Minister Ponnam Prabhakar: టీ బీజేపీ చీఫ్ అసత్యాలు మాట్లాడుతున్నారు.. మంత్రి పొన్నం ఫైర్
ABN, Publish Date - Jul 27 , 2025 | 07:44 PM
ఎరువుల గురించి తమ ప్రభుత్వంపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎరువులు వచ్చిన స్టాక్ ఎంత.. సరఫరా ఎంత రావాల్సిందో ముందు తెలుసుకోవాలని సూచించారు. రామచంద్రరావు వెంటనే ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వాన్ని అడిగే ప్రయత్నం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు
సిద్దిపేట జిల్లా: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావుకి (Ramasundar Rao) మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రామచంద్రరావుకి గ్రామీణ ప్రాంతాలు, వ్యవసాయం, ఎరువులు ఎక్కడి నుంచి వస్తాయో సరిగా తెలియనట్లు ఉందని విమర్శించారు. మిగతా అన్నిరకాల విత్తనాలు, నీళ్లు, విద్యుత్ అన్ని రకాల వస్తువులు రాష్ట్రాలు ఇస్తాయని.. ఎరువుల తయారీ కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉంటాయని వెల్లడించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు బీజేపీ నేతలు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఇవాళ(ఆదివారం) సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రానికి సరైన విధంగా ఎరువులు సరఫరా చేయమంటే చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేంద్రప్రభుత్వం ఎరువులు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తల్లేదని బీజేపీ నేతలు మాట్లాడటం సరికాదని హితవు పలికారు. దేశంలో 29 రాష్ట్రాల్లో తెలంగాణ పట్ల కేంద్రప్రభుత్వం వివక్ష పూరితంగా వ్యవహారిస్తోందని ఆరోపించారు. రామచంద్రరావు మాటలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ వెళ్లి ప్రధాన మంత్రి నరేంద్రమోదీ దగ్గర కూర్చొని తెలంగాణ రైతులకు అవసరమైన ఎరువులు సరఫరా చేయించాలని కోరారు మంత్రి పొన్నం ప్రభాకర్.
రైతుల దగ్గర తమకు రాజకీయాలు అవసరం లేదని స్పష్టం చేశారు. యావత్ రైతాంగం ఎరువులు కావాలని డిమాండ్ చేస్తోందని.. కేంద్ర ప్రభుత్వాన్ని ఎరువులు సరిపడా సరఫరా చేయాలని తాము కోరుతున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంబంధిత కేంద్రమంత్రిని కలిశారని.. ఎరువులు సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారని గుర్తుచేశారు. బీజేపీ నాయకత్వానికి కనీసం దున్నపోతు మీద వాన పడ్డట్లుగా కూడా లేదని విమర్శించారు. కాంగ్రెస్ ఎరువులు దాచిపెడుతోందని రామచంద్రరావు అసత్యాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు మంత్రి పొన్నం ప్రభాకర్.
కేంద్ర ప్రభుత్వం నుంచి ఎరువులు వచ్చిన స్టాక్ ఎంత.. సరఫరా ఎంత రావాల్సిందో ముందు తెలుసుకోవాలని సూచించారు. రామచంద్రరావు వెంటనే ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వాన్ని అడిగే ప్రయత్నం చేయాలని కోరారు. వ్యవసాయం, రైతులు, పల్లెలు, బీసీలు, ఎస్సీ, ఎస్టీలు అంటే ఆయనకి తెలియదని.. హైదరాబాద్‌లో కూర్చొని ఏది పడితే అది మాట్లాడతానంటే నడవదని హెచ్చరించారు. రైతులు అర్థం చేసుకోవాలని.. ఎరువులు కేంద్రం పరిధిలో ఉంటాయని చెప్పుకొచ్చారు. అన్నదాతలను ఇబ్బంది పెట్టే విధంగా బీజేపీ నేతలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణకు సరిపడా ఎరువులు ఇవ్వాలని రైతుల పక్షాన కేంద్ర ప్రభుత్వాన్నిడిమాండ్ చేస్తున్నామని అన్నారు. కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వెలుగు చూస్తున్న టెస్ట్ ట్యూబ్ బేబీ కేంద్రాల అక్రమాలు..
కర్రు కాల్చి వాత పెట్టాలి.. రేవంత్ ప్రభుత్వానికి కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్
Read latest Telangana News And Telugu News
Updated Date - Jul 27 , 2025 | 08:00 PM