T20 WC 2026: జట్టు ఎంపిక అద్భుతం.. గిల్‌ను తొలగిస్తారని అస్సలు ఊహించలేదు.. భారత మాజీ కెప్టెన్
ABN , Publish Date - Dec 22 , 2025 | 03:01 PM
టీ20 ప్రపంచ కప్ 2026కి సంబంధించి టీమిండియా జట్టును ఇప్పటికే ప్రకటించారు. టీ20 వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ను సెలక్టర్లు ఎంపిక చేయలేదు. ఈ అనూహ్య నిర్ణయంపై భారత మాజీ కెప్టెన్ క్రిస్ శ్రీకాంత్ స్పందించారు.
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవలే టీ20 ప్రపంచ కప్ 2026కి సంబంధించి టీమిండియా జట్టును సెలక్టర్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అనుకున్నట్టే జట్టు ఉంటుందని భావించినా.. ఓ అనూహ్య నిర్ణయం అభిమానులతో పాటు క్రికెట్ మాజీలను కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. అదే టీ20 వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌పై వేటు పడటం. ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న గిల్‌కు చివరి అవకాశం ఇస్తారని భావించినప్పటికీ..స్టాండ్ బైగా కూడా సెలక్టర్లు ఎంపిక చేయలేదు. ఈ విషయంపై భారత మాజీ కెప్టెన్, చీఫ్ సెలక్టర్ క్రిస్ శ్రీకాంత్(Kris Srikkanth) మాట్లాడాడు.
‘మొన్నటివరకు పొట్టి ఫార్మాట్‌లో టీమిండియాకు వైస్ కెప్టెన్‌గా ఉన్న శుభ్‌మన్ గిల్(Shubman Gill)ను టీ20 ప్రపంచ కప్ 2026కు పక్కన పెట్టడంతో షాక్ అయ్యా. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని ప్రస్తుత సెలక్షన్ కమిటీ ఇంతటి కఠిన నిర్ణయం తీసుకుంటుందని నేను అస్సలు అనుకోలేదు. ఇది అద్భుతమైన సెలక్షన్. గిల్‌ను తొలగిస్తారని నేను ఊహించలేదు. తొలుత అతడిని వైస్ కెప్టెన్‌గా నియమించారు. ఆస్ట్రేలియా పర్యటనలో కూడా గిల్ వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. వన్డేల్లో గిల్ గొప్ప ఆటగాడు. టెస్టుల విషయానికొస్తే.. ఇంగ్లండ్‌లో భారీగా పరుగులు చేశాడు. కానీ టీ20ల్లో ఇబ్బంది పడుతున్నాడు. ఇషాన్ కిషన్ లేదా ఇతర ప్లేయర్లతో పోలిస్తే గిల్ స్ట్రైక్ రేట్ చాలా తక్కువ. దేశవాళీలో అదరగొట్టిన ఇషాన్‌ను ఎంపిక చేయడం మంచి విషయం. రింకు సింగ్‌ను జట్టులోకి తీసుకున్నారు. మొత్తం మీద సెలక్షన్ కమిటీ అద్భుతమైన టీమ్‌ను ఎంపిక చేసింది. అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ ఓపెనింగ్ చేస్తారు. అభిషేక్ ప్రస్తుతం ప్రపంచంలోనే నంబర్ వన్ బ్యాటర్’ అని క్రిస్ శ్రీకాంత్ అన్నాడు.
ఇవీ చదవండి: