HarishRao: రేవంత్ పాలనలో గురుకులాలు నిర్వీర్యం.. హరీష్‌రావు ఫైర్
ABN, Publish Date - Jun 30 , 2025 | 11:07 AM
రేవంత్ పాలనలో గురుకుల పాఠశాలలు, కళాశాలల పరిస్థితి రోజురోజుకూ దిగజారుతుండటం శోచనీయమని మాజీమంత్రి హరీష్‌రావు అన్నారు. జనవరి నుంచి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో కోడిగుడ్లు, మాంసం, అరటి పండ్ల సరఫరా నిలిచిపోయాయని చెప్పారు.
హైదరాబాద్: బీఆర్ఎస్ పాలనలో దేశానికే ఆదర్శమైన గురుకులాలు.. రేవంత్ ప్రభుత్వ (Revanth Government) పాలనా వైఫల్యం వల్ల నిర్వీర్యం అవుతున్నాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు (BRS MLA HarishRao) ఆరోపించారు. విద్యావ్యవస్థపై కాంగ్రెస్ చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరితో లక్షలాది మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల భవిష్యత్త్‌ని ప్రశ్నార్థకం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా హరీష్‌రావు ట్వీట్ చేశారు.
రేవంత్ పాలనలో గురుకుల పాఠశాలలు, కళాశాలల పరిస్థితి రోజురోజుకూ దిగజారుతుండటం శోచనీయమని హరీష్‌రావు అన్నారు. జనవరి నుంచి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో కోడిగుడ్లు, మాంసం, అరటిపండ్ల సరఫరా నిలిచిపోయాయని చెప్పారు. బకాయిలు చెల్లించకుంటే జులై ఒకటోవ తేదీ నుంచి అన్నిరకాల ఆహార పదార్థాలు, ఇతర సామాగ్రి సరఫరాను నిలిపి వేస్తామని కాంట్రాక్టర్లు హెచ్చరించే పరిస్థితి వచ్చిందని చెప్పుకొచ్చారు. మరోవైపు 13 నెలలుగా రూ. 450 కోట్లకు పైగా అద్దె బకాయిలు చెల్లించకపోవడంతో ఆయా భవనాల యజమానులు తాళాలు వేస్తున్న దుస్థితి ఉందని చెప్పారు. విద్యాసంవత్సరం ప్రారంభమై ఇన్ని రోజులు అవుతున్నా ఇప్పటి వరకు యూనిఫాం, టై, బెల్ట్, బూట్లు, స్కూల్ బ్యాగులు ఇవ్వకపోవడం సిగ్గుచేటని విమర్శించారు హరీష్‌రావు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల్లో యూనిఫామ్‌లు ఇవ్వకపోవడంతో పిల్లలు పాత, చినిగిపోయిన దుస్తులు వేసుకుంటున్నారని హరీష్‌రావు ఆరోపించారు. పదేళ్లలో అద్భుతంగా నడిచిన గురుకులాల వ్యవస్థ, రేవంత్ పాలనలో కుదేలవుతుండటం దురదృష్టకరమని చెప్పారు. దిగజారుతున్న గురుకులాల ఖ్యాతిని నిలబెట్టాలని, ఎస్సీ ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన పేదపిల్లల భవిష్యత్‌ను కాపాడాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురుకుల కాంట్రాక్టర్ల పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న గురుకులాల బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆహార పదార్థాలు, ఇతర సామగ్రి సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని అన్నారు. యూనిఫామ్, బూట్లు, స్కూల్ బ్యాగులు తక్షణమే పంపిణీ చేయాలని హరీష్‌రావు కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి
విదేశాల్లోనూ తెలంగాణ జాగృతి శాఖలు
పసుపు బోర్డుతో దేశవ్యాప్తంగా రైతులకు సేవలు
Read Latest Telangana News And Telugu News
Updated Date - Jun 30 , 2025 | 11:20 AM