Share News

Rohit Sharma: అప్పుడు తీవ్రంగా కుంగిపోయా.. ఆటను వదిలేద్దామనుకున్నా: రోహిత్

ABN , Publish Date - Dec 22 , 2025 | 11:43 AM

రెండేళ్ల క్రితం జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఆసీస్ చేతిలో ఓటమి అనంతరం తాను క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నానని రోహిత్ శర్మ అన్నాడు. ఆ సమయంలో తనతో పాటు జట్టంతా తీవ్ర నిరాశకు గురైందని ఓ కార్యక్రమం సందర్భంగా నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు హిట్‌మ్యాన్.

Rohit Sharma: అప్పుడు తీవ్రంగా కుంగిపోయా.. ఆటను వదిలేద్దామనుకున్నా: రోహిత్
Rohit Sharma

ఇంటర్నెట్ డెస్క్: 2023 వన్డే ప్రపంచ కప్‌ ఫైనల్లో ఆస్ట్రేలియా(Australia) చేతిలో భారత్ ఘోర పరాజయం చవిచూసినప్పుడే ఆటకు గుడ్‌బై చెప్పాలనుకున్నాని టీమ్ఇండియా వన్డే ఓపెనర్ రోహిత్ శర్మ(Rohit Sharma) తెలిపాడు. ఆ ఓటమితో తీవ్రంగా కుంగిపోయానని, ఒకానొక దశలో క్రికెట్‌ను పూర్తిగా వదిలేద్దామని భావించినట్టు హిట్‌మ్యాన్(Hitman) చెప్పాడు. హరియాణాలోని గురుగ్రామ్‌(Gurugrao)లో ఆదివారం జరిగిన మాస్టర్స్ యూనియన్ స్నాతకోత్సవానికి హాజరైన సందర్భంగా.. నాటి విషయాలను స్మరించుకుని ఎమోషనల్ అయ్యాడు రోహిత్.


'2023 ప్రపంచ కప్(ODI World Cup 2023) ఫైనల్ తర్వాత నాతో సహా జట్టు సభ్యులంతా తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆ పరిస్థితుల్లో ఏం జరిగిందో కూడా నమ్మశక్యంగా అనిపించలేదు. ఆ సమయంలో వ్యక్తిగతంగా నాకు చాలా కఠినంగా అనిపించింది. ఎందుకంటే.. ఆ ప్రపంచ కప్ కోసం కేవలం రెండు మూడు నెలల ముందు కాదు.. 2022లో నేను సారథ్య బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ సన్నద్ధమయ్యాం. వరల్డ్ కప్ గెలవడం నా ఏకైక లక్ష్యం. అది టీ20 ఫార్మాట్ కావచ్చు లేదా 2023 ప్రపంచ కప్ కావచ్చు. కానీ ఆ ఛాన్స్ మిస్ కావడంతో పూర్తిగా కుంగిపోయా. నాలో ఏమాత్రం శక్తి మిగల్లేదు. ఆ పరిస్థితులను అధిగమించేందుకు సుమారు రెండు నెలల సమయం పట్టింది. కష్టపడి పనిచేసినా ప్రతికూల ఫలితాలు వచ్చినప్పుడు అలాంటి భావోద్వేగాలు రావడం సాధారణం' అని హిట్‌మ్యాన్ చెప్పుకొచ్చారు.


ఆ చేదు జ్ఞాపకాలను అలా..

2023 ప్రపంచ కప్ కల చెదరడంతో అప్పుడే క్రికెట్‌కు రిటైర్మెంట్ చెప్పాలనుకునే ఆలోచన వచ్చిందని రోహిత్ తెలిపాడు. క్రికెట్ తన నుంచి అన్నీ తీసుకుపోయినట్టు అనిపించిందని, కానీ జీవితం ఇక్కడితో ముగియలేదని భావించానన్నాడు. ఆ సమయంలో 2024 టీ20 వరల్డ్ కప్‌(T20 World Cup) మీద దృష్టి సారించి.. ఆ ఓటమి తాలుకూ జ్ఞాపకాలను వదిలేశానని పేర్కొన్నాడు. కాగా.. రోహిత్ కెప్టెన్సీలో 2024లో టీమ్‌ఇండియా పొట్టి ప్రపంచ కప్‌ను సాధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత హిట్‌మ్యాన్ అంతర్జాతీయ టీ20ల నుంచి తప్పుకున్నాడు.


రెండేళ్ల క్రితం జరిగిన ఆ వరల్డ్ క‌ప్ సీజన్ అసాంతం పూర్తి ఆధిపత్యం కనబర్చిన భారత జట్టు అజేయంగా ఫైనల్ చేరింది. అయితే.. ఆస్ట్రేలియాతో జరిగిన తుదిపోరులో అటు బ్యాట్స్‌మెన్, ఇటు బౌలర్లు చేతులెత్తేయడంతో ప్రపంచకప్‌నకు అడుగు దూరంలో నిలిచిపోయింది. ఆ మ్యాచ్‌లో ఆసీస్ ఓపెనర్ ట్రావిస్ హెట్ సెంచరీ బాదడంతో రికార్డు స్థాయిలో ఆరోసారి ప్రపంచ కప్‌ను ముద్దాడారు కంగారూలు. అయితే.. ఆ ఓటమిని కొందరు క్రికెట్ అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు.


ఇవీ చదవండి:

అలవోకగా బాదేశారు.. తొలి మ్యాచ్ టీమిండియాదే!

మన కుర్రాళ్ల ఫ్లాప్‌ షో

Updated Date - Dec 22 , 2025 | 12:57 PM