Share News

YS Sharmila: రాష్ట్రానికి నిధులు కావాలి అప్పు కాదు

ABN , Publish Date - May 04 , 2025 | 06:04 AM

రాజధాని అమరావతికి నిధులు అవసరం, అప్పులు కాదు అని పీసీసీ చీఫ్ షర్మిల పేర్కొన్నారు. ప్రధాని మోదీ మాటలు నమ్మి మోసపోకూడదని సీఎం చంద్రబాబుకు సూచించారు

YS Sharmila: రాష్ట్రానికి నిధులు కావాలి అప్పు కాదు

  • చంద్రబాబూ... మోదీని నమ్మి మోసపోకండి: షర్మిల

అమరావతి, మే 3(ఆంధ్రజ్యోతి): ‘‘రాష్ట్ర అభివృద్ధికి, రాజధాని అమరావతికి కావాల్సింది అప్పులు కాదు, నిధులు. ‘అభివృద్ధి చేస్తాం... భుజాలు కలుపుతాం’ అంటూ మళ్లీ ప్రధాని నరేంద్ర మోదీ చెపుతున్న బూటకపు మాటలు నమ్మి మోసపోవద్దు’’ అని పీసీసీ చీఫ్‌ షర్మిల, సీఎం చంద్రబాబుకు సూచించారు. శనివారం ఎక్స్‌ వేదికగా ఆమె ప్రధాని పర్యటనపై స్పందించారు. ‘ఐదు కోట్ల మంది కలల సౌధం అమరావతికి 2015 నుంచి అన్నీ చేశామని పచ్చి అబద్ధాలు చెప్పారు. అన్నీ ఇస్తే మాకు రాజధాని నిర్మాణం ఇంతవరకు ఎందుకు కాలేదు? అమరావతి నిర్మాణానికి ఖర్చయే రూ.లక్ష కోట్లలో ఒక్క రూపాయి అయినా ప్రకటించారా? రాజధాని నిర్మాణం కేంద్రం బాధ్యత అని హామీ ఇచ్చారా? విభజన హామీలపై టైమ్‌ బౌండ్‌ క్లారిటీ ఇచ్చారా? చంద్రబాబు ఆత్మ పరిశీలన చేసుకోవాలి.


మోదీని నమ్మి ఆయన మళ్లీ మళ్లీ మోసపోతున్నారు. రాష్ట్రం రూ.10 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని, అప్పు పుట్టందే జీతాలకు దిక్కులేదని చెప్పే మీరు... రాజధాని నిర్మాణానికి ఎవరిని అడిగి రూ.60 వేల కోట్లు అప్పు తెస్తున్నారు? వాటిపై వడ్డీల భారం మోసేదెలా? కేంద్రం మెడలు వంచే దమ్ములేక భావి తరాల మీద అప్పు భారాన్ని వేస్తారా?’ అని షర్మిల ప్రశ్నించారు.

Updated Date - May 04 , 2025 | 06:04 AM