Jubilee Hills Bye Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. డ్రోన్ మానిటరింగ్‌తో భద్రత పెంపు
ABN, Publish Date - Nov 10 , 2025 | 02:48 PM
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సందర్భంగా ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనేపథ్యంలో వివిధ పోలింగు స్టేషన్లకు ఎన్నికల సామాగ్రిని అధికారులు పంపిణీ చేశారు.
హైదరాబాద్, నవంబరు10(ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్ ఉపఎన్నిక (Jubilee Hills Bye Election) రేపు(మంగళవారం) జరుగనుంది. రేపు ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు ఎన్నికల అధికారులు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో మొత్తం 4 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. ఉపఎన్నిక సందర్భంగా 139 ప్రాంతాల్లో 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. యూసఫ్ గూడలోని కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో ఎన్నికల సామాగ్రిని వివిధ పోలింగు స్టేషన్లకు పంపిణీ చేశారు ఎన్నికల అధికారులు.
ఈ సందర్భంగా హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ మీడియాతో మాట్లాడారు. డీఆర్సీ సెంటర్‌లో ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్ కొనసాగుతోందని తెలిపారు. ఎన్నికల సిబ్బందికి ఈవీఎంలు, పోలింగ్ స్టేషన్లని ఎన్నికల అధికారులు కేటాయిస్తున్నారని వివరించారు. ఇవాళ సాయంత్రం ఈవీఎంలతో పోలింగ్ స్టేషన్లకు ఎన్నికల సిబ్బంది చేరుకోనున్నారని వెల్లడించారు. తాను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నానని పేర్కొన్నారు జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్.
డ్రోన్ల ద్వారా సెక్యూరిటీ మానిటరింగ్ చేస్తాం: తఫ్సీర్ ఇక్బాల్
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్ జరుగుతోందని హైదరాబాద్ జాయింట్ సీపీ తఫ్సీర్ ఇక్బాల్ తెలిపారు. ఎన్నికల సిబ్బంది ఇవాళ(సోమవారం) సాయంత్రం పోలింగ్ స్టేషన్లకు చేరుకుంటారని వివరించారు. ఈసారి డ్రోన్ల ద్వారా సెక్యూరిటీ మానిటరింగ్ చేస్తామని చెప్పుకొచ్చారు. ఒక్కో అభ్యర్థికి ఒక్కో పోలింగ్ ఏజెంట్ పాస్ ఇస్తున్నామని వెల్లడించారు. ఆయా రాజకీయ పార్టీల అభ్యర్థులు ఎక్కువ ఉండటంతో పోలింగ్ సమయం సాయంత్రం 6 గంటల వరకు పెంచామని స్పష్టం చేశారు హైదరాబాద్ జాయింట్ సీపీ తఫ్సీర్ ఇక్బాల్.
65 ప్రాంతాల్లో 226 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని వివరించారు. క్రిటికల్ పోలింగ్ స్టేషన్ల వద్ద పారామిలిటరీ బలగాలు ఉంటాయని తెలిపారు. పోలింగ్ స్టేషన్ల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని చెప్పుకొచ్చారు. నియోజకవర్గంలోని స్థానికులు తప్ప ఇతరులను బయటకు పంపుతున్నామని పేర్కొన్నారు. హోటల్స్, హాల్స్, ఫంక్షన్ హాల్స్ అన్నింటిని పరిశీలించి ఇతరులను నియోజకవర్గం నుంచి పంపించేస్తామని తెలిపారు. ఒకవేళ ఇతరులు నియోజకవర్గంలో ఉంటే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇప్పటివరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగలేదని తెలిపారు. 1,761 మంది లోకల్ పోలీసులు బందోబస్తులో ఉంటారని స్పష్టం చేశారు. ఎనిమిది కంపెనీల CISF బలగాలు బందోబస్తులో ఉంటాయని హైదరాబాద్ జాయింట్ సీపీ తఫ్సీర్ ఇక్బాల్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు ఏర్పాట్లు పూర్తి
Read Latest Telangana News And Telugu News
Updated Date - Nov 10 , 2025 | 03:49 PM