AP CM Chandrababu: తలెత్తుకునేలా అమరావతి
ABN, Publish Date - May 01 , 2025 | 04:57 AM
అమరావతి రాజధాని పనులు రేపు ప్రధాని మోదీ చేతుల మీదుగా పునఃప్రారంభం కానున్నాయి. రూ.1.07 లక్షల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు జరగనున్నాయి
రేపే రాజధాని పనులు పునఃప్రారంభం
ప్రధాని మోదీ చేతుల మీదుగా
రూ.49,040 కోట్ల పనులకు శ్రీకారం
మరో 57,962 కోట్ల పనులకూ పచ్చ జెండా
అమరావతి స్వయం ఆధారిత ప్రాజెక్టు
మూడేళ్లలోనే మౌలిక సదుపాయాల కల్పన
రాజధాని ఆదాయంతో మరింత వృద్ధి, సంక్షేమం
ఈ నెలలోనే అన్నదాత, తల్లికి వందనం
దేశంలో అత్యధిక పెట్టుబడులు ఏపీకే
వీటిపై తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టండి
ఎంపీలు, ఎమ్మెల్యేలతో టెలీకాన్ఫరెన్స్‌లో సీఎం
ప్రతిష్ఠాత్మకంగా మోదీ సభ.. లోపాలు ఉండొద్దు
మంత్రులు, అధికారులతో చంద్రబాబు సమీక్ష
కర్ణాటక వాళ్లు మా బెంగళూరు, తెలంగాణ ప్రజలు మా హైదరాబాద్, తమిళనాడు వాసులు మా చెన్నై అని అంటారు. మన రాష్ట్ర ప్రజలు కూడా మా అమరావతి అని గర్వంగా చెప్పుకొనేలా రాజధానిని నిర్మిస్తాం.
- సీఎం చంద్రబాబు
అమరావతి/న్యూఢిల్లీ, ఏప్రిల్ 30(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రజలు, రాజధాని రైతుల పోరాటానికి ఫలితం లభించిందని, అన్ని వర్గాల ప్రజలూ, యువత ఆకాంక్ష తీరే విధంగా అమరావతి నిర్మాణం ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. కేంద్రం సహకారంతో రాజధానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ రుణం ఇచ్చాయని తెలిపారు. రాజధానిలో రూ.49,040 కోట్ల పనులకు శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా శ్రీకారం చుట్టనున్నట్టు వెల్లడించారు. వాటితో పాటు రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు డీఆర్‌డీవో, డీపీఐఐటీ, ఎన్‌హెచ్‌ఏఐ, రైల్వేలకు సంబంధించిన మరో రూ.57,962 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారని చెప్పారు. అమరావతి పనుల పునఃప్రారంభానికి శుక్రవారం ప్రధాని మోదీ వస్తున్న నేపథ్యంలో కార్యక్రమ ఏర్పాట్లపై బుధవారం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా స్థాయి నాయకులు, కార్యకర్తలతో మాట్లాడారు. విశాఖలో ఉర్సా కంపెనీ పెట్టుబడులు పెట్టేందుకు ముం దుకొస్తే వారికి ఎకరా రూ.కోటి, రూ.50 లక్షల చొప్ప న కేటాయుంచామని, అయితే 99 పైసలకే ఇచ్చామని వైసీపీ వారు తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేసి తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలన్నారు. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా రాజధానికి భూములు సమీకరించామని, రాష్ట్ర భవిష్యత్తు కోసం రైతులు భూములు ఇచ్చారని తెలిపారు.
ప్రజల నమ్మకాన్ని నిలబెడతాం
‘హైదరాబాద్ అభివృద్ధిలో టీడీపీ పాత్ర చెరగని ది. హైదరాబాద్ వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఆదా యం వస్తోంది. అమరావతి నిర్మాణం ద్వారా వచ్చే ఆదాయంతో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మరిన్ని చేపట్టవచ్చు. రాజధాని స్వయం ఆధారిత ప్రాజెక్టు. మూడేళ్లలోనే మౌలిక సదుపాయాల న్నీ కల్పిస్తాం. పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేస్తాం. విశాఖపట్నంలో టీసీఎస్ స్థాపన ద్వారా భారీగా ఉద్యోగాలు లభించనున్నాయి.
భోగాపురం విమానాశ్రయాన్ని కూడా శరవేగంగా నిర్మిస్తున్నాం. శ్రీసిటీలో ఎల్‌జీ కంపెనీ రూ.5 వేల కోట్లతో పెట్టుబడులు పెట్టనుంది. దేశంలో అత్యధిక పెట్టుబడులు మన రాష్ట్రానికే వస్తున్నాయి. రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు స్వర్ణాంధ్ర విజన్-2047 రూపొందించుకున్నాం. రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని ఎన్నికలకు ముందు చెప్పాం. ప్రజలు నమ్మి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని 93 శాతం స్ట్రైక్ రేట్‌తో గెలిపించారు. వారి నమ్మకాన్ని సాకారం చేసేందుకు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకెళ్తున్నాయి. ఈ 10 నెలల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టాం. మే నెలలోనే అన్నదాత, తల్లికి వందనం పథకాలు ప్రారంభిస్తాం’ అని చంద్రబాబు తెలిపారు.
