Share News

Jagan Against Bureaucrats: వాడూ.. వీడూ.. ఎవడు

ABN , Publish Date - Dec 05 , 2025 | 05:28 AM

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు జగన్‌ సిద్ధాంతం ప్రకారం... తిరుమల పరకామణిలో చోరీ చేయడం చాలా చిన్న విషయం! శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ నెయ్యి కేసులో పకడ్బందీగా దర్యాప్తు చేయడం ఇంకా పెద్ద నేరం!

Jagan Against Bureaucrats: వాడూ.. వీడూ.. ఎవడు
Jagan Against Bureaucrats

  • ఐపీఎస్‌లపై జగన్‌ అనుచిత వ్యాఖ్యలు

  • పరకామణి చోరీ చిన్న విషయమేనట!

  • కల్తీ నెయ్యిపై దర్యాప్తు చెయ్యొద్దట

‘ష్‌... చెప్పింది మాత్రమే వినండి! ప్రశ్నలు అడగొద్దు’ అంటూ... ఏకంగా 2.43 గంటల ప్రెస్‌మీట్‌! కోర్టు తీర్పు మేరకు జరుగుతున్న దర్యాప్తులపైనా రాజకీయం! ‘మా వాళ్లంతా మంచోళ్లు’ అంటూ కితాబులు! అర్ధసత్యాలతో అడ్డగోలు వాదనలు! ఇదీ జగన్‌ తీరు!

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు జగన్‌ సిద్ధాంతం ప్రకారం... తిరుమల పరకామణిలో చోరీ చేయడం చాలా చిన్న విషయం! శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ నెయ్యి కేసులో పకడ్బందీగా దర్యాప్తు చేయడం ఇంకా పెద్ద నేరం! సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తు చేస్తున్నా సరే... అది చాలా పెద్ద ఘోరం! గురువారం జగన్‌ చేసిన వ్యాఖ్యలను చూస్తే ఇదే అనిపిస్తుంది. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, లోకేశ్‌లను తిట్టిపోయడంతోపాటు... సీనియర్‌ ఐపీఎ్‌సలను జగన్‌ ‘వాడు, వీడు’ అంటూ దూషించారు. ఐపీఎ్‌సలకు రాజకీయాలు అంటగట్టి, తలాతోక లేని ఆరోపణలకు తెగబడ్డారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కేసు దర్యాప్తులో భాగంగా టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి, జగన్‌ చిన్నాన్న వైవీ సుబ్బారెడ్డిని సీబీఐ జేడీ నేతృత్వంలోని సిట్‌ ఇటీవల ప్రశ్నించింది. ఇదే పెద్ద తప్పు అన్నట్లు జగన్‌ మాట్లాడారు. బసవతారకం ట్రస్టుకు సంబంధించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరితో కలిసి ఏపీ పొల్యూషన్‌ బోర్డు డైరెక్టర్‌ కృష్ణయ్య పాల్గొన్న ఫొటో చూపిస్తూ... ‘వీడి బంధువే.. వాడెవడో గోపీనాథ్‌ జెట్టి...’ అంటూ విశాఖ రేంజ్‌ డీఐజీని అవమానించారు. నిజానికి... లడ్డూ కల్తీ వ్యవహారంపై ‘సిట్‌’ ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం కాదు. సీబీఐ, రాష్ట్ర పోలీసులతో కలిసి దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలని స్వయానా సుప్రీంకోర్టు ఆదేశించింది.


