Juvvadi Sridevi: వర్జీనియాలో జస్టిస్ జువ్వాడి శ్రీదేవికి ఆటా సన్మానం
ABN, Publish Date - Dec 07 , 2025 | 11:15 AM
అమెరికా తెలుగు సంఘం(ఆటా) ఆధ్వర్యంలో వర్జీనియాలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జువ్వాడి శ్రీదేవిని ఘనంగా సన్మానించారు. స్థానిక ప్రవాసులతో ఏర్పాటు చేసిన సమావేశంలో జస్టిస్ శ్రీదేవి తన ప్రేరణాత్మక జీవిత కథను సభికులతో పంచుకున్నారు.
ఇంటర్నెట్ డెస్క్, డిసెంబరు7 (ఆంధ్రజ్యోతి): అమెరికా తెలుగు సంఘం(ఆటా) ఆధ్వర్యంలో వర్జీనియాలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జువ్వాడి శ్రీదేవి (Justice Juvvadi Sridevi)ని ఘనంగా సన్మానించారు. స్థానిక ప్రవాసులతో ఏర్పాటు చేసిన సమావేశంలో జస్టిస్ శ్రీదేవి తన ప్రేరణాత్మక జీవిత కథను సభికులతో పంచుకున్నారు. తనకు చిన్న వయస్సులో వివాహం అయినప్పటికీ, తన విద్యను కొనసాగించి, పిల్లల ఆలనా - పాలనతో పాటు అనేక డిగ్రీలను పొందిన విధానాన్ని వివరించారు జస్టిస్ శ్రీదేవి.
కుటుంబ జీవితాన్ని న్యాయ వృత్తిని సమన్వయం చేస్తూ, ప్రైవేట్ ప్రాక్టీస్‌లోనూ, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా కూడా పనిచేసి, చివరకు హైకోర్టు న్యాయమూర్తిగా నియామకం పొందానని వ్యాఖ్యానించారు. భారత న్యాయ వ్యవస్థలో తన అనుభవాలను, ప్రవాస భారతీయులకు అవి ఎలా అనుసంధానం అవుతాయనేది జస్టిస్ శ్రీదేవి వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రశ్నోత్తరాల సెషన్ నిర్వహించారు.
న్యాయ ప్రక్రియపై జస్టిస్ శ్రీదేవి అవగాహన కల్పించారు. ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా, ట్రస్టీ బోర్డు సభ్యులు విష్ణు మాధవరం, తదితరులు పాల్గొన్నారు. జస్టిస్ శ్రీదేవిని భారతదేశంలో డిసెంబరులో జరిగే ఆటా వేడుకలతో పాటు, 2026 జూలై 31వ తేదీ నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు బాల్టిమోర్‌లో జరిగే 19వ ఆటా కాన్ఫరెన్స్‌కు హాజరుకావాలని ఆహ్వానించారు.
ఈ కార్యక్రమానికి ముందు జస్టిస్ శ్రీదేవి వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ హిల్ భవనాన్ని సందర్శించారు. అమెరికా కాంగ్రెస్ సమావేశాల్లో పాల్గొని బిల్లుల ఆమోద ప్రక్రియను వీక్షించారు. అమెరికా 1810 నుంచి1860 మధ్య అమెరికా సుప్రీం కోర్టుగా వినియోగించిన కార్యాలయాల సముదాయాన్ని పరిశీలించారు. న్యూజెర్సీ పర్యటనలో ప్రఖ్యాత అక్షరధాం ఆలయాన్ని కుటుంబసమేతంగా దర్శించారు జస్టిస్ శ్రీదేవి.
ఈ వార్తలు కూడా చదవండి
పెట్టుబడులపై స్పెషల్ ఫోకస్.. అమెరికాలో లోకేశ్ విస్తృత పర్యటన
ప్రియమైన ఎన్నారై టీడీపీ సైనికులారా కదలిరండి: జయరామ్ కోమటి
Updated Date - Dec 07 , 2025 | 11:21 AM