Aadhaar: ఆధార్ ఫేస్ అథెంటికేషన్.. అద్భుతమైన పురోగతి
ABN, Publish Date - Aug 08 , 2025 | 09:02 PM
ఆధార్ ఫేస్ అథెంటికేషన్ సొల్యూషన్ కూడా నెల నెలా స్థిరమైన వృద్ధిని చూపుతోందని కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ చెప్పుకొచ్చింది. జూలై ఫేస్ అథెంటికేషన్ లావాదేవీలు జూన్ కంటే 22% వృద్ధిని నమోదు చేశాయని వివరించింది. జూలైలో ఒకే రోజులో అత్యధిక ఫేస్ అథెంటికేషన్ లావాదేవీలను కూడా నమోదు అయినట్లు చెప్పారు.
ఢిల్లీ: ఆధార్ ఫేస్ అథెంటికేషన్ రోజురోజూకు అభివృద్ధి చెందుతూ.. అద్భుతమైన పురోగతి సాధిస్తోందని కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. జూలై 2025లో 19.36 కోట్ల లావాదేవీలతో ఆల్‌టైమ్ రికార్డ్ నమోదు చేసిందని అన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో 5.77 కోట్ల లావాదేవీలు జరిగాయని పేర్కొన్నారు.
ఆధార్ ఫేస్ అథెంటికేషన్ సొల్యూషన్ కూడా నెల నెలా స్థిరమైన వృద్ధిని చూపుతోందని కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ చెప్పుకొచ్చింది. జూలై ఫేస్ అథెంటికేషన్ లావాదేవీలు జూన్ కంటే 22% వృద్ధిని నమోదు చేశాయని వివరించింది. జూలైలో ఒకే రోజులో అత్యధిక ఫేస్ అథెంటికేషన్ లావాదేవీలను కూడా నమోదు అయినట్లు చెప్పారు. ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, ఆర్థిక సంస్థలు, చమురు కంపెనీలు, టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు ఇతరులు సహా 150 కంటే ఎక్కువ సంస్థలు ప్రయోజనాలు,సేవల పంపిణీని క్రమబద్ధీకరించడానికి ఫేస్ అథెంటికేషన్‌ను ఉపయోగిస్తున్నాయని స్పష్టం చేశారు.
ఈ AI-ఆధారిత ఫేస్ అథెంటికేషన్ విధానం Android, iOS ప్లాట్‌ఫారమ్‌లలో పనిచేస్తుందని తెలిపారు. ఆధార్ ఫేస్ అథెంటికేషన్ జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం(NSAP)తో కూడా అనుసంధానించబడిందన్నారు. ఇది అర్హత కలిగిన లబ్ధిదారులు సురక్షితమైన, కాంటాక్ట్‌లెస్ పద్ధతిలో వారి సామాజిక భద్రతా ప్రయోజనాలను పొందేందుకు వీలు కల్పిస్తోందని పేర్కొన్నారు. జూలై నుండి, 13.66 లక్షల మంది లబ్ధిదారులు ముఖ ప్రామాణీకరణను ఉపయోగించి తమను తాము ప్రామాణీకరించుకున్నారని స్పష్టం చేశారు.
నేషనల్ మెడికల్ కమిషన్(NMC) పరిధిలోని మొత్తం 850 వైద్య కళాశాలలు, సంస్థలలో హాజరును గుర్తించడానికి ఆధార్ ఫేస్ అథెంటికేషన్ ఉపాయోగిస్తున్నాయని తెలిపారు. అదేవిధంగా, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు వంటి కేంద్ర నియామక సంస్థలు కూడా అభ్యర్థుల నమోదు కోసం ముఖ ప్రామాణీకరణను వాడుతున్నట్లు వివరించారు. మొత్తంమీద, భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(UIDAI) జూలైలో 221 కోట్ల ఆధార్ ప్రామాణీకరణ లావాదేవీలను నమోదు చేసిందని వెల్లడించారు. లక్షలాది మంది ప్రజలకు జీవన సౌలభ్యానికి ఇది ఉత్ప్రేరకమవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అదేవిధంగా, జూలైలో, 39.56 కోట్ల e-KYC లావాదేవీలు జరిగాయని తెలిపారు. ఆధార్ e-KYC సేవ కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడంలో.. బ్యాంకింగ్, నాన్-బ్యాంకింగ్ ఆర్థిక సేవలతో సహా పలు రంగాలలో వ్యాపారం చేయడంలో సులభతరం చేయడంలో ఫేస్ అథెంటికేషన్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని అనడంలో అతిశయోక్తి లేదని కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ చెప్పుకొచ్చింది.
Also Read:
ఇంట్లో వరమహాలక్ష్మిని ఈ సాధారణ పద్ధతిలో పూజించండి
28 ఏళ్ల క్రితం కనిపించుకుండా పోయి.. మంచులో మమ్మీగా..
Updated Date - Aug 08 , 2025 | 09:05 PM