Jemimah Rodrigues: అది నా ఫేవరెట్ షాట్.. తన ఫామ్‌పై జెమీమా స్పందనిదే!
ABN , Publish Date - Dec 22 , 2025 | 02:33 PM
ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా మహిళలు అదరగొట్టారు. 122 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్‌కి దిగి ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించారు. మ్యాచ్ అనంతరం తన సూపర్ ఫామ్‌పై స్టార్ ప్లేయర్ జెమీమా మాట్లాడింది.
ఇంటర్నెట్ డెస్క్: విశాఖపట్నం వేదికగా శ్రీలంకతో టీమిండియా మహిళా జట్టు ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ ఆడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో లంకను భారత జట్టు 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కి దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 121 పరుగులకే పరిమితమైంది. 122 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. 14.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. జెమీమా రోడ్రిగ్స్(69*) తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తూ అర్ధ శతకంతో అదరగొట్టింది. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన జెమీ(Jemimah Rodrigues)కే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కింది. మ్యాచ్ అనంతరం జెమీ మాట్లాడింది.
‘మంచి ఫామ్‌లో ఉన్నప్పుడు దానిని వంద శాతం సద్వినియోగం చేసుకోవాలి. అదే నా మైండ్ సెట్. ఆఫ్‌సైడ్ నా లేట్ కట్ షాట్‌ను అడ్డుకోవడానికి అక్కడ ఎంతమంది ఫీల్డర్లను పెట్టినా గ్యాప్ వెతికి షాట్లు కొడతా. ఆ లేట్ కట్ షాట్ నా ఫేవరెట్. పరిస్థితులను అర్థం చేసుకోవడంపై ఎక్కువ దృష్టిపెడతా. అందరూ అనుకున్నట్లుగా పిచ్ ఫ్లాట్‌గా లేదు. కొంచెం నెమ్మదిగా ఉంది. కానీ నేను మంచి టచ్‌లో ఉన్నాను. బాగా ఆడుతున్నప్పుడు బంతిని బాదడమే పనిగా పెట్టుకుంటా. అందుకే దూకుడును కొనసాగించా. స్కోరు గురించి కూడా ఆలోచించలేదు. మేం బాగా ఆడుతున్నాం. గతంలో ఏం జరిగిందో ఇప్పుడు అవసరం లేదు. త్వరలోనే టీ20 ప్రపంచ కప్ రాబోతోంది. మేం దానిని గెలవాలనుకుంటున్నాం. ఈ సిరీస్‌ను వరల్డ్ కప్‌నకు సన్నాహకంగా ఉపయోగించుకుంటాం’ అని జెమీమా వివరించింది. భారత్, శ్రీలంక మధ్య రెండో టీ20 మంగళవారం (డిసెంబర్ 23) విశాఖపట్నంలోనే జరగనుంది.
ఇవీ చదవండి: