Gaddar Film Awards 2024: తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం
ABN, Publish Date - Jun 15 , 2025 | 07:46 AM
తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో శనివారం (జూన్14) సాయంత్రం ఈ వేడుకని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులతోపాటు రాజకీయ ప్రముఖులు సైతం పెద్దఎత్తున హాజరయ్యారు. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అతిరథ మహారథుల ఆధ్వర్యంలో గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం కన్నులపండువగా సాగింది. అత్యంత వైభవంగా జరిగిన ఈ వేడుకలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పలు విభాగాల్లో ఉత్తమ అవార్డులకు ఎంపికైన ప్రముఖులకు పురస్కారాలు అందజేశారు. 14 ఏళ్లుగా నిలిచిపోయిన ఈ అవార్డుల కార్యక్రమాన్ని ప్రజా ప్రభుత్వం పునరుద్ధరించడమే కాకుండా 2014 నుంచి 2024 వరకు పదేళ్ల కాలానికి గానూ చిత్రరంగంలో ఉత్తమ అవార్డులతో పాటు చలనచిత్ర వైతాళికుల పేరుతో నెలకొల్పిన ప్రత్యేక పురస్కారాలను కూడా ఈ వేడుక ద్వారా అందజేశారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజ్‌ల సమక్ష్యంలో అవార్డులకు ఎంపికైన నటినటులు, దర్శకులు, నిర్మాతలు, సంగీత, సాహిత్యకారులు, సాంకేతిక నిపుణులు, చలన చిత్ర పరిశ్రమలో విశేష కృషి చేసిన ప్రముఖులకు తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అందజేశారు. ఎన్టీఆర్ జాతీయ ఫిల్మ్ అవార్డ్‌ను నందమూరి బాలకృష్ణకి, పైడి జయరాజ్ ఫిల్మ్ అవార్డ్‌ని మణిరత్నంకి, బీఎన్‌రెడ్డి ఫిల్మ్ అవార్డ్‌ని సుకుమార్‌కి, నాగిరెడ్డి- చక్రపాణి ఫిల్మ్ అవార్డ్‌ని అట్లూరి పూర్ణచందర్‌రావుకి, కాంతారావు ఫిల్మ్ అవార్డ్‌ని విజయ్ దేవరకొండకి, రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డ్‌ని యండమూరి వీరేంద్రనాథ్‌కి, ఉత్తమ నటుడు అవార్డ్‌ని అల్లు అర్జున్‌కి, ఉత్తమ నటి అవార్డ్‌ని నివేదా థామస్‌కి అందజేశారు. ఇవేకాకుండా పలు విభాగాల్లోని వారికి అవార్డులను అందజేశారు. ఆస్కార్ అవార్డ్ గ్రహీతలు చంద్రబోస్, ఎంఎం కీరవాణిలను ఈ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సత్కరించారు. గద్దర్ జయంతి వేడుకల నిర్వహణలో భాగస్వామ్యం కల్పిస్తూ ప్రభుత్వం తరఫున రూ. 3 కోట్లకు సంబంధించిన పత్రాన్ని గద్దర్ ఫౌండేషన్ సూర్యకిరణ్‌కి అందజేశారు. సినీపరిశ్రమను ప్రోత్సహించడానికి ప్రజాగాయకుడు గద్దర్ పేరిట అవార్డ్‌లను పునరుద్ధరించడంపై నటీనటులు, సినీ పరిశ్రమ ప్రముఖులు ఈ సందర్భంగా ప్రజా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
Updated Date - Jun 16 , 2025 | 02:21 PM