Miss World 2025: మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే ప్రారంభం.. అందాల కిరీటం వరించేదెవరినో...
ABN, Publish Date - May 31 , 2025 | 07:31 PM
మిస్ వరల్డ్ ఫైనల్స్ పోటీలను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. శనివారం నాడు ఈ పోటీల ఫైనల్స్ జరుగుతున్నాయి. హైటెక్స్ వేదికగా ఘనంగా ఈ కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో పలువురు అందాల భామలు పాల్గొని కనువిందు చేస్తున్నారు.
హైదరాబాద్: భాగ్యనగరంలోని హైటెక్స్ వేదికగా 72వ మిస్ వరల్డ్ ఫైనల్స్ (Miss World Grand Finale) కార్యక్రమం ఇవాళ(శనివారం) అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన 108మంది మగువలు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఇవాళ రాత్రికి మిస్ వరల్డ్ ప్రపంచ విజేత ఎవరో తేలనుంది. మిస్ వరల్డ్ కిరీటం కోసం ఫైనల్స్‌కి చేరిన వారు పోటీపడుతున్నారు. సుమారు 20 రోజులపాటు జరిగిన వివిధ కార్యక్రమాల్లో అందాల భామలు పాల్గొని తమ ప్రతిభను చాటడంతోపాటు, తెలంగాణలో ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించారు. తెలంగాణ జరూర్ ఆనా నినాదాన్ని ప్రపంచవ్యాప్తం చేశారు.
మిస్ వరల్డ్ 2016 స్టెఫానీ డెల్ వాలె, భారతీయ ప్రెజెంటర్ సచిన్ కుంభర్ హోస్ట్‌లుగా వ్యవహరిస్తున్నారు. బాలీవుడ్ తారలు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, ఇషాన్ ఖట్టర్ ఫైనల్స్‌లో స్టేజ్ పైన లైవ్ ప్రదర్శనలు ఇస్తున్నారు. కాగా, ప్రముఖ మానవతావాది, నటుడు సోనూసూద్‌కు మిస్‌వరల్డ్ హ్యూమానిటేరియన్ అవార్డు ప్రదానం చేయనున్నారు. మరోవైపు ఫైనల్స్‌కు ఆయన న్యాయనిర్ణేతగానూ వ్యవహరిస్తారు. ఇతర జ్యూరీలుగా సుధారెడ్డి, డాక్టర్ కారినా టర్రెల్ (మిస్ ఇంగ్లాండ్ 2014), మిస్ వరల్డ్ సీఈఓ జూలియా మోర్లీ ఉన్నారు. మిస్ వరల్డ్ 2017, బాలీవుడ్ నటి మనుషి చిల్లర్ ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ఈ గ్రాండ్ ఫినాలే కార్యక్రమం భారతదేశంలో సోనీ లివ్‌లో లైవ్ స్ట్రీమ్ అవుతుంది. కొన్ని దేశాల్లో జాతీయ టెలివిజన్‌లో ప్రసారం అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా www.watchmissworld.com ద్వారా హై డెఫినిషన్‌లో అందుబాటులో ఉంది.
మిస్ వరల్డ్ ఫైనల్స్‌కు భారీ ఏర్పాట్లు..
సాయంత్రం 6.30లకి మిస్ వరల్డ్ ఫినాలే ప్రారంభమైంది. ఈ కార్యక్రమం కోసం రాష్ట్ర టూరిజం శాఖ, మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ భారీ ఏర్పాట్లు చేసింది. గ్రాండ్ ఫినాలేకి 3,500 మంది గెస్ట్‌లుగా వ్యవహరించనున్నారు. గ్రాండ్ ఫినాలేకి టాలీవుడ్, బాలీవుడ్ నటీనటులు పాల్గొననున్నారు. ఫినాలే కోసం రూ.7 కోట్లకు పైగానే ఖర్చుచేశారు. ముంబైకి చెందిన ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థకు అప్పగించారు. ఫినాలే ఈవెంట్‌ను 2016 మిస్ వరల్డ్ విన్నర్ స్టేఫినీ డెల్ వాలే, సచిన్ కుంభర్ హోస్ట్ చేయనున్నారు. బాలీవుడ్ తార జాక్వెలిన్ ఫెర్నాండెజ్, ఇషాన్ కట్టర్ స్పెషల్ లైవ్ షో ఇవ్వనున్నారు. మిస్ వరల్డ్ న్యాయనిర్ణేతలుగా నటుడు సోనుసూద్, సుధారెడ్డి, 2014 మిస్ ఇంగ్లాండ్ కరీనా టర్రెల్ వ్యవహరించనున్నారు.
