 PM