Mahesh Goud: కవిత తీరును చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు..మహేష్ గౌడ్ సెటైర్లు
ABN, Publish Date - Jul 12 , 2025 | 02:43 PM
దేశ చరిత్రలో 42 శాతం రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌దని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉద్ఘాటించారు. బీసీల పట్ల బీఆర్‌ఎస్‌కి చిత్త శుద్ధి లేదని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ఇచ్చిన మాటకి కట్టుబడి ఉందని నొక్కిచెప్పారు. బీసీ రిజర్వేషన్లు తెచ్చింది కాంగ్రెస్‌నే అని మహేష్ గౌడ్ పేర్కొన్నారు.
హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై (BRS MLC Kavitha) టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కవిత ఏ పార్టీలో ఉందో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్‌లో దెయ్యాలు ఉన్నాయని చెప్పిన కవిత వారి పేర్లు ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. ఇవాళ(శనివారం) గాంధీభవన్‌లో మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ నుంచి దెయ్యాలు పోయాయా? ఉన్నాయా చెప్పాలని నిలదీశారు. తాము బీసీ రిజర్వేషన్లు తెస్తే కవిత రంగులు పూసుకొని తీన్మార్ డ్యాన్సులు చేస్తోందని సెటైర్లు గుప్పించారు. బీఆర్ఎస్ హయాంలో సామాజిక తెలంగాణ రాలేదన్న కవిత ఆ పార్టీకి రాజీనామా ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. కవిత తీరును చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రంగులు, వేషాలు మార్చినంత మాత్రాన పిల్లి, పులి కాలేదని దెప్పిపొడిచారు మహేష్ కుమార్ గౌడ్.
బీసీ రిజర్వేషన్లపై కవిత సంబరాలు చేసుకోవడం హాస్యాస్పదంగా ఉందని మహేష్ కుమార్ గౌడ్ సెటైర్లు గుప్పించారు. కాంగ్రెస్ 42 శాతం రిజర్వేషన్లు చేసినప్పుడు కవితా లిక్కర్ స్కాంలో ఊసలు లెక్కపెడుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి ఎవరికి కట్టబెట్టారని ప్రశ్నించారు. బీసీలపై బీజేపీ చిత్త శుద్ధి ఏంటో తేలిపోయిందని విమర్శించారు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే బీసీలకి రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే అని తాము పదే పదే ఏఐసీసీ హై కమాండ్ దగ్గర పట్టుబట్టడం జరిగిందని గుర్తుచేశారు. తన కోరికను, రాహుల్‌గాంధీ ఆశయాన్ని నెరవేర్చిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రులకు, ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో ఎవరూ దొంగలు..?, హీరోలు..? అన్నది తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని చెప్పుకొచ్చారు. బీసీ రిజర్వేషన్లు కాంగ్రెస్‌తోనే సాధ్యమని నొక్కిచెప్పారు. బీసీలకు చాంపియన్ కాంగ్రెస్... తమ హీరో రాహుల్ గాంధీ.. సీఎం రేవంత్‌రెడ్డి, తాము రాహుల్‌గాంధీ సైనికులమని ఉద్ఘాటించారు మహేష్ గౌడ్.
42 శాతం రిజర్వేషన్లు ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చే ఆర్డినెన్సు చారిత్రాత్మక నిర్ణయమని తెలిపారు. సామాజిక విప్లవానికి నాంది పలికి, చారిత్రాత్మక ఆవిష్కరణ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులుగా ఉండటం తన జీవితంలో చేసుకున్న అదృష్టమని ఉద్గాటించారు. బీసీ రిజర్వేషన్లపై తమకు కితాబు ఇవ్వకపోయినా ఫరవాలేదు కానీ కనీసం స్పందించే స్థితిలో లేకపోవడం దౌర్భాగ్యమని మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీకి అన్ని బిల్లులకు వాళ్ల హయాంలో బీఆర్ఎస్ మద్దతు ప్రకటించిందని గుర్తుచేశారు. బీసీలపై బీఆర్‌ఎస్‌కి చిత్తశుద్ధి లేదని ఫైర్ అయ్యారు. బీసీలు వారి వాట వారు అడిగే స్థితికి వచ్చారని అన్నారు. ఆ నాడు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రకటించానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన మాటకి కట్టుబడి ఉందని నొక్కిచెప్పారు. బీసీ రిజర్వేషన్లు తెచ్చింది కాంగ్రెస్ పార్టీనే అని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
రీసెర్చ్ సెంటర్ ప్రాంగణంలో చిరుతల కలకలం
కల్తీ కల్లు బాధితులకు డయాలసిస్..
Read Latest Telangana News And Telugu News
Updated Date - Jul 12 , 2025 | 03:05 PM