AP News: కిడ్నీ రాకెట్ కేసులో.. గ్లోబల్ ఆసుపత్రి సీజ్
ABN, Publish Date - Dec 05 , 2025 | 11:05 AM
కిడ్నీ రాకెట్ కేసులో.. గ్లోబల్ ఆసుపత్రిని పోలీసులు సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రితోని ఆపరేషన్ థియేటర్, ఆపరేషన్‌కు ఉపయోగించిన పరికరాలు, మందులను స్వాధీనం చేసుకున్నారు. కిడ్నీ రాకెట్ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ పెద్దలు కూడా దీనిపై సీరియస్ అయినట్లు సమాచారం.
మదనపల్లె(చిత్తూరు): రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కిడ్నీ మార్పిడి కేసులో పోలీసులు ఎస్‌బీఐ కాలనీలోని గ్లోబల్ ఆసుపత్రి(Global Hospital)లో సోదాలు చేశారు. ఇందులో భాగంగా ఆసుపత్రితోని ఆపరేషన్ థియేటర్, ఆపరేషన్‌కు ఉపయోగించిన పరికరాలు, మందులను స్వాధీనం చేసుకుని ఆసుపత్రితో సహా సీజ్ చేసినట్లు డీఎస్పీ మహేంద్ర తెలిపారు. గత నెల 9వ తేదీ జరిగిన ఈ సంఘటనలో ఆసుపత్రి అధినేత, అన్నమయ్య జిల్లా డీసీహెచ్‌ఎస్ కె.ఆంజనేయులుతో పాటు మరో ఏడుగురిని అరెస్టు చేశారు. అనంతరం ఆంజనేయులును సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ కేసులో ప్రధానపాత్ర పోషించిన డాక్టర్ ఆంజనేయులుతో పాటు మదనపల్లె డయాలసిస్ కేంద్రంలో పనిచేస్తున్న మేనేజరు బాలరంగడు, కదిరి డయాలసిస్ కేంద్ర మేనేజరు మెహరాజ్, విశాఖకు చెందిన పిల్లి పద్మ, కాకర్ల సత్య, సూరిబాబు, కిడ్నీ మార్పిడి చేసిన బెంగళూరు(Bengaluru)కు చెందిన డాక్ట్టర్ పార్థసారధిరెడ్డికి సహకరించిన కడపకు చెందిన అనుచరులు కొండయ్య, సుమన్‌లను రెండువిడతలుగా అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. ఇదే కేసులో మరో ఆరుగురిపై కేసు నమోదైంది. వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇదిలావుండగా, గురువారం జరిగిన ప్రక్రియలో డీఎస్పీతో పాటు వన్, టూటౌన్ సీఐలు ఎస్.మహ్మద్‌రఫీ, రాజారెడ్డి, ఎస్‌ఐ రహీముల్లా, మదనపల్లె పీపీ యూనిట్ వైద్యులు డాక్టర్ శ్రీధర్, ప్రభాకర్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
ఆంజనేయులే ప్రధాన నిందితుడు
జిల్లా స్థాయిలో ప్రభుత్వ ఆసుపత్రుల సమన్వయకర్తగా ఉంటూ మానవఅవయవాల అక్రమ మార్పిడిలో ఆంజనేయులు ప్రధాన నిందితుడని పోలీసులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా వైద్యులైన ఆయన కుమారుడు డాక్టర్ అవినాశ్, కోడలు శాశ్వతిపై కూడా కేసు నమోదైనట్లు తెలిసింది. అలాగే గ్లోబల్ ఆసుపత్రి రిజిస్ట్రేషన్ అయిన ఆంజనేయులు భార్యపై కూడా కేసు నమోదు చేయనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆసుపత్రి ఎవరి పేరుపై ఉందో ఆ వివరాలు ఇవ్వాలని పోలీసులు ఇప్పటికే వైద్య, ఆరోగ్యశాఖ అధికారులను కోరారు. అధికారిక సమాచారం వచ్చాక ఆసుపత్రి రిజిస్ర్టేషన్ అయిన వారిపై కూడా కేసు నమోదు చేయనున్నారు.
ఇదిలా వుండగా సంఘటన జరిగిన 9వ తేదీ ఆసుపత్రి నుంచి సీసీ ఫుటేజీ, హార్డ్‌డిస్క్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఎస్‌ఎ్‌ఫఎల్ రిపోర్టుకు పంపించగా ఇటీవల నివేదిక వచ్చినట్లు తెలిసింది. ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి ఎన్ని రోజులుగా జరుగుతోంది. ఎంతమందికి చేశారు. అందులోని కిడ్నీ దాత, రిసీవర్‌లు ఎవరు? శస్త్రచికిత్సలు చేసిందెవరన్నది స్పష్టమైనట్లు తెలిసింది. ఇందులో భాగంగా విశాఖపట్నానికి చెందిన యమున (29)కు జరిగిన కిడ్నీ మార్పిడి కంటే ముందు మరొకరికి కూడా చేశారు. ఇందులో ఇద్దరు రిసీవర్‌లు, ఒక డోనర్ బెంగళూరు ఆసుపత్రులలో కోలుకుంటుండగా, యమున మాత్రం అదేరోజు ఇక్కడి ఆసుపత్రిలో మృతి చెందడంతో కిడ్నీ రాకెట్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
కోర్టులో లొంగిపోయిన డాక్టర్ పార్థసారథి
కిడ్నీ రాకెట్ కేసులో ఏ-2 డాక్టర్ పార్థసారథి గురువారం రాత్రి మదనపల్లె సెకండ్ అడిషనల్ జ్యుడీషియల్ కోర్టు న్యాయాధికారి ముందు లొంగిపోయాడు. దీంతో నిందితుడికి రిమాండ్ విధించారు. పులివెందులకు చెందిన డాక్టర్ పార్థసారథి బెంగళూరులో ఉంటున్నాడు. కిడ్నీ మార్పిడి కేసులో నిందితుడిగా ఉన్న ఇతను పరారీలో ఉన్నాడు. పోలీసులు ఎంత గాలించినా ఆచూకీ లభించలేదు. ఈ నేపధ్యంలో నిందితుడే స్వయంగా కోర్టులో లొంగిపోయాడు. వైద్య పరీక్షల అనంతరం మదనపల్లె సబ్‌జైలుకు తరలించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణకు.. 15లోగా డిజైన్ కన్సల్టెంట్లతో ఒప్పందం
Read Latest Telangana News and National News
Updated Date - Dec 05 , 2025 | 11:05 AM