Qatar Telugu Community Elections: ఖతర్‌లో తెలుగు సంఘాల ఎన్నికల తీరు నవ్వుల పాలు
ABN, Publish Date - Oct 12 , 2025 | 09:28 PM
మాతృభూమికి దూరంగా విదేశాల్లో ఉంటూ తమ సంస్కృతిని పరిరక్షించుకోవడంతో పాటు అపదలో ఉండే సహచర తెలుగువారికి ఆపన్నహస్తం అందించడానికి ఉద్దేశించిన తెలుగు ప్రవాసీ సంఘాలు ఒక ప్రహాసంగా మారుతున్నాయి.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: మాతృభూమికి దూరంగా విదేశాల్లో ఉంటూ తమ సంస్కృతిని పరిరక్షించుకోవడంతో పాటు ఆపదలో ఉండే సహచర తెలుగువారికి ఆపన్నహస్తం అందించడానికి ఉద్దేశించిన తెలుగు ప్రవాసీ సంఘాలు (Telugu Associations Qatar) ఒక ప్రహాసంగా మారుతున్నాయి. ఖతర్‌లోని తెలుగు సంఘాల నిర్వహణ తీరు, ఎన్నికల మాయజాలం, కుటుంబ అధిపత్యం, పారదర్శకత లోపం వైరసీ అన్ని కలిసి స్వదేశంలోని అవకాశవాద రాజకీయాలను సైతం మించిపోతున్నాయి.
రెస్టారెంట్లు అందించే ఫ్యామిలీ ప్యాకుల తరహా తెలుగు సంఘాల నాయకులు కుటుంబ సభ్యులందరికీ పదవులు పంచుకుంటూ నవ్విపోదూరు గాక నాకేమిటి అంటున్నారు. శ్రీలంక (Sri Lanka)లో మహేంద్ర రాజపక్సే (Mahendra Rajapaksa) కుటుంబ సభ్యుల తరహా అన్ని పదవులు తామే పంచుకుంటున్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh), తెలంగాణ (Telangana) లేదా పాత తరం, యువతరం అంటూ ఏమి వ్యతాసం లేదు. అందరూ ఒకే తాను ముక్కలనే ఒక వాదన ఉండగా ఏలాంటి క్రియాశీలక పాత్ర లేకుండా కేవలం కుటిల రాజకీయాలతో సభా వేదిక ఎక్కి కూర్చిలపై కూర్చునే ఓల్డ్ గార్డ్‌కి అడ్డుకట్ట వేయడానికి ఈ ఎన్నికల్లో యువతరం గెలుపు అవసరమనే మరో వాదన కూడా ఉంది.
దుస్తులు మార్చినట్లుగా సొంత రాష్ట్రాలనూ కూడా మార్చుకుంటూ పదవుల కోసం వెంపర్లాడుతున్నారు. నియమాలను తప్పించుకోవడానికి ఒకసారి భార్యకు అవకాశం ఇచ్చి.. ఆ తర్వాత భర్తలు మళ్లీ తామే ఆసీసులై భార్యలను అపెక్స్ బాడీల్లో తాత్కాలిక పునరవాసం కల్పిస్తున్నారు. ఒక రకంగా పదవులను రీసైక్లింగ్ చేసుకోంటున్నారు.
తాజాగా ఒక తెలుగు సంఘానికి జరుగుతున్న ఎన్నికలు ఖతర్‌లో చర్చనీయాంశంగా మారాయి. ఒక వ్యక్తి అధీనంలో ఉంటున్న ఈ సంఘం అధినేత సెఫ్ జోన్ తన తరఫున ఆయన భార్యను అధ్యక్ష పదవికి పోటీ చేయించడం ద్వారా నిమిత్త మాత్ర ఎన్నికల ప్రక్రియకు వెళ్లి వచ్చే ప్రయత్నం చేయగా అనూహ్యంగా ఒక నాయకుడు దాని అధ్యక్ష పదవికి పోటీపడుతుండటం ఆసక్తికరంగా మారింది. ఈ సంఘం ఎన్నికలు ముగిసిన వెంటనే మరో సంఘం ఎన్నికలకు కూడా రంగం సిద్ధం కావడంతో ఈ శిబిరంలో అవకాశం లభించని వారు.. ఆ శిబిరంలోనూ స్థానం కోసం వ్యూహాత్మకంగా పావులు కదుపుతుండటం ఖతర్‌లోని తెలుగు ప్రవాసీ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. ఈ క్రమంలో ప్యానళ్లలో కోవర్టు రాజకీయాలు కూడా ఊపందుకోన్నాయి.
పోలీంగ్‌కి మరో రెండు రోజులే మిగిలి ఉండగా ఇరువర్గాలు కూడా పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి. ఈ సంఘం తమ కష్టార్జితమని దీనికి తానూ లేదా తన భార్య లేదా తానూ సూచించిన వారు మాత్రమే హక్కుదారులంటూ ఒక వర్గం తన ప్రచారంలో నొక్కి చెబుతుంది. కుటుంబ పాలన అరోపణలని తిప్పికొడుతూ ప్రత్యర్ధి పక్షానా ప్రచారం చేస్తున్న ఒక నాయకుడు తన అల్లుడికి, కూతురికి రెండు వేర్వేరు సంఘాల్లో పదవులతో పాటు త్వరలో జరిగే మరో సంఘం ఎన్నికల్లో కూడా తానూ పోటీ చేయడానికి అన్ని నైతిక నియమాలు గాలికొదిలి.. కుటుంబ అధిపత్యం ఆరోపణ కేవలం తనపై మాత్రమే వేయడం ఎందుకని ప్రశ్నిస్తోంది.
