Minister TG Bharath: లేపాక్షి భూములకు త్వరలో విముక్తి
ABN , Publish Date - May 04 , 2025 | 05:56 AM
లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూముల సమస్యకు త్వరలో పరిష్కారం లభించనున్నట్లు మంత్రి టీజీ భరత్ తెలిపారు. పదినెలల్లో రూ.8.5 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చిన ఘనత చంద్రబాబుదని అన్నారు

రాష్ట్రానికి చంద్రబాబు ఎవరెస్ట్ శిఖరం
పది నెలల్లో రూ.8.5లక్షల కోట్ల పెట్టుబడులు: మంత్రి టీజీ భరత్
హిందూపురం, మే 3(ఆంధ్రజ్యోతి): హిందూపురం లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూములకు త్వరలో విముక్తి కలిగే అవకాశం ఉందని పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత్ చెప్పారు. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో శనివారం జరిగిన వాసవీ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూములు 10 వేల ఎకరాలున్నాయి. ఆ భూముల సమస్య పరిష్కారంపై సీఎం ప్రత్యేక దృష్టి పెట్టారు. అది పరిష్కారమైతే ఈ ప్రాంతానికి పెద్దఎత్తున పరిశ్రమలు వస్తాయి. తద్వారా ఉద్యోగ అవకాశాలు కూడా పెద్దఎత్తున వస్తాయి’ అని చెప్పారు.
స్వాతంత్య్రం వచ్చాక రాయలసీమను అభివృద్ధి చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక్కరేనని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబు ఎవరెస్ట్ శిఖరంలాంటివారని, ఆయన ఎప్పుడూ భవిష్యత్తు తరాల గురించే ఆలోచిస్తారని పేర్కొన్నారు. పదినెలల్లో రాష్ట్రానికి 8.5లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని, ఈ ఘనత సీఎం చంద్రబాబుదేనని చెప్పారు. వైసీపీ హయాంలో ఆర్యవైశ్యులు చాలా ఇబ్బందులు పడ్డారని, నష్టపోయారని, కష్టపడ్డారని మంత్రి భరత్ అన్నారు.