Women's WC: దశాబ్దాల నిరీక్షణ తర్వాత.. కలల ‘కప్పు’ దరి చేరిన వేళ!
ABN, Publish Date - Dec 22 , 2025 | 05:11 PM
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 ట్రోఫీని టీమిండియా సగర్వంగా ముద్దాడింది. ఎన్నో ఏళ్ల నిరీక్షణకు ఈ ఏడాది తెర పడింది. షెఫాలీ వర్మ, దీప్తి శర్మ.. వంటి ప్లేయర్లు జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి ట్రోఫీని అందించారు. ఆ మరుపురాని క్షణాలు మరోసారి నెమరువేసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: మన దేశంలో మహిళల క్రికెట్ ఒకప్పటిలా లేదు. చాలా మారింది. ఇంకా మారుతుంది కూడా. అభిమానులు మైదానాలకు వస్తున్నారు. ఆటను ఆస్వాదిస్తున్నారు. ఎన్నడూ లేని ప్రోత్సాహమూ లభిస్తోంది. కానీ ఎంత పురోగతి సాధించినా ఏదో వెలితి. ఏదో తెలియని అసంతృప్తి. దేశంలో క్రికెట్ రూపురేఖల్ని మార్చేసిన కపిల్స్ డెవిల్స్ ‘83’ విజయంలా.. భారత మహిళల క్రికెట్‌కు ఓ కిక్కిచ్చే భారీ విజయం దక్కలేదన్న వేదన అది. కానీ ఆ అసంతృప్తికీ.. ఆ నిరాశకు ఈ ఏడాది తెర పడింది. దశాబ్దాల నిరీక్షణ ముగిసింది. భారత మహిళల స్వప్నం సాకారమైంది. సౌతాఫ్రికాతో ఆఖరి పోరాటంలో చిరస్మరణీయ ప్రదర్శన చేసిన వేళ.. కలల కప్పు అందింది. సొంతగడ్డపై, వేలాది ప్రేక్షకుల మధ్య హర్మన్‌సేన ప్రపంచ కప్పును ముద్దాడింది సంబరంగా.. సగర్వంగా!
ఫైనల్లో భారత అమ్మాయిల ఆట అదరహో! అనూహ్యంగా జట్టులోకి వచ్చిన షెఫాలి వర్మ ఆశించినట్లే బ్యాటుతో చెలరేగిపోయింది. అనుకోని విధంగా బంతితోనూ మాయ చేసింది. ఇంకో అద్భుతం దీప్తి. అమూల్యమైన అర్ధసెంచరీ చేయడమే కాదు.. అయిదు వికెట్లతో ప్రత్యర్థి పతనాన్ని శాసించింది. స్మృతి, రిచా కూడా విలువైన ఇన్నింగ్స్ ఆడగా.. నిలకడైన ప్రదర్శనను కొనసాగించిన తెలుగమ్మాయి శ్రీచరణి ఫైనల్లోనూ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని కట్టిపడేసింది. ఫలితం దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో మట్టికరిపించిన భారత మహిళల జట్టు.. మొట్టమొదటిసారి జగజ్జేతగా నిలిచింది.
షెఫాలీ.. ది క్రికెట్ బ్యూటీ!
దక్షిణాఫ్రికా జట్టు కలలో కూడా అనుకోని ఉండదు.. షెఫా(Shafali Verma)లీ బౌలింగ్‌లో దెబ్బతింటానని! అనూహ్యంగా జట్టులోకి రావడమే ఆశ్చర్యకరం అనుకుంటున్న సమయంలో ఆల్‌రౌండర్ షోతో అద్భుత ప్రదర్శన చేసింది. ఆది నుంచి చక్కని బ్యాటింగ్‌ను కొనసాగించిన ప్రొటీస్ కెప్టెన్ లారా.. లుజ్ (25)తో కలిసి ఇన్నింగ్స్‌ను నడపించడంతో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ సాఫీగా సాగింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ అనూహ్యంగా షెఫాలికి బంతినివ్వడంతో ఆ మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. షెఫాలి తన వరుస ఓవర్లలో లుజ్, కాప్‌ను ఔట్ చేసి ప్రత్యర్థికి షాకిచ్చింది. అటు బ్యాట్‌తోనూ చెలరేగి ఆడిన షెఫాలీ(82).. భారత్‌కు శుభారంభాన్ని అందించింది.
దీప్తి మ్యాజిక్!
ఫైనల్లో షెఫాలి అద్భుత ఆరంభాన్నిచ్చింది. కానీ ఆమె ఔటైపోయాక ఇన్నింగ్స్ గాడి తప్పింది. సెమీస్‌లో గొప్ప ఇన్నింగ్స్‌లు ఆడిన జెమీమా, హర్మన్ విఫలమయ్యారు. అయినా స్కోరు 300కు చేరువైందంటే కారణం.. దీప్తి శర్మ. విలువైన అర్ధశతకంతో ఆమె(Deepti Sharma) మధ్య ఓవర్లలో ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లింది. టోర్నీలో ఇలాగే మరి కొన్ని మ్యాచ్‌ల్లోనూ దీప్తి విలువైన ఇన్నింగ్స్‌లు ఆడింది. మొత్తంగా 9 మ్యాచ్‌ల్లో 215 పరుగులు చేసింది. ఇక బంతితో అయితే ఫైనల్లో దీప్తి గొప్ప ప్రదర్శనే చేసింది. ఏకంగా 5 వికెట్లు పడగొట్టింది.
సీనియర్లు కప్పును ముద్దాడిన వేళ..
ఝులన్ గోస్వామి, మిథాలీ రాజ్ వంటి దిగ్గజాలు వేసిన బాటలోనే పయనిస్తూ.. వారు కన్న కలను ప్రస్తుత టీమిండియా అమ్మాయిలను సాకారం చేశారు. మైదానంలో సీనియర్లు కప్పు అందుకున్న వేళ.. వారి కళ్లతో పాటు ప్రతి అభిమాని హృదయం ధ్రవించింది.
సెమీ ఫైనల్‌లో బలమైన ఆస్ట్రేలియాను మట్టికరిపించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన జెమీమా రోడ్రిగ్స్.. జట్టును ఈ స్థాయిలో నిలబెట్టిన కోచ్ అమోల్ మజుందార్.. చెప్పుకుంటూ పోతే ఈ విజయంలో హీరోలెందరో! మొత్తానికి రాబోయే తరానికి మన అమ్మాయిలే ఆదర్శం అనడంలో సందేహమే లేదు!
ఇవీ చదవండి:
జట్టు ఎంపిక అద్భుతం.. గిల్‌ను తొలగిస్తారని అస్సలు ఊహించలేదు.. భారత మాజీ కెప్టెన్
అది నా ఫేవరెట్ షాట్.. తన ఫామ్‌పై జెమీమా స్పందనిదే!
Updated Date - Dec 22 , 2025 | 05:36 PM