Share News

Pakistan clinched the Under 19 Asia Cup title: మన కుర్రాళ్ల ఫ్లాప్‌ షో

ABN , Publish Date - Dec 22 , 2025 | 04:30 AM

ఓటమనేదే లేకుండా ఫైనల్‌ చేరిన యువ భారత్‌.. కీలక పోరులో ఘోరంగా విఫలమైంది. ఆదివారం ఏకపక్షంగా జరిగిన అండర్‌-19 ఆసియా కప్‌ టైటిల్‌ ఫైట్‌లో ...

Pakistan clinched the Under 19 Asia Cup title: మన కుర్రాళ్ల ఫ్లాప్‌ షో

  • వైభవ్‌ విఫలం

  • అండర్‌-19 ఆసియా కప్‌ విజేత పాకిస్థాన్‌

  • సమీర్‌ అదిరే శతకం

దుబాయ్‌: ఓటమనేదే లేకుండా ఫైనల్‌ చేరిన యువ భారత్‌.. కీలక పోరులో ఘోరంగా విఫలమైంది. ఆదివారం ఏకపక్షంగా జరిగిన అండర్‌-19 ఆసియా కప్‌ టైటిల్‌ ఫైట్‌లో 191 పరుగుల తేడాతో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ చేతిలో చిత్తయింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాక్‌ 50 ఓవర్లలో 8 వికెట్లకు 347 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్‌ సమీర్‌ మిన్హాస్‌ (113 బంతుల్లో 172) శతకంతో విరుచుకుపడడంతో భారత బౌలర్లకు దిక్కుతోచలేదు. అహ్మద్‌ హుస్సేన్‌ (56) హాఫ్‌ సెంచరీ చేశాడు. దీపేష్‌ దేవేంద్రన్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. హనిల్‌, ఖిలన్‌ చెరో రెండు వికెట్లు దక్కించుకొన్నారు. అనంతరం ఛేదనలో భారత్‌ 26.2 ఓవర్లలో 156 పరుగులకు కుప్పకూలింది. దీపేష్‌ (36) టాప్‌ స్కోరర్‌. భారీ ఛేదనలో భారత్‌ టపటపా వికెట్లు చేజార్చుకొంది. కెప్టెన్‌ ఆయుష్‌ మాత్రే (2), వైభవ్‌ సూర్యవంశీ (26)ని అలీ రెజా పెవిలియన్‌ చేర్చడంతో.. భారత్‌ ఏ దశలోనూ ఛేదించే విధంగా కనిపించలేదు. పాక్‌ పేసర్ల షార్ట్‌ పిచ్‌ బంతులకు మనోళ్ల వద్ద సమాధానమే లేకపోయింది. అలీ రెజా నాలుగు వికెట్లు పడగొట్టగా.. సుభాన్‌, ఎహ్‌సాన్‌, సయ్యమ్‌ తలో రెండు వికెట్లు సొంతం చేసుకొన్నారు. పాక్‌ ఆటగాళ్లతో ‘నో హ్యాండ్‌ షేక్‌’ పాలసీని మన క్రికెటర్లు ఈ మ్యాచ్‌లో కూడా పాటించారు.

కాలి దుమ్ముతో సమానం

ధాటిగా ఆడే క్రమంలో వైభవ్‌ వికెట్‌ పారేసుకొన్నాడు. అతడు అవుటై తిరిగి వెళ్తున్న సమయంలో పాక్‌ బౌలర్‌ అలీ రెజా సంబరాలు సూర్యవంశీకి ఆగ్రహం తెప్పించాయి. దీంతో వెనక్కితిరిగి నోటికి పనిచెప్పిన వైభవ్‌.. నువ్వు నా బూటుకు అంటిన దుమ్ముతో సమానం అన్నట్టుగా వేలు చూపిస్తూ సంజ్ఞ చేశాడు. అంతకుముందు భారతకెప్టెన్‌ ఆయుష్‌ అవుటై వెళ్తున్నప్పుడు కూడా అలీ రెజా రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించాడు. దీంతో డగౌట్‌కు వెళ్తున్న ఆయుష్‌ ఆగ్రహంతో వెనక్కి వచ్చి ఏదో అన్నాడు.

ట్రోఫీని బహూకరించిన నఖ్వీ

ఆసియా క్రికెట్‌ మండలి (ఏసీసీ) చీఫ్‌, పాకిస్థాన్‌ మంత్రి అయిన మొహిసిన్‌ నఖ్వీ విజేతలకు పతకాలు, ట్రోఫీని ప్రదానం చేశారు. అయితే, భారత్‌కు చెందిన ప్రతినిధులు ఎవరూ ఈ కార్యక్రమంలో కనిపించలేదు. రన్నరప్‌ చెక్‌ను అఫ్ఘానిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు చైర్మన్‌ మిర్వాసి అష్రఫ్‌ చేతుల మీదుగా భారత కెప్టెన్‌ ఆయుష్‌ అందుకొన్నాడు. కాగా, పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో.. నఖ్వీ నుంచి భారత సీనియర్‌ జట్టు ఆసియా కప్‌ను అందుకొనేందుకు నిరాకరించిన సంగతి తెలిసిందే.

Updated Date - Dec 22 , 2025 | 04:30 AM