India- Pakistan War: రెండు దేశాల మధ్య కీలక చర్చలు
ABN, Publish Date - May 12 , 2025 | 09:24 AM
India- Pakistan War: పాకిస్తాన్, భారతదేశాల మధ్య సోమవారం నాడు కీలక చర్చలు జరుగనున్నాయి. ఈ చర్చల్లో పలు అంశాలను రెండు దేశాలు ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయి. ఈ చర్చలు రెండు దేశాలకు ఎంతో ప్రాధాన్యం కానున్నాయి.
ఢిల్లీ: పాకిస్తాన్ (Pakistan), భారతదేశాల (India) మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో సరిహద్దుల్లో కాల్పుల విరమణ, తదనంతర పరిస్థితిపై భారత్, పాకిస్తాన్ మధ్య ఇవాళ(సోమవారం) మధ్యాహ్నం కీలక చర్చలు జరుగనున్నాయి. ఈ చర్చలను ఇరు దేశాల డైరెక్టర్ జనరల్ మిలటరీ ఆపరేషన్స్ - డీజీఎంఓలు జరుపనున్నారు. ఇరు దేశాల మధ్య మధ్యాహ్నం 12గంటలకు హాట్‌లైన్‌లో చర్చించనున్నారు. 48 గంటల పాటు కాల్పుల విరమణ, కొనసాగింపు, ఉద్రిక్త వాతావరణం తగ్గించడం వంటి కీలక అంశాలపై ఇరు దేశాలు చర్చించనున్నాయి.
ఎలాంటి షరతులు లేకుండా చర్చలు జరగాలని ఒప్పందంలో భారతదేశం స్పష్టంగా చెప్పింది. కాల్పుల విరమణ ప్రాధాన్యతగా అంగీకారాన్ని పాకిస్తాన్ తెలిపింది. ముందస్తు, తదుపరి షరతులు లేకుండానే చర్చలు జరగాలని భారతదేశం పేర్కొంది. ఇప్పటికే శనివారం 3.35గంటలకు భారత్ డీజీఎంఓతో హాట్‌లైన్‌లో పాకిస్తాన్ డీజీఎంఓ మాట్లాడారు. కాల్పుల విరమణ అంశాన్ని ప్రతిపాదించి.. వెంటనే అమలు చేయాలని పాకిస్తాన్ కోరింది. 48 గంటల పాటు కాల్పుల విరమణ అమలు తర్వాత చర్చలకు పాకిస్తాన్ అంగీకరించింది.
శనివారం సాయంత్రం 5గంటల నుంచి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిందని భారతదేశం తరపున విదేశాంగ శాఖ కార్యదర్శి మిశ్రీ ప్రకటించారు. ఈ ప్రకటన అనంతరం భారతదేశం సరిహద్దు వెంట కొన్ని ప్రాంతాల్లో పాకిస్తాన్ సైన్యం నియమాన్ని ఉల్లంఘించి కాల్పులు జరిపారు. ఈ విషయంపై శనివారం రాత్రే పాకిస్తాన్‌పై భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఈ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే చూస్తూ ఊరుకోమని, తమ సైన్యం తగిన రీతిలో సమాధానం చెబుతోందని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి తీవ్రంగా హెచ్చరించింది.
Read Also:
Ranveer Allahbadia: ఆపరేషన్ సిందూర్.. అనవసర పోస్టు పెట్టి చిక్కుల్లో పడ్డ రణవీర్ అల్లాహ్‌బాదియా
Operation Sindoor: ఉగ్రవాదుల అంతమే ఆపరేషన్ సింధూర్ లక్ష్యం.. భారత సైన్యం
Operation Sindoor: ఆర్మీ కమాండర్లకు ఫుల్ పవర్
Updated Date - May 12 , 2025 | 10:59 AM