Ganesh Chaturthi 2025: గణపతికి ప్రియమైన నైవేద్యం మోతీచూర్ లడ్డూ.. 10 నిమిషాల్లో ఇంట్లో చేయండిలా..
ABN, Publish Date - Aug 27 , 2025 | 12:34 PM
గణపయ్య మోతీచూర్ లడ్డూలను ఎంతో ఇష్టంగా తింటాడని అంటుంటారు. వాస్తవానికి ఈ లడ్డూలను కేవలం 10 నిమిషాల్లో తయారు చేయవచ్చు. కాబట్టి, ఈసారి బజార్లో కొన్నవి కాకుండా ఇంట్లో చేసిన మోతీచూర్ లడ్డూలనే వినాయకుడికి నైవేద్యంగా సమర్పించండి.
వినాయక చవితి సమయంలో వాడవాడలా గణేశ మండపాలు దర్శనమిస్తుంటాయి. అక్కడ మోదకాలు, ఉండ్రాళ్ల పాయసం, లడ్డూలు, పులిహోర ఇలా వివిధ రకాల రుచికరమైన ప్రసాదాలు భక్తులకు పంచుతూ ఉంటారు. వాటిలో మోతీచూర్ లడ్డూ గణపయ్యకే కాక అందరికీ ఇష్టమైన ప్రసాదం. అయితే, దీన్ని చాలామంది బజార్లో కొని ఇంట్లో దేవుడికి నైవేద్యంగా పెడుతుంటారు. కానీ, ఈ గణేష చతుర్థికి ఇంట్లోనే ప్రిపేర్ చేసిన మోతీచూర్ లడ్డూను నైవేద్యంగా సమర్పించండి. ఎందుకంటే, మోతీచూర్ లడ్డూ తయరీ ఏమంత కష్టం కాదు. కేవలం పదే పది నిమిషాల్లో దీన్ని తయారుచేసుకోవచ్చు. అదెలాగో తెలుసుకోండి.
మోతీచూర్ లడ్డూ తయారీకి కావాల్సిన పదార్థాలు:
శనగపిండి- ఒక కప్పు
చక్కెర- ఒక కప్పు
ఫుడ్ కలర్(ఆరెంజ్)- చిటికెడు
నీరు-3/4 కప్పు
నెయ్యి- తగినంత
యాలకుల పొడి- పావు టీ స్పూన్
పిస్తా, బాదం ముక్కలు - తరిగినవి
తయారీ విధానం:
మోతీచూర్ లడ్డూ తయారు చేయడానికి ముందుగా చక్కెర పాకం తయారు చేయండి. ఒక గిన్నెలో 1 కప్పు పంచదార, 1 కప్పు నీరు తీసుకుని స్టౌ పై పెట్టి తీగ పాకం అయ్యే వరకు నీటిని మరిగించండి. ఇందుకు దాదాపు 5 నిమిషాలు పడుతుంది. ఇప్పుడు ఒక కప్పు శనగపిండిని గిన్నెలో తీసుకుని అందులో నారింజ రంగు ఫుడ్ కలర్ వేయండి. తర్వాత నీరు పోసి పిండిని జోరుగా బూందీ తయారీకి అనుగుణంగా కలిపి సిద్ధం చేసుకోండి. తర్వాత ఒక బాణలిలో నూనె తీసుకుని వేడెక్కాక చిన్న మంటలో ఉంచండి. ఇప్పుడు బూందీ తయారు చేసే గరిటెపై శనగపిండి నూనెలో పోస్తూ బూందీ కాల్చండి. లేత బంగారు గోధుమ రంగులోకి వచ్చాక తీసేయండి. బూందీ పూర్తిగా తయారయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకోండి. బూందీ కాస్త చల్లబడ్డాక నెయ్యి, యాలకుల పొడి, చక్కెర పాకం వేసి కలిపి లడ్డూ తయారీకి అనుగుణంగా అయ్యేవరకూ అలాగే ఉంచండి. తర్వాత గుండ్రని లడ్డూలను తయారుచేయండి. చివరగా తరిగిన పిస్తా, బాదం ముక్కలను లడ్డూలపై ఉంచి అలంకరించండి.
Also Read
గణపయ్యకు ఇష్టమైన 5 మోదకాల రెసిపీస్.. ఈసారి తప్పక ట్రై చేయండి..
వినాయకుడి విగ్రహాన్ని ఇక్కడ మాత్రం ఉంచవద్దు.. ఎందుకంటే..
For More Devotional News
Updated Date - Aug 27 , 2025 | 12:35 PM