Sakshi Siege: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి ఆఫీస్‌ల ముట్టడి, తీవ్ర ఉద్రిక్తతలు
ABN, Publish Date - Jun 08 , 2025 | 05:16 PM
రాజధాని అమరావతి మహిళలనుద్దేశించి సాక్షిమీడియాలో ప్రసారమైన విశ్లేషణపై ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. అన్ని జిల్లాల్లో నిరసనలకు దిగుతున్నారు అమరావతి మహిళలతోపాటు టీడీపీ, జనసేన, బీజేపీ మహిళా విభాగాలు. పలు చోట్ల ఈ ఆందోళన అరెస్టులకు దారి తీసింది.
ఇంటర్నెట్ డెస్క్: అమరావతి మహిళల గురించి నీచంగా మాట్లాడటంపై సాక్షి మీడియా ఆఫీస్‌ల ఎదుట మహిళలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నారు. అమరావతి మహిళలతోపాటు, టీడీపీ, జనసేన, బీజేపీ మహిళా విభాగాలు ఏపీ వ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటూ వైఎస్ జగన్ మీడియాపై నిప్పులు చెరుగుతున్నారు.
అనంతపురం:
ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ నేతృత్వంలో అనంతపురం సాక్షి కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు తెలుగు మహిళలు. సాక్షి ఆఫీస్ ఎదుట సాక్షి పేపర్లు దహనం చేశారు. కార్యాలయానికి ఉన్న సాక్షి అక్షరాలను తొలగించే ప్రయత్నం చేశారు. దీనిని పోలీసులు అడ్డుకుని వారిని అరెస్ట్ చేశారు. వారిని అరెస్ట్ చేసి 4వ పట్టణ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సాక్షి యాజమాన్యం, మహిళల పట్ల నీచంగా మాట్లాడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అమరావతిపై కక్షతో భూములు ఇచ్చిన తల్లుల గురించి ఇంత నీచంగా మాట్లాడుతారా? అంటూ అనంతపురం మహిళలు ప్రశ్నించారు.
తెలుగింటి ఆడబిడ్డలపై అనుచిత వ్యాఖ్యలు చేయించిన సాక్షి ఛానల్‌ను మూసివేయాలని అనంతపురం తెలుగు మహిళలు డిమాండ్ చేశారు. 'సాక్షి అనేది ఓ పనికిమాలిన పత్రిక, ఛానల్. జగన్‌కు సిగ్గులేదు. మహిళల పట్ల ఇంత నీచంగా మాట్లాడిస్తావా.? 150 సీట్ల నుంచి 11 సీట్లకు దింపినా జగన్మోహన్ రెడ్డికి సిగ్గు రాలేదు' అంటూ తెలుగు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షి కార్యాలయం గేట్లు ఎక్కడానికి మహిళలు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులకు, తెలుగు మహిళల మధ్య తోపులాట, ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. సాక్షి ఛానల్, జగన్మోహన్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు మారుమ్రోగాయి.
కర్నూలు :
అటు, కర్నూలు లోనూ సాక్షి మీడియాకి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు జరిగాయి. రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధి జరగకూడదనే కుట్రలో భాగంగా జర్నలిస్టులు కృష్ణంరాజు, కొమ్మినేని శ్రీనివాసరావు వేశ్యల రాజధాని అంటూ సాక్షి టీవీలో చర్చలు జరిపారని మహిళలు వ్యాఖ్యానించారు. దీనిని మాజీ మంత్రులు రోజా, విడుదల రజిని ఎందుకు ఖండించడం లేదని ప్రశ్నించారు. వైసీపీ మహిళలు సైతం సాక్షిని చీత్కరిస్తున్నారు.. ఇప్పటికైనా వైసీపీ నాయకులు దిగజారుడు రాజకీయాలు చేయడం మానుకోవాలని టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ వహీద్ హుస్సేన్ అన్నారు.
తూర్పుగోదావరి:
అమరావతి మహిళలను కించపరస్తూ అసభ్యకరంగా మాట్లాడిన సాక్షి ఛానల్ జర్నలిస్టులు కొమ్మినేని శ్రీనివాస్, కృష్ణంరాజులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు తూర్పుగోదావరి జిల్లా టీడీపీ మహిళలు. రాజానగరంలోని సాక్షి ముద్రణా కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. వైఎస్ భారతి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఏలూరు జిల్లా:
అమరావతిని వేశ్యల రాజధాని అంటూ అవమానకర వ్యాఖ్యలు చేసిన జర్నలిస్ట్ కృష్ణంరాజుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు నూజివీడు తెలుగు మహిళలు. జగన్ రెడ్డి ఏదేళ్ళు ఇదే అమరావతిలో పరిపాలన చేసి, ఆడపిల్లల పట్ల ఆగౌరవంగా సాక్షి ఛానల్లో మాట్లాడించడంపై తీవ్ర ఆగ్రహజ్వాలలతో రగిలి పోయారు మహిళామణులు. పవిత్రమైన మీడియా వృత్తిలో ఉంటూ జర్నలిజం విలువలను దిగజార్చేలా మహిళా లోకాన్ని అవమానించిన కొమ్మినేని, కృష్ణంరాజులను ప్రెస్ అకాడమీ బహిష్కరించి బుద్ది చెప్పాలని కోరుతున్నారు. జగన్ రెడ్డి, కొమ్మినేని, కృష్ణంరాజు కుటుంబాలలోని ఆడవాళ్ళైన వారి అమ్మలు, అక్కలు, భార్యలు అమరావతిలోనే వుంటున్నారనే విషయాన్ని మర్చిపోయారా అనీ తెలుగు మహిళలు గుర్తు చేస్తున్నారు.
