CM Revanth Reddy: ట్రంప్ ఒత్తిడికి లొంగిన కేంద్రం
ABN, Publish Date - May 22 , 2025 | 04:34 AM
పాక్‌పై గుణపాఠం చెప్పే విషయంలో కేంద్రం వెనకడుగు వేసిందని రేవంత్ రెడ్డి విమర్శించారు. రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ నేతలు ఆయన సేవలను కొనియాడారు.
పాక్‌కు గుణపాఠం చెప్పకుండా వెనకడుగేసింది.. అమెరికా పెత్తనాన్ని నాడే ఇందిర తిరస్కరించారు
కేంద్ర బలగాలకు మేము అండగా నిలబడితే కిషన్‌రెడ్డి దుప్పటి కప్పుకొని పడుకున్నారు
తప్పు కప్పిపుచ్చుకునేందుకే రాహుల్‌పై విమర్శలు.. దేశానికి వన్నె తెచ్చిన నేత రాజీవ్‌గాంధీ
రాజీవ్ వర్ధంతి కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, మే 21 (ఆంధ్రజ్యోతి): పాకిస్థాన్‌తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిడికి ప్రధాని మోదీ సర్కారు లొంగిపోయిందని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. పాకిస్థాన్ కాలు దువ్వితే శాశ్వత గుణపాఠం చెప్పాలంటూ కాంగ్రెస్ పార్టీ సహా అందరూ అండగా నిలబడ్డా.. వెనకడుగు వేసిన దుస్థితి మోదీ సర్కారుదని అన్నారు. కానీ, 1971లో పాక్‌తో యుద్ధం జరిగినప్పుడు.. అమెరికా అధ్యక్షుడు మధ్యవర్తిత్వం వహిస్తానన్నా నాటి ప్రధాని ఇందిరాగాంధీ తిరస్కరించారని తెలిపారు. ‘‘మాపై పెత్తనం చెలాయించాలనుకుంటే మా దేశం సహించబోదని, ఎవరి మధ్యవర్తిత్వమూ మాకు అవసరం లేదని మా దేశాన్ని మేమే రక్షించుకోగలమని విస్పష్టంగా చెప్పిన ఘనత ఇందిరాగాంధీది’’ అని రేవంత్ అన్నారు. బుధవారం మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ వర్థంతి సందర్భంగా సచివాలయం ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి సీఎం రేవంత్‌రెడ్డి.. టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్, మంత్రి జూపల్లి కృష్ణారావు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలతో కలిసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. భారతదేశంపై పెత్తనం చెలాయించాలని 1971లో పాకిస్థాన్ యుద్ధం చేస్తే.. ఆ దేశాన్నే చీల్చి.. ఆ దేశ ప్రభుత్వ పెద్దలకు గుణపాఠం చెప్పిన ఘనత ఉక్కు మహిళ ఇందిరాగాంధీది అని కొనియాడారు. ఉగ్రవాదం ముసుగులో దేశ పౌరులపై దాడులను నిర్మూలించడంలో ఇందిరాగాంధీయే మనకు ఆదర్శమన్నారు. పహల్గాం ఘటన తర్వాత మోదీ సర్కారుకు ఖర్గే, రాహుల్‌సహా కాంగ్రెస్ శ్రేణులూ అండగా నిలబడ్డాయని తెలిపారు. అయినా దానిని సద్వినియోగం చేసుకోకుండా దురదృష్టవశాత్తూ కేంద్రం వెనుకడుగు వేసిందన్నారు.
పాక్‌ను ఓడిస్తే ప్రపంచం అభినందించేది..