దుస్తులు మార్చినట్లుగా సొంత రాష్ట్రాలను కూడా మార్చుకుంటూ పదవుల కోసం వెంపరలాడుతున్నారు. విదేశాల్లో తెలంగాణ బతుకమ్మకు ప్రతీక, ప్రత్యేక తెలంగాణ సాధించిన మాజీ సీఎం కేసీఆర్ (KCR) కూతురు కవిత నాయకత్వంలోని తెలంగాణ జాగృతికి ఖతర్‌లో ఆంధ్ర మహిళ అధ్యక్షురాలుగా ఉండగా లేని ప్రాంతీయత సమస్య.. ప్రస్తుతం ఒక మహిళ కేవలం ఎంసీ స్థానానికి పోటీ చేస్తే ఎందుకని ఇంకో వర్గం ప్రశ్నిస్తోంది. కర్ణాటక చిరునామాతో పాస్ పోర్టులు కలిగిన వారు కూడా తెలుగు సంఘాలకు పోటీ చేస్తే లేని అభ్యంతరం ఆమెపై ఎందుకని కూడా వారు ప్రశ్నిస్తున్నారు. సమన్వయం అనే తమిళ సంఘానికి రాజస్ధాన్ ప్రవాసీ నేతృత్వం వహిస్తున్న విషయాన్ని వారు ఇక్కడ ఊదహరిస్తున్నారు.
ఒక కీలక సంఘానికి నేతృత్వం వహించి ఏలాంటి కార్యకలాపాలు నిర్వహించని వ్యక్తికి, అతని కుటుంబానికి పదవులు, సంఘాలు ఎందుకంటూ అవతలి వర్గం ప్రశ్నలు సంధిస్తోండగా ఖతర్ చరిత్రలో లేని విధంగా భారీ సాంస్కృతిక ప్రదర్శనకు తాము అన్ని ఏర్పాట్లు చేశామని.. కానీ అనివార్య కారణాలతో ఆ కార్యక్రమం రద్దయిందని ఈ వర్గం వివరిస్తుంది. అయినా ఆ తర్వాత తాము మరో నాలుగు సంఘాలతో కలిసి ఖతర్‌లో చెప్పుకోదగ్గ స్ధాయిలో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించామని చెబుతుంది. మెగా కార్యక్రమం నిర్వహణకు తాను భారీగా నిధులు ఇచ్చానని ఒక వ్యక్తి చెబుతుండగా వాటిని తిరిగి ఇచ్చానని ప్రత్యర్థి వ్యక్తి చెబుతున్నాడు. మెగా కార్యక్రమం కోసం సమకూర్చిన నిధులు అగ్నికి అజ్యం పోశాయనేది కొందరి అభిప్రాయం.
ప్రస్తుతం అధ్యక్ష పదవి పోటీలో ఉన్న ఇద్దరిలో ఒకరూ సామాజిక, సంక్షేమ కార్యక్రమాల్లో చురుగ్గా ముందుకు వెళ్తూ ఆర్థికంగా చేయూత ఇస్తారనే పేరుండగా, మరోకరికి సంఘాన్ని స్ధాపించి నృత్య, సాంస్కృతిక కార్యకలాపాలు నిర్వహిస్తూ వాట్సాప్, డిజిటల్ ప్రచారంలో ముందుంటారనే కుటుంబ నేపథ్యం ఉంది. ఈ ఇద్దరికీ బలమైన సామాజిక వర్గాల నేపథ్యం ఉంది. ఈ ఇద్దరిలో మహిళ గెలిస్తే గతంలో ఈ తరహా సంఘం ఆమె భర్త నాయకత్వంలో నడిచే ఆవకాశం ఉండగా, బలమైన నాయకుడు నెగ్గితే ఆయనని బలపరస్తున్న ఓల్డ్ గార్డ్ అన్ని తామై నడిపిస్తుందనే అభిప్రాయం ఉంది.
ఏది ఏమైనా ఎవరూ గెలిచినా అన్ని వర్గాలను కలుపుకుంటూ కేవలం సినీ నృత్యాలు, పాటలు మాత్రమే కాదు నిజమైన తెలుగు సంస్కృతీ వికాసం, ఆపదలో ఉన్న వారికి ఆపన్నహస్తం అందించే విధంగా కృషి చేయాలని కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి
డల్లాస్‌లో సీనియర్ ఐఏఎస్ దాసరి శ్రీనివాసులు పర్యటన
వర్జీనియాలో అంగరంగ వైభవంగా శ్రీనివాస కళ్యాణం
Read Latest NRI News And Telugu News
Updated Date - Oct 12 , 2025 | 09:51 PM