BJP MP Laxman: సాక్షి యాజమాన్యంపై ఫైర్ అయిన బీజేపీ ఎంపీ లక్ష్మణ్.. ఎందుకంటే..
ABN, Publish Date - Jun 11 , 2025 | 01:37 PM
దేశ ప్రయోజనాల కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్ణయాలకు ఏపీ సీఎం చంద్రబాబు, బిహార్ సీఎం నితీష్ కుమార్ అండగా నిలబడుతున్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ నేతృత్వంలో ఏపీ అగ్రగామి రాష్ట్రంగా అభివృద్ధి చెందుతోందని వెల్లడించారు.
విశాఖపట్నం: అమరావతి మహిళలకు జరిగిన అవమానంపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ (BJP MP Laxman) స్పందించారు. అమరావతి మహిళలపై జర్నలిస్టులు కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజు, వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. వారి వ్యాఖ్యలను సభ్యసమాజం తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు. మహిళలు ఆవేదనతో నిరసనలు, ధర్నాలు చేస్తున్నారని.. సాక్షి మీడియా సంస్థ ఇప్పటివరకూ పశ్చాత్తాపం వ్యక్తం చేయకపోవడం దురదృష్టకరమని చెప్పుకొచ్చారు ఎంపీ లక్ష్మణ్. భేషజాలానికి పోకుండా సాక్షి యాజమాన్యం దిగివచ్చి తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నీచమైన సంస్కృతిని ఆ యాజమాన్యం ప్రోత్సహించడం మంచిది కాదని అన్నారు. జర్నలిస్టుగా చెప్పుకునే వ్యక్తి కానీ, యాజమాన్యం కానీ ప్రేక్షకపాత్ర వహించడం మంచిది కాదని ఎంపీ లక్ష్మణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉగ్రవాదాన్ని అణచివేసే లక్ష్యంగా ప్రధాని మోదీ సర్కార్ పనిచేస్తోందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. ఆపరేషన్ సిందూర్‌లో మన దేశం వాడిన ఆయుధాలు ప్రపంచాన్ని అబ్బురపరిచాయని ఉద్ఘాటించారు. కశ్మీర్‌లో నిర్మించిన చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ ప్రపంచ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించిందని.. ఇదీ మోదీ సర్కార్ గొప్పదనమని ప్రశంసించారు. భారతదేశంలో డిజిటల్ లావాదేవీలు 49 శాతం జరుగుతున్నాయని వివరించారు. ప్రపంచలోనే భారతదేశాన్ని అగ్రగ్రామి దేశంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ మారుస్తున్నారని తెలిపారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్.
ఇవాళ(బుధవారం) విశాఖపట్నంలో బీజేపీ ఎంపీ లక్ష్మణ్ పర్యటించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. జీఎస్టీ ద్వారా గత నెలలో రికార్డ్ స్థాయిలో రూ.2 లక్షల కోట్లు ఆదాయం వచ్చిందని గుర్తుచేశారు. వక్ఫ్ బిల్లు ముస్లింలకు వ్యతిరేకమని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దేశ ప్రయోజనాల కోసం ప్రధాని మోదీ నిర్ణయాలకు చంద్రబాబు, నితీష్ అండగా నిలబడుతున్నారని ఉద్ఘాటించారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్.
మోదీ, చంద్రబాబు, పవన్‌కల్యాణ్ నేతృత్వంలో ఏపీ అగ్రగామి రాష్ట్రంగా అభివృద్ధి చెందుతుందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ వెల్లడించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తున్నామని తమపై కొంతమంది దుష్ప్రచారం చేశారని ధ్వజమెత్తారు. ప్లాంట్‌ను తాము కాపాడుతున్నామని తెలిపారు. ఏపీలో రైల్వేలు, పోర్టు, ఎయిర్ పోర్ట్స్ అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. మతాలు, కులాలతో చట్టాన్ని ముడిపెట్టడం సరికాదని చెప్పారు. భారతదేశంలో అందరికీ ఒకటే చట్టం ఉండాలి.. ఇది మోదీ వల్లే సాధ్యమని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ పేర్కొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ ఆదేశించాలి..
కాళేశ్వరం ప్రాజెక్టుపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎక్కడా జరగని అవినీతి కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో జరిగిందని ఆరోపించారు. పిల్లర్లు కూలిపోవడం అందర్ని ఆశ్చర్యపరిచిందని అన్నారు. రాజకీయనాయకుల కోసం, కాంట్రాక్టర్ల జేబులు నిపండం కోసమే ఈ ప్రాజెక్టును నిర్మించారని అన్నారు. రేవంత్ సర్కార్‌కి ఏమాత్రం చిత్తశుద్ది ఉన్నా...కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిపై సీబీఐ విచారణకి ఆదేశించాలని కోరారు. అవినీతికి పాల్పడిన వారు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి, ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ తెర మీదకు తీసుకువచ్చినా ఏ ఒక్కటీ ఎందుకు కొలిక్కి రాలేదని ప్రశ్నించారు. తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీజేపీ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, గ్రేటర్ హైదరాబాబ్ ఎన్నికల అంశంపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. గతంలో జగన్, కేసీఆర్ సర్కార్లు బీసీల హక్కులను కాలరాశాయని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ధ్వజమెత్తారు.
విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ కల నెరవేరింది: విష్టుకుమార్ రాజు
విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఈ నెల 21వ తేదీన నిర్వహిస్తున్నామని బీజేపీ ఎమ్మెల్యే విష్టుకుమార్ రాజు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని చెప్పారు. 5 లక్షల మందికి పైగా ఒకే చోట యోగా చేస్తే ..గిన్నిస్ వరల్డ్ రికార్డ్ నమోదువుతోందని అన్నారు. విశాఖపట్నం కేంద్రంగా రైల్వేజోన్ కల నెరవేరిందని...ఈ మధ్యనే జీఎంని కూడా నియమించారని వివరించారు. 11 ఏళ్ల మోదీ పాలన స్వర్ణయుగమని అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని విష్టుకుమార్ రాజు వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
కత్తిని మింగిన పాము.. తర్వాత ఏం జరిగిందంటే..
అంతర్జాతీయ టెర్రరిజానికి తండ్రి పాకిస్థాన్...
For More AP News and Telugu News
Updated Date - Jun 11 , 2025 | 04:55 PM