3 పార్టీల కార్యకర్తలకూ ప్రాధాన్యం
కష్టపడ్డ కార్యకర్తలను గుర్తించేందుకు నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తున్నామని సీఎం తెలిపారు. జిల్లాల పర్యటనలకు వెళ్లిన సమయంలో 8 నియోజకవర్గాల కార్యకర్తలతో నేరుగా సమావేశమయ్యానని, వారి సమస్యలు తెలుసుకున్నానని చెప్పారు. కార్యకర్తల మనోభావాలకు విరుద్ధంగా ఏ నాయకుడూ వ్యవహరించడానికి అవకాశం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి ఎంత ప్రాధాన్యం ఇస్తానో.. కార్యకర్తల కూ అంతే ఇస్తానని తెలిపారు. కడపలో మహానాడును ఘనంగా నిర్వహించుకుందామని, ఏ ఎన్నికలు జరిగినా ఎన్డీయేనే గెలవాలని అన్నారు.
మొత్తం 1,07,002 కోట్ల పనులు
అమరావతి పనుల పునఃప్రారంభ కార్యక్రమంలో ప్రధాని మోదీ చేతుల మీదుగా మొత్తం రూ.1,07,002 కోట్ల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరగనున్నాయి. రూ.49,040 కోట్ల రాజధాని పనులకు శంకుస్థాపన చేయనున్నారు. రాజధాని ప్రాజెక్టులతో పాటు సుమారు రూ.57,962 కోట్ల విలువైన కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు అమరావతి వేదికగా వర్చువల్ పద్ధతిలో మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
58 వేలకోట్ల ప్రాజెక్టులు జాతికి అంకితం
రూ.58 వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను అమరావతి వేదికగా మోదీ జాతికి అంకి తం చేయనున్నట్టు పీఎం వో వర్గాలు తెలిపాయి. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, అనుసంధాన పథకాల కల్పనలో భాగంగా ఏడు జాతీయ రహదారుల ప్రాజెక్టులను ప్రారంభిస్తారని వెల్లడించాయి. ఒక రైల్వే ప్రాజెక్టు నిర్మాణానికి మోదీ శంకుస్థాపన చేయనున్నారు.
శంకుస్థాపనలు
రూ.11,240 కోట్ల వ్యయంతో శాసనసభ, హైకోర్టు, సచివాలయంతో పాటు ఇతర పరిపాలన భవనాలు, 5,200 కుటుంబాలకు గృహవసతి నిర్మాణం వంటి ప్రాజెక్టులు
కృష్ణా జిల్లా నాగాయలంకలో డీఆర్‌డీవో ఆధ్వర్యంలో సుమారు రూ.1,500 కోట్లతో నిర్మించే మిస్సైల్ టెస్ట్ రేంజ్
విశాఖలో కేంద్ర ప్రభుత్వం నిర్మించే యూనిటీ మాల్
రూ.293 కోట్లతో గుంతకల్లు వెస్ట్ నుంచి మల్లప్ప గేట్ వరకు చేపట్టిన రైల్వే ప్రాజెక్టు
రూ.3,176 కోట్ల విలువైన నేషనల్ హైవే ప్రాజెక్టులు
ప్రారంభోత్సవాలు
రూ.3,680 కోట్ల విలువైన పలు జాతీయ రహదారి పనులు
రూ.254 కోట్లతో పూర్తి చేసిన ఖాజీపేట-విజయవాడ 3వ లైన్, గుంటూరు-గుంతకల్లు డ బ్లింగ్ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన బుగ్గనప ల్లి, కేయీఎఫ్ పాణ్యం లైన్‌ల ప్రారంభోత్సవం
ఎక్కడా లోపాలు రానివ్వొద్దు
‘ప్రధాని మోదీ సభను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నాం. సభ నిర్వహణలో ఎక్కడా లోపాలు రానివ్వొద్దు’ అని ఉన్నతాధికారులు, మంత్రులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రధాని సభ ఏర్పాట్లపై బుధవారం ఉన్నతాధికారులు, అందుబాటులో ఉన్న మంత్రులతో సచివాలయంలో సీఎం సమావేశమయ్యారు. సభకు వచ్చే వారికి సీట్ల ఏర్పాట్లు మొదలుకొని పార్కింగ్ వరకు ఎక్కడా ఎలాంటి లోపాలు ఉండకూడదన్నారు. సభకు వచ్చే ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించాలని, వర్షం వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేకుండా సభ నిర్వహణ జరిగేలా ఏర్పాట్లు ఉండాలని, పార్కింగ్ ప్రదేశాల వద్ద కూడా వర్షం వచ్చినా ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
నేడు నెల్లూరు జిల్లాలో సీఎం పర్యటన
సీఎం చంద్రబాబు గురువారం నెల్లూరు జిల్లా ఆత్మకూరులో పర్యటించనున్నా రు. ఈ పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. బుధవారం ఆయన సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించా రు. గురువారం ఉదయం 11.30కు సీఎం చంద్రబాబు ఆత్మకూరు చేరుకుంటారన్నారు. 11.50కి నెల్లూరుపాళెంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో పాల్గొని, గిరిజనుల సమస్యలు తెలుసుకుంటారన్నారు. అనంతరం మే డే సందర్భంగా కార్మికులతో ముఖాముఖి నిర్వహిస్తారని చెప్పారు.
Also Read:
సామ్ కర్రన్ సూపర్ ఇన్నింగ్స్.. ఛాహల్ హ్యాట్రిక్
రిటైర్మెంట్‌పై బాంబు పేల్చిన ధోని
ఇలాంటి దోపిడీ ఎక్కడైనా చూశారా..
For More Andhra Pradesh News and Telugu News..
Updated Date - May 01 , 2025 | 04:58 AM