సీబీఐ డైరెక్టర్‌ పర్యవేక్షణలో జాయింట్‌ డైరెక్టర్‌ వీరేశ్‌ ప్రభు నేతృత్వంలోని ‘సిట్‌’లో ఏపీ కేడర్‌ ఐపీఎస్‌ అధికారులు ఎస్‌.ఎస్‌. త్రిపాఠీ, గోపీనాథ్‌ జెట్టి సభ్యులుగా ఉన్నారు. అసలు విషయం ఏమిటంటే... వైవీ సుబ్బారెడ్డి పిటిషన్‌ ఆధారంగానే సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ అధికారుల పేర్లు ప్రస్తావిస్తే తనపై ఇప్పటికే ఉన్న 11 కేసుల్లో ఇబ్బంది పడాల్సి వస్తుందన్న భయంతో... ఏపీ కేడర్‌ అధికారులపైనే జగన్‌ విషం చిమ్మారు. పల్నాడులో జగన్‌ పార్టీకి చెందిన పిన్నెల్లి సోదరులు ఎన్నికల్లో చేసిన వీరంగం వీడియోలతో సహా బయట పడింది. మహిళా ఏజెంట్‌ నుదుటిపై గొడ్డలితో నరికిన వ్యక్తులను త్రిపాఠీ అరెస్టు చేయించారు. ఆ కక్షతోనే కాబోలు... ‘ఆయన ఏమేమి వీరంగం చేశారో...’ అంటూ త్రిపాఠీని ఉద్దేశించి జగన్‌ నోరు పారేసుకున్నారు. గోపీనాథ్‌ జెట్టి తిరుపతి ఎస్పీగా ఉన్నప్పుడు జగన్‌కు అత్యంత సన్నిహితుడైన ఎర్రచందనం స్మగ్లర్‌ కొల్లం గంగిరెడ్డిని విదేశీ న్యాయస్థానాలను ఒప్పించి మరీ విమానంలో భారత్‌కు తీసుకొచ్చి జైల్లో పెట్టారు. పోలీసు శాఖలో గోపీనాథ్‌ జెట్టికి నిజాయితీపరుడు, సమర్థుడిగా పేరుంది. జగన్‌ ప్రభుత్వ హయాంలో విశాఖ మన్యంలో పెరిగిన గంజాయితోపాటు, దాని మూలాల్ని పెకిలిస్తున్న జెట్టిపై జగన్‌ అహంకారం ప్రదర్శించారంటూ పోలీసులు మండిపడుతున్నారు.


దొంగకు వత్తాసు...

పరకామణిలో జరిగింది చిన్న చోరీ అని జగన్‌ అభివర్ణించారు. రూ.72 వేలు విలువ చేసే తొమ్మిది యూఎస్‌ డాలర్లు తస్కరించిన దొంగ కుటుంబసభ్యులు పశ్చాత్తాపంతో 14కోట్ల విలువైన ఆస్తులు దేవుడికి ఇవ్వడం తప్పవుతుందా? అని జగన్‌ అమాయకంగా ప్రశ్నించారు. ఆయన ఉద్దేశంలో ఇది తప్పు కాకపోవచ్చు. కానీ... చోరీకి పాల్పడిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోకుండా లోక్‌ అదాలత్‌లో రాజీ కుదుర్చుకోవడం మాత్రం తప్పే! దీనిని హైకోర్టు తప్పు పట్టింది. దీంతో... ఈ కేసును పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. జగన్‌ దీనిని కూడా రాజకీయం చేసేశారు. ఈ చోరీని సమర్థిస్తూ.. సింహాచలం దేవస్థానంలో రూ.55వేలు దొంగతనం చేస్తూ పట్టుబడ్డ అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగికి స్టేషన్‌ బెయిలు ఎందుకిచ్చారనీ, జైల్లో పెట్టి ఆస్తులెందుకు స్వాధీనం చేసుకోలేదని వింత ప్రశ్నలు వేశారు.

కోర్టులూ ధ్రువీకరించాయి కదా!

