Hussain Shah: న్యాయం జరిగింది: సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా కుటుంబం
ABN , Publish Date - May 08 , 2025 | 09:15 AM
పాకిస్తాన్, పీవోకేలోని ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ పేరుతో జరిపిన దాడులను పహల్గాం బాధితుడు సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా కుటుంబం ప్రశంసించింది. పహల్గాం దాడికి ప్రతీకారం తీర్చుకున్నాయని, న్యాయం జరిగిందని బాధిత కుటుంబం పేర్కొంది.
శ్రీనగర్: ఏప్రిల్ 22న పహల్గాం (Pahalgam)లో జరిగిన ఉగ్రవాద దాడిలో పర్యాటకులను రక్షించే ప్రయత్నంలో పోనీ హ్యాండ్లర్ సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా (Syed Adil Hussain Shah) మరణించారు. అయితే భారత సైన్యం (Indian Army) ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor) పేరుతో పాకిస్తాన్‌లోని 9 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయడంపై ఆదిల్ హుస్సేన్ షా కుటుంబం హర్షం వ్యక్తం చేసింది. తమకు న్యాయం జరిగిందని అన్నారు. పమల్గాం దాడికి ప్రతిగా ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం దాడులు చేసి ప్రతీకారం తీర్చుకున్నాయని హుస్సేన్ షా కుటుంబం పేర్కొంది.
సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా మ్యూల్‌బ్యాక్‌పై పర్యాటకులకు తీసుకువెళుతున్నప్పడు ఉగ్రవాదులు దాడి చేశారు. ఆ సమయంలో పర్యాటకులు ప్రాణాలు కాపాడేందుకు హుస్సేన్ షా ఓ ఉగ్రవాది చేతిలో తుపాకీని తీసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఉగ్రవాదుల తుపాకులకు హుస్సేన్ షా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మొత్తం 26 మంది అమాయక ప్రాణాలను ఉగ్రవాదులు బలిగొన్నారు. అయితే తాజాగా ‘ఆపరేషన్ సిందూర్' పై హుస్సేన్ షా తండ్రి సయ్యద్ హైదర్ షా స్పందించారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భారత సైన్యంపై ప్రశంసలు కురిపించారు. తమ కుటుంబానికి తీవ్ర ఉపశమనం కలిగిందని, తమ కుమారుడు మృతికి న్యాయం జరిగిందని అన్నారు. 26 మంది హత్యలకు భారత సైన్యం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతీకారం తీర్చుకున్నందుకు తాను ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నానని అన్నారు.
Also Read: పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే..
సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా సోదరుడు సయ్యద్ నౌషాద్ మాట్లాడుతూ.. తమ కుటుంబానికి న్యాయం జరిగిందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ‘ఇప్పుడు నా సోదరుడు, 25 మంది అమాయకులు శాంతితో విశ్రాంతి తీసుకుంటారు. ఈ హత్యలకు ప్రధాని మోదీ ప్రతీకారం తీర్చుకున్నారు. ఈ విషయం నాకు తెలియగానే, నన్ను సంతోషపరిచింది.. మాకు ఇప్పుడు న్యాయం జరిగింది.. మేము చాలా సంతోషంగా ఉన్నాము’ అని ఆయన పేర్కొన్నారు. కాగా బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత భారత సేనలు పాకిస్తాన్ పీవోకేలోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేసిన విషయం తెలిసిందే.
కాగా సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా ధైర్య సాహసాలకు ఇటీవలె కేంద్ర ప్రభుత్వం ‘బ్రేవరీ అవార్డు’ను ప్రకటించింది. అంతేకాకుండా, ఆదిల్ సోదరుడు సయ్యద్ నాజకత్ హుస్సేన్‌కు ప్రభుత్వ ఉద్యోగం ప్రకటించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
For More AP News and Telugu News