పాకిస్థాన్‌తో యుద్ధాన్ని ఆపకుంటే ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీస్తానని తాను బెదిరిస్తే.. భారత ప్రభుత్వం తన ఒత్తిడికి లొంగిందంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించే పరిస్థితి వచ్చిందని రేవంత్ అన్నారు. ఈ దేశంలో నడుస్తున్న ప్రభుత్వం ట్రంప్ ఒత్తిళ్లకు లొంగి పోయిందని ప్రజలు కూడా భావించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. యుద్ధంలో పాక్‌ను ఓడిస్తే ప్రపంచం కేంద్ర ప్రభుత్వాన్ని అభినందించి ఉండేదని పేర్కొన్నారు. గొప్పల కోసం బీజేపీ శ్రేణులను ఆ పార్టీ నాయకత్వం వీధుల్లో తిప్పుతుందంటేనే నైతికంగా ప్రజలకు వారు జవాబు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడిందని అర్థమవుతోందన్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తమ ప్రభుత్వం చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకే యుద్ధ వాతావరణ సమయంలో ప్రభుత్వానికి అండగా నిలబడ్డ రాహుల్‌గాంధీపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. యుద్ధ సమయంలో కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా మొదట తిరంగా ర్యాలీ చేసింది తెలంగాణ ప్రభుత్వమని గుర్తు చేశారు. ఆనాడు తమను అభినందించడానికి కిషన్‌రెడ్డికి నోరు రాలేదని విమర్శించారు. కేంద్ర మంత్రిగా ఆ ప్రభుత్వానికి అండగా నిలబడాల్సిన సమయంలో కిషన్‌రెడ్డి దుప్పటి కప్పుకొని పడుకున్నారని ఎద్దేవా చేశారు. దేశ రక్షణ, సమగ్రత విషయంలో తాము రాజకీయాలు చేయబోమని, భారత ప్రభుత్వానికి, జవాన్లకు అండగా నిలబడతామని రేవంత్ స్పష్టం చేశారు. సచివాలయం వద్ద రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే సంకుచిత మనస్తత్వం కలిగిన కొందరు విమర్శలు చేశారని తప్పుబట్టారు. ప్రధానిగా దేశానికే వన్నె తెచ్చిన మహానాయకుడు రాజీవ్‌గాంధీ అని, ఆర్థిక, సరళీకృత ఆర్థిక విధానాలతో దేశాన్ని బలమైన శక్తిగా నిలబెట్టారని కొనియాడారు. యువతకు 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించి ప్రభుత్వాల ఏర్పాటులో భాగస్వామ్యం కల్పించారన్నారు.
దేశ సమగ్రత కోసం ప్రాణాలర్పించిన రాజీవ్: భట్టి
రాజీవ్‌గాంధీ 34వ వర్ధంతి సందర్భంగా గాంధీభవన్‌లో ఆయన చిత్రపటానికి కాంగ్రెస్ నేతలు బుధవారం ఘనంగా నివాళులర్పించారు. వారిలో టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, మాజీ ఎంపీలు వి.హన్మంతరావు, మధుయాష్కీగౌడ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివచరణ్‌రెడ్డి తదితరులు ఉన్నారు. అనంతరం యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని మహేశ్‌కుమార్‌గౌడ్ ప్రారంభించారు. దేశ సమగ్రత కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుడు, దేశంలో కంప్యూటర్ విప్లవాన్ని తీసుకొచ్చిన గొప్ప దార్శనికుడు రాజీవ్‌గాంధీ అని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క కొనియాడారు. క్లిష్ట సమయంలో ప్రధానిగా బాధ్యతలు చేపట్టి, దేశాభివృద్ధికి ఎనలేని కృషి చేశారని పేర్కొన్నారు.
కాంగ్రెస్‌లో చేరికలు
మాజీమంత్రి లక్ష్మీనారాయణ కోడలు కంజర్ల విజయలక్ష్మి గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ సమక్షంలో బుధవారం కాంగ్రెస్‌లో చేరారు. ఆమెతో పాటు ఆమె భర్త చంద్రకాంత్ యాదవ్, సనత్‌నగర్‌కు చెందిన పలువురు నాయకులు పార్టీ కండువా కప్పుకున్నారు.
Updated Date - May 22 , 2025 | 04:35 AM