తన హయాంలో జరిగిన మద్యం స్కామ్‌ను వెలికి తీస్తున్న సిట్‌ అధికారులపైనా జగన్‌ విషం కక్కారు. అసలు కుంభకోణమే జరగని లిక్కర్‌ కేసులో ఏవేవో సృష్టించి....చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మిథున్‌ రెడ్డి, ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్ప, రాజ్‌ కసిరెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారంటూ అక్కసు వెళ్లగక్కారు. అయితే, వైసీపీ ఎంపీ మిథున్‌ రెడ్డి, రిటైర్డ్‌ ఐఏఎస్‌ ధనుంజయ్‌ రెడ్డి, జగన్‌ ఓఎ్‌సడీ కృష్ణ మోహన్‌ రెడ్డి, భారతీ సిమెంట్స్‌ శాశ్వత డైరెక్టర్‌ బాలాజీ గోవిందప్ప విజయవాడ ఏసీబీ కోర్టు, ఏపీ హైకోర్టు, అంతిమంగా సుప్రీం కోర్టు వరకూ వెళ్లినా సిట్‌ ఆధారాలనే కోర్టులు సమర్థించాయి. లొంగిపోవాలని వారికి సూచించాయి. సోషల్‌ మీడియా యాక్టివిస్టులపై కేసులు పెట్టారంటూ జగన్‌ వాపోయారు. ఆయన అధికారంలో ఉండగా వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మహిళలు, న్యాయమూర్తులు, ప్రతిపక్ష నేతలు, కుటుంబ సభ్యులపై జుగుప్సాకరమైన పోస్టులు పెడుతూ, వైరల్‌ చేసిన విషయాన్ని మరిచారు.


డైవర్ట్‌ అయిపోతుందంటూ..

మీడియా ప్రతినిధులు ప్రశ్నలు వేసేందుకు సిద్ధమయ్యేసరికి సమయమైపోయిందంటూ జగన్‌ లేచి వెళ్లిపోయారు. మొదట రాజధాని భూములపై ప్రశ్నించినప్పుడు హెరిటేజ్‌ సంస్థ గుండా రింగ్‌ రోడ్డు వెళ్లేందుకు స్కామ్‌కు పాల్పడ్డారని ఆరోపించారు. మూడు రాజధానుల అంశాన్ని మీడియా ప్రతినిధి ప్రస్తావించినప్పుడు ఒక్క ఉదుటన కుర్చీలోనుంచి జగన్‌ లేచారు. ఇప్పటికే సమయం అయిపోయిందని.. రెండు గంటలు దాటిపోయిందని అన్నారు. ఇప్పుడు ఈ సబ్జెక్ట్‌ మీద మాట్లాడితే.. ఇప్పటిదాకా తాను మాట్లాడినదంతా డైవర్ట్‌ అయిపోతుందంటూ వెళ్లిపోయారు.

అబ్బాయికి బాబాయే షాకిచ్చినా...!

కల్తీ నెయ్యి కేసులో టీటీడీ మాజీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి పీఏ చిన్న అప్పన్నను సిట్‌ అరెస్టు చేసింది. దీనిపై జగన్‌ మాట్లాడుతూ.. అప్పన్న టీడీపీ ఎంపీ వేమిరెడ్డి దగ్గర పని చేస్తుండగా, సుబ్బారెడ్డికి ఆయన పీఏ అంటూ ప్రచారం చేస్తున్నారని వాదించారు. అయితే, చిన్నాన్న సుబ్బారెడ్డే స్వయంగా తన వద్ద అప్పన్న గతంలో పనిచేసినట్టు వెల్లడించడం ఇక్కడ గమనార్హం. జగన్‌ గూబ గుయ్యిమనేలా సుబ్బారెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయి. అయినా జగన్‌ తీరు మారలేదు. అప్పన్న ఇప్పుడు ఎక్కడ పనిచేస్తున్నారన్నది కాదు...కల్తీ నెయ్యి ఘటన జరిగినప్పుడు సరఫరా దారుల నుంచి కమీషన్లు ఆయన వసూలు చేశారా...లేదా? ఆ సమయంలో సుబ్బారెడ్డి పీఏగా అప్పన్న ఉన్నారా....లేదా.? అనేది ముఖ్యం. కానీ, దీనిపై మాత్రం జగన్‌ పెదవి విప్పరు.


ఈ వార్తలు కూడా చదవండి:

Darshan Tickets: నేడు వైకుంఠద్వార దర్శన టికెట్ల విడుదల

Donation: శ్రీపాదశ్రీవల్లభ మహా సంస్థానానికి భారీ విరాళం

Updated Date - Dec 05 , 2025 | 07:00 AM