Operation Sindoor: రాజస్థాన్, పంజాబ్‌లో హై అలర్ట్.. సిద్ధమైన క్షిపణులు..
ABN, Publish Date - May 08 , 2025 | 12:16 PM
ఆపరేషన్ సిందూర్‌తో భారత్- పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని దేశవ్యాప్తంగా అధికారులు మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో రాజస్థాన్, పంజాబ్‌లో అధికారులు అప్రమత్తమయ్యారు..
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ గట్టిగా దెబ్బకొట్టింది. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసింది. ఈ దాడుల్లో సుమారు 70 మందికి పైగా ఉగ్రవాదులు హతమవ్వగా.. 60 మందికి పైగా గాయపడ్డారు. ఈ దాడులతో భారత్- పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని దేశవ్యాప్తంగా అధికారులు మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో రాజస్థాన్, పంజాబ్‌లో అధికారులు అప్రమత్తమయ్యారు.
భారత్ దాడులను పాకిస్తాన్ (India vs Pakistan) జీర్ణించుకోలేకపోతోంది. తిరిగి దాడులు చేయనున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. ప్రధానంగా సరిహద్దు రాష్ట్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ క్రమంలో రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల్లో హై అలర్ట్ (High alert in Rajasthan and Punjab) ప్రకటించారు. ఈ మేరకు పోలీస్ సిబ్బందికి సెలవులు రద్దు చేయడంతోపాటు బహిరంగ సభలపైనా ఆంక్షలు విధించారు. ఎక్కడైనా అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే.. వెంటనే కాల్పులు జరపాలని సరిహద్దు భద్రతా దళ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.
మరోవైపు భారత వైమానిక దళం కూడా అప్రమత్తమైంది. పశ్చిమ వాయువ్య భాగంలో యుద్ధ విమానాలు గస్తీ తిరుగుతున్న నేపథ్యంలో జోధ్‌పూర్, కిషన్‌గఢ్, బికనీర్ విమానాశ్రయాల్లో మే 9 వరకు విమానాల రాకపోకలను నిలిపేశారు. అదే విధంగా క్షిపణులను సైతం సిద్ధం చేశారు. పశ్చిమ సెక్టార్‌లో ఫైటర్ జెట్‌లు గస్తీ కాస్తున్నాయి. సుఖోయ్-30 MKI జెట్‌లు గంగానగర్ నుంచి రాణ్ ఆఫ్ కచ్ వరకూ గస్తీ నిర్వహిస్తున్నాయి.
భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో బికనీర్, గంగానగర్, జైసల్మేర్, బార్మెర్ జిల్లాల్లోని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. అలాగే ప్రస్తుతం జరుగుతున్న పరీక్షలను కూడా వాయిదా వేశారు. ఇప్పటికే సెలవుల్లో ఉన్న అధికారులు వెంటనే విధుల్లోకి చేరాలని ఆదేశాలు జారీ చేశారు. పాకిస్తాన్ దాడికి పాల్పడే అవకాశాలు ఉండడంతో సరిహద్దు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. అత్యవసర సమయంలో వారందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే..
పాక్ కవ్వింపు చర్యలు.. తిప్పికొట్టిన భారత్ సైన్యం..
న్యాయం జరిగింది: సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా కుటుంబం
For More AP News and Telugu News
Updated Date - May 08 , 2025 | 03:15 PM