Vinayaka Chavithi: వినాయకుడి విగ్రహాన్ని ఇక్కడ మాత్రం ఉంచవద్దు.. ఎందుకంటే..
ABN , Publish Date - Aug 26 , 2025 | 03:54 PM
వినాయక చవితి వేళ.. స్వామి వారిని ఇలా పూజించాలని పండితులు చెబుతున్నారు. అలాగే విద్యార్థులకు విద్య బాగా రావాలంటే.. ఈ విధంగా చేయాలంటున్నారు.
హిందూ సంప్రదాయం ప్రకారం ఏడాదిలో చాలా పండగలు వస్తాయి. కానీ అన్ని పండగల్లో వినాయక చవితి ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ పండగ జరుపుకునే విధానం ప్రకృతికి చాలా దగ్గరగా ఉంటుంది. అలాగే ఈ రోజు పూజా విషయంలో ఇంట్లో, ఆఫీసుల్లో వాస్తు నియమాలను పాటించాలని పండితులు చెబుతున్నారు. విగ్రహం పెట్టే దిశ, రంగు, వస్తువు, శుభ్రత తదితర అంశాలు సంపదతోపాటు ఐశ్వర్యంపై ప్రభావం చూపిస్తాయని వివరిస్తున్నారు. ఈ వాస్తు సూచనలు పాటించడం ద్వారా గృహంలో శాంతి, జీవితంలో ఆనందం, వ్యాపారంలో అభివృద్ధి కలుగుతాయని చెబుతున్నారు. వినాయకుడి విగ్రహాన్ని సరైన ప్రదేశంలో ఉంచి పూజించడం, శుభప్రదమైన వస్తువులను ఎంచుకోవడంతో మన చుట్టూ ఉన్న ఎనర్జీ.. పాజిటివ్‌గా మారి.. మంచి ఫలితాలు వస్తాయి పేర్కొంటున్నారు.
విగ్రహం పెట్టే దిశ..
ఇంట్లో కానీ.. ఆఫీసులో కానీ వినాయకుడి విగ్రహాన్ని ఈశాన్యంలో ఉంచాలి. ఈశాన్యం అంటేనే పవిత్రమైన దిశ. ఈ దిశలో విగ్రహం ఉంచితే సానుకూల శక్తి వస్తుంది. తద్వారా సంపద పెరుగుతోంది. ఈశాన్యంలో ఉంచిన విగ్రహం.. తూర్పు లేదా పడమర వైపు చూస్తున్నట్లు ఉంచాలి. అయితే మెట్ల కింద కానీ.. చీకటి మూలల్లో కానీ.. బాత్‌రూమ్‌ల వద్ద కానీ పెట్టకూడదు.
మట్టితో చేసిన విగ్రహం అయితే..
మట్టి లేదా పర్యావరణానికి ఏ మాత్రం హాని చేయని వస్తువులో చేసిన విగ్రహాన్ని పూజకు వినియోగించండి. అలాగే ఎడమ వైపు తొండం ఉన్న వినాయకుడి విగ్రహం అయితే శాంతి, స్థిరత్వాన్ని ఇస్తుంది. అఫీసు కోసం అయితే కుడి వైపు తొండం ఉన్న వినాయకుడిని పూజించండి. ఈ గణనాథుని విగ్రహం ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేస్తాడని అంటారు.
కూర్చున్నదా..? లేక నిలబడ్డదా..?
కూర్చున్న వినాయకుడు: ఇది శాంతి, జ్జానం, స్థిరమైన ప్రగతిని సూచిస్తుంది. ఇది ఇంటికి చాలా మంచిది.
నిలబడిన వినాయకుడు: ఇది ఉత్సాహం, చురుకుదనం, విజయాన్ని సూచిస్తుంది. ఆఫీసు లేదా వ్యాపార స్థలాలకు ఇది సరైనది.
విగ్రహ రంగు..
తెలుపు విగ్రహం శాంతి, సామరస్యాన్ని ఇస్తుంది.
పసుపు లేదా బంగారు రంగు విగ్రహం సంపద, ఐశ్వర్యాన్ని ఇస్తుంది.
ఇక విగ్రహానికి ఎరుపు లేదా కాషాయ రంగు వస్త్రాలను వేయడం మంచిది.
వినాయకుడికి నైవేద్యం..
పాల తాలికలు, పప్పులో ఉండరాళ్లు, వడపప్పు, పానకం, పర్వాన్నం తదితర వంటకాలు చేసి వినాయకుడికి నైవేద్యంగా పెడతారు.
ఆఫీసులో సంపద పెరగడం కోసం ఈ చిట్కాలు..
నగదు పెట్టే క్యాష్ కౌంటర్ లేదా లాకర్‌ను ఉత్తర దిశలో ఉంచాలి.
లాకర్ ఉంచిన గది తలుపులు ఉత్తరం లేదా తూర్పు వైపు తెరుచుకునేలా ఉండాలి.
పని చేసే టేబుల్‌పై చిన్న వినాయకుడి విగ్రహం ఉంచాలి.
పలికిన విగ్రహాలు ఇంట్లో ఉంచవద్దు.
ఇక విద్యార్థులకు..
విద్యార్థులు పాఠ్య పుస్తకాలు వినాయకుడి పూజ వద్ద ఉంచాలి.
ఈ పుస్తకాల్లోని మొదటి పేజీలో పుసుపుతో స్వస్తిక్ గుర్తు వేయాలి.
అలా అయితే బాగా చదువుకుంటారని పెద్దలు చెబుతారు. అంతేకాదు.. దేవుని అనుగ్రహం సైతం వారి మీద ఉంటుందని ప్రగాఢంగా విశ్వసిస్తారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..