Share News

Vinayaka Chavithi: గణపయ్యకు ఇష్టమైన 5 మోదకాల రెసిపీస్.. ఈసారి తప్పక ట్రై చేయండి..

ABN , Publish Date - Aug 26 , 2025 | 11:25 AM

వినాయకుడికి సమర్పించే నైవేద్యాలలో మోదకాలది ప్రథమ స్థానం అని తెలిసిందే. . బొజ్జగణపయ్యకు ఇష్టమైన వంటకంగా పిలువబడే మోదకాలను పండుగ రోజున ప్రతి ఇంట్లో తయారు చేస్తారు. ఈసారి ఎక్కువ సమయం కేటాయించకుండా ఇంట్లో తయారు చేసుకోగలిగే 5 రుచికరమైన మోదకాలను ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకోండి.

Vinayaka Chavithi: గణపయ్యకు ఇష్టమైన 5 మోదకాల రెసిపీస్.. ఈసారి తప్పక ట్రై చేయండి..
Modak Recipes for Ganesh Chaturthi

దేశవ్యాప్తంగా వినాయక చవితి (Vinayaka Chavithi) సంబరాలు మొదలయ్యాయి. ఈ ఏడాది ఆగస్టు 27న రానున్న గణేష్ చతుర్థి జరుపుకునేందుకు అంతా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. బొజ్జ గణపయ్యకు సమర్పించాల్సిన నైవేద్యాలు, పూజల గురించి ప్లాన్ చేసుకోవడంలో అంతా నిమగ్నమయ్యారు. 9 రోజుల పాటు సాగే ఈ పండుగకు ఒక్కో రోజున ఒక్కో రకమైన నైవేద్యం సమర్పించి లంబోదరుడిని భక్తి శ్రద్ధలో కొలుస్తారు ప్రజలు. ఇక గజానునికి మోదకాలు ఎంత ప్రీతికరమైన వంటకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సారి వినాయక చవితికి ఆయనకు ఎంతో ఇష్టమైన నోరూరించే ఈ 5 రకాల మోదకాలు ఇంట్లోనే తయారుచేసి నైవేద్యంగా సమర్పించండి.


malai-modak.jpg

మలై మోదకాలు

మలై మోదకాలు చేయడానికి పాలు, కుంకుమ పువ్వు, చక్కెర, ఏలకుల పొడి, నెయ్యి, కొన్ని బాదం పలుకులు అవసరం. ముందుగా గిన్నెలో పాలు పోసి వేడి చేయండి. వాటిలో కొన్ని పక్కకు తీసుకొని కాస్తంత కుంకుమ పువ్వు వేసి పక్కన పెట్టుకోండి. మిగిలిన పాలను క్రీమీగా మారే వరకు అలాగే సన్నని మంటపై కలుపుతూ ఉండండి. తరువాత కుంకుమ పువ్వు పాలు, రుచికి సరిపడా చక్కెర, ఏలకుల పొడి జోడించండి. మిశ్రమం చిక్కగా అయిన తర్వాత కోవాలా తయారవుతుంది. అప్పుడు నెయ్యి వేసి బాగా కలిపి ఒక ప్లేట్ లోకి తీసుకోండి. ఈ మిశ్రమం చల్లబడ్డాక పిండి ముద్దలా అవుతుంది. అప్పుడు వీటిని మోదకాలుగా తయారు చేసుకోవచ్చు. ఇది క్రీమీ రుచిగల మోదకాలు.

nuvvula-modak.jpg

నువ్వుల మోదకాలు

నువ్వుల మోదకాల తయారీకి మీకు నువ్వులు, బెల్లం, ఏలకుల పొడి, తురిమిన కొబ్బరి తీసుకోండి. ముందుగా నువ్వులను వేయించి పిండిలా చేయండి. ఇందులో బెల్లం, తురిమిన కొబ్బరి, ఏలకుల పొడి కలిపి పూర్ణంలా తయారు చేసుకోండి. అనంతరం బియ్యంపిండిని వేడి నీటితో వేసి పిండి తయారు చేసుకోండి. తరువాత వీటిని చిన్న చపాతీలా చేసి అందులో నువ్వులు, బెల్లం మిశ్రమాన్ని ఫిల్లింగ్ చేసి మోదకాల ఆకారంలో చేయండి. వీటిని ఆవిరి మీద ఉడికించండి. రుచికరమైన, ఆరోగ్యకరమైన నువ్వుల మోదకాలు సిద్ధమైనట్టే.


ukadiche-modak.jpg

ఉకడిచే మోదకాలు

మహారాష్ట్రలో ఉకడిచే మోదకాలు చాలా ఫేమస్. వీటిని తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు బియ్యం పిండి, బెల్లం, తురిమిన కొబ్బరి, నెయ్యి. ముందుగా బియ్యం పిండిని వేడి నీటితో కలిపి చపాతీ పిండిలా తయారు చేసుకోండి. తురిమిన కొబ్బరిని నెయ్యిలో వేయించి దానికి బెల్లం వేసి ఫిల్లింగ్ తయారు చేసుకోండి. తరువాత పిండిని చిన్న చపాతీల్లాగా చేసి ఫిల్లింగ్ తో నింపి మోదకాల ఆకృతిలో చేయండి. చివరిగా వీటిని ఆవిరి మీద ఉడికించినట్లయితే నోరూరించే ఉకడిచే మోదకాలు రెడీ.

chocolate-modak.jpg

చాక్లెట్ మోదకాలు

చాక్లెట్ మోదకాలు పిల్లలకు మహా ఇష్టమైనవి. వీటి తయారీ కూడా చాలా ఈజీ. ఇందుకోసం బియ్యం పిండి, చాక్లెట్, నెయ్యి, డ్రై ఫ్రూట్స్ అవసరం. ముందుగా, డ్రై ఫ్రూట్స్‌ను నెయ్యిలో వేయించి కరిగించిన చాక్లెట్‌తో కలిపి ఫిల్లింగ్ తయారు చేయండి. బియ్యం పిండిని వేడి నీటితో కలిపి చిన్న చపాతీల్లా చేయండి. ఫిల్లింగ్‌తో నింపి మోదకాల ఆకారంలో తయారు చేయండి. వీటని ఆవిరి మీద ఉడికిస్తే చాక్లెట్ మోదకాలు పూర్తయిన్నట్లే.


poha-modak.jpg

అటుకుల మోదకాలు

అటుకుల మోదకాలు చేయడం చాలా సులభం. దీని కోసం అటుకులు, బెల్లం, నెయ్యి, జీడిపప్పు, ఏలకుల పొడి ఉంటే చాలు. ముందుగా అటుకులను నీళ్లలో కడిగి పిండి పక్కన పెట్టుకోవాలి. తర్వాత బాణలిలో నెయ్యిలో వేయించాలి. కాస్త వేగాక బెల్లం, జీడిపప్పు జోడించండి. తర్వాత ఏలకుల పొడి వేసి బాగా కలపండి. ఈ ఫిల్లింగ్‌ను మోదకాల ఆకారంలో తయారు చేయండి. కేవలం 10 నిమిషాల్లో అటుకుల మోదకాలు తయారైపోతాయి.


ఇవీ చదవండి..

ఏకదంతుడి రూపాలు ఎన్నెన్నో..

ఈ సమయాల్లో గణపతిని ప్రతిష్టిస్తే శుభ ఫలితాలు

For More Devotional News

Updated Date - Aug 26 , 2025 | 02:53 PM