Heavy Rains IN AP:ఏపీలో భారీ వర్షాలు.. ప్రభుత్వం అప్రమత్తం
ABN, Publish Date - May 04 , 2025 | 02:45 PM
Heavy Rains IN AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రం ప్రభుత్వం అప్రమత్తమైంది. వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా అధికారులను సంప్రదించాలని సూచించింది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ(ఆదివారం) ఉదయం నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడుతోంది. ఈదురు గాలుల దాటికి చెట్లనుంచి మామిడికాయలు రాలిపోయాయి. దీంతో మామిడి రైతులు లబోదిబోమంటున్నారు. పలుచోట్ల రహదారుల వెంట వృక్షాలు నేలకొరిగాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించడంతో వాహనదారులు తిప్పలు పడుతున్నారు. వర్షం ప్రభావంతో లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది.
అధికారులకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ కీలక ఆదేశాలు...
సంబంధిత అధికారులతో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఆయా జిల్లాలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని అన్నారు. విద్యుత్ శాఖ అధికారులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే విద్యుత్ శాఖ అధికారులతో ఫోన్‌లో మాట్లాడానని మంత్రి గొట్టిపాటి తెలిపారు. గాలివానకు నేలకొరిగిన విద్యుత్ స్తంభాలను వెంటనే పునరుద్ధరించి విద్యుత్ సరఫరా చేయాలని అన్నారు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సూచించారు.
ఎన్టీఆర్ జిల్లాలో భారీ వర్షం..
ఎన్టీఆర్ జిల్లాలో భారీ వర్షం పడుతోంది. చెట్లు, హోర్డింగ్‌లు నేలకొరిగాయి. రోడ్లపై మోకాళ్ల లోతులో నీరు నిలిచింది. స్వయంగా కలెక్టర్ లక్ష్మీ శా రంగంలోకి దిగారు. మోటార్లు పెట్టి నీటిని తోడించే చర్యలను కలెక్టర్ చేపట్టారు. రోడ్లపై పడిన చెట్లను యుద్ద ప్రాతిపదికన తొలగించేలా దగ్గరుండి కలెక్టర్ లక్ష్మీ శా పర్యవేక్షించారు. ఈరోజు ఈదురు గాలులతో కూడిన వర్షం పడిందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ శా తెలిపారు. ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టామని అన్నారు. కూలిన చెట్లను వెంటనే తొలగించామని చెప్పారు. రేపు, ఎల్లుండి కూడా ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడతాయని అన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చెట్ల కింద నిల్చోవద్దని, వాహనాలు రక్షణగా ఉండే ప్రదేశాల్లో పార్కింగ్ చేయాలని చెప్పారు. వర్షాలు పడే సమయంలో తప్పని సరైతేనే ప్రజలు బయటకు రావాలని అప్రమత్తం చేశారు. కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది వచ్చినా కాల్ చేయాలని కలెక్టర్ లక్ష్మీ శా సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి
Minister Atchannaidu: బెంగళూరులో ఫుల్‌టైం తాడేపల్లిలో పార్ట్‌టైం
Minister TG Bharath: లేపాక్షి భూములకు త్వరలో విముక్తి
YS Sharmila: రాష్ట్రానికి నిధులు కావాలి అప్పు కాదు
For More AP News and Telugu News
Updated Date - May 04 , 2025 | 02:53 PM