కృష్ణాజిల్లా:
అమరావతి మహిళలను కించ పరుస్తూ చేసిన అనుచిత వ్యాఖ్యలపై గుడివాడలో తెలుగు మహిళల ఆందోళనకు దిగారు. సాక్షి దినపత్రిక ప్రతులను దగ్ధం చేసిన మహిళలు.. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జర్నలిస్ట్ కృష్ణంరాజు, మాజీ సీఎం జగన్ ఫోటో చిత్రాలను చెప్పులతో కొట్టారు. మహిళా లోకానికి క్షమాపణలు చెప్పాలంటూ నినాదాలు చేశారు.
అమరావతి:
మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగే విధంగా KSR లైవ్ షోలో చేసిన వ్యాఖ్యలను బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు నిర్మల కిషోర్ తీవ్రంగా ఖండించారు. 'ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న అమరావతి పునర్నిర్మాణం కోసం గౌరవ ప్రధానమంత్రి వచ్చి అమరావతి దేశంలోనే ఎంతో ఎంతో గొప్ప రాజధానిగా ప్రకటించారు. అటువంటి అమరావతి రాజధాని.. దేవతలు రాజధాని కాదు, వేశ్యల రాజధాని అనడాన్ని సాక్షి టీవీలో సమర్థించడాన్ని ఏవిధంగా తీసుకోవాలి? వైసీపీ ఇంకా తన విధానాన్ని మార్చుకోకుండా మహిళల మీద ఇలాంటి వ్యాఖ్యల్ని ప్రోత్సహిస్తోంది. ఆంధ్రప్రదేశ్ సెక్స్ వర్కర్ విషయంగా మొదటి స్థానంలో ఉందని తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న సాక్షి ఛానెల్‌ని వెంటనే రద్దు చేయాలి'అని నిర్మల డిమాండ్ చేశారు. ఆంద్రప్రదేశ్ మహిళల ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా మాట్లాడిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు.
కొవ్వూరు :
అమరావతి మహిళల్ని కించపరుస్తూ మాట్లాడిన సాక్షి టీవీ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసును, జర్నలిస్ట్ కృష్ణరాజును తక్షణమే అరెస్ట్ చేయాలంటూ కొవ్వూరు టౌన్ పోలీసులకు టిడిపి, జనసేన, బిజెపి నాయకులు ఫిర్యాదు చేశారు.
విజయవాడ:
అమరావతి రాజధానిని ఉద్దేశించి సాక్షి టీవీలో చేసిన వ్యాఖ్యలను క్రికెటర్ ఎం ఎస్ కె ప్రసాద్ ఖండించారు.
అమరావతి:
రాజధాని అమరావతి మహిళల గురించి సాక్షి ఛానల్‌లో కృష్ణంరాజు అనే వ్యక్తి నీచంగా మాట్లాడారని అమరావతి మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.
గుంటూరు జిల్లాః
గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరావు ఈ వ్యవహారంపై స్పందించారు. సాక్షి డిబేట్‌లో మహిళలపై అసభ్యంగా మాట్లాడడం సిగ్గు చేటన్నారు.
'జర్నలిజం అనే ముసుగు వేసుకొని జగన్మోహన్ రెడ్డి కోసం పని చేస్తున్నారు. రాజధానిలొ వేశ్యలు వున్నారంటూ సాక్షి టీవీ డిబేట్లో సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. కోట్ల రూపాయల విలువ కలిగే భూమి రాజధాని కోసం త్యాగం చేశారు. అలాంటి రాజధాని గురించి మాట్లాడిన మిమ్మల్ని చంపినా పాపం లేదు. గడిచిన 5 సంవత్సరాలు మీడియాని సైతం తొక్కి పెట్టావ్. కూటమి అధికారంలోకి వచ్చినా సాక్షిపై ప్రతీకారం తీర్చుకోలేదు. రాష్ట్రంలో సాక్షి పేపర్, ఛానెల్‌ను బాయ్‌కాట్ చేయాలి'. అని గాదె డిమాండ్ చేశారు.
ఎస్సీ కమిషన్ ఛైర్మన్ సమన్లు
రాజధాని అమరావతి మహిళలపై సాక్షి మీడియా ప్రసారాలను తీవ్రంగా పరిగణిస్తోంది ఎస్సీ కమిషన్. దళితుల నుంచి సాక్షిపై వచ్చిన ఫిర్యాదుల మేరకు ఆ ఛానల్ కు, సoబంధిత బాధ్యులకు సమన్లు జారీ చేస్తున్నామని కమిషన్ ఛైర్మన్ జవహర్ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
మాగంటి భౌతికకాయానికి లోకేష్ దంపతుల నివాళి..
మాగంటి గోపీనాథ్ నివాసానికి సీఎం చంద్రబాబు..?
For More AP News and Telugu News
Updated Date - Jun 08 , 2025 | 06:26 PM