ప్రత్యేక అతిథిగా 2017 మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్ రానున్నారు. ముఖ్య అతిథిగా సీఎం రేవంత్‌రెడ్డి హాజరవనున్నారు. ఫినాలేలో మిస్ వరల్డ్ హ్యూమానిటరియన్ అవార్డును సోనుసూద్ అందుకోనున్నారు. విన్నర్‌ను మిస్ వరల్డ్ చైర్ పర్సన్ జూలియా మోర్లీ ప్రకటించనున్నారు. విజేతకు 6.21 కోట్ల విలువగల బ్లూ క్రౌన్ 2024 మిస్ వరల్డ్ క్రిస్టినా అలంకరించనున్నారు. విశ్వసుందరికి రూ. 8.5 కోట్ల ప్రైజ్ మనీ దక్కనున్నది. ఫినాలేలో 40 మంది సుందరీమనులు పోటీపడనున్నారు. టాప్ 40లో ఇప్పటికే 16 బెర్త్‌లు ఖరారయ్యాయి. ఈ రోజు జరిగే క్వార్టర్స్ ఫైనల్స్‌లో 24మందిని జూరీ మెంబర్లు ఎంపిక చేయనున్నారు. బ్యూటీ విత్ ఏ పర్సస్‌లో విజేతలుగా మిస్ ఇండోనేషియా, మిస్ వేల్స్, మిస్ ఉగాండ నిలిచారు. బ్యూటీ విత్ ఏ పర్సస్, టాలెంట్ ఈవెంట్ రెండింట్లోనూ మిస్ ఇండోనేషియా మోనిక కేజియా గెలిచారు. స్పోర్ట్స్ ఈవెంట్‌లో విజేతగా మిస్ ఎస్తోనియా నిలిచారు. హెడ్-టు-హెడ్ రౌండ్‌లో మిస్ టర్కీ గెలుపొందారు. ఫ్యాషన్ గ్రాండ్ ఫినాలేలో టాప్ మోడల్‌గా మిస్ ఇండియా నందినీ గుప్తా నిలిచారు.
ఫైనల్స్‌లో ఎంపిక విధానం
108 మంది పోటీదారుల్లో ప్రతి ఖండం (అమెరికా& కరీబియన్, ఆఫ్రికా, యూరప్, ఆసియా & ఓషియానియా) నుంచి 10 మంది సెమీఫైనలిస్టులు, మొత్తం 40 మంది క్వార్టర్ ఫైనల్స్‌కు చేరారు. కొందరు పోటీదారులు ఫాస్ట్-ట్రాక్ ఛాలెంజ్‌ల ద్వారా ఇప్పటికే క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నారు.
పోటీలో పాల్గొనే వారి వివరాలిలా..
అమెరికా & కరీబియన్:
హెడ్ టు హెడ్ ఛాలెంజ్ ద్వారా అన్నాలిసే నాంటన్ (త్రినిటాడ్ అండ్ టొబాగో), టాప్ మోడల్ ద్వారా ఆరెలీ జోకిమ్ (మార్టినిక్), బ్యూటీ విత్ ఏ పర్పస్ ద్వారా వలెరియా పెరెజ్ (ప్యూర్టో రికో), మల్టీ మీడియా అవార్డు ద్వారా మైరా డెల్గాడో (డొమినికన్ రిపబ్లిక్).
ఆఫ్రికా: హెడ్ టూ హెడ్ ఛాలెంజ్ ద్వారా ఫైత్ బ్వాల్యా (జాంబియా), టాప్ మోడల్ ద్వారా సెల్మా కమన్య (నమీబియా), బ్యూటీ విత్ ఏ పర్పస్ ద్వారా నటాషా న్యోన్యోజి (ఉగాండా), మల్టీ మీడియా అవార్డు ద్వారా ప్రిన్సెస్ ఇస్సీ (కామెరూన్).
యూరప్: స్పోర్ట్ ఛాలెంజ్ ద్వారా ఎలిసే రండ్మా (ఎస్టోనియా), హెడ్ టు హెడ్ ఛాలెంజ్‌తోపాటు బ్యూటీ విత్ ఏ పర్పస్ ద్వారా మిల్లీ మే ఆడమ్స్ (వేల్స్), టాప్ మోడల్ ద్వారా జాస్మిన్ గెర్హార్డ్ట్ (ఐర్లాండ్), మల్టీ మీడియా అవార్డ్ ద్వారా ఆండ్రియా నికోలిచ్ (మాంటెనెగ్రో).
ఆసియా, ఓషియానియా: టాలెంట్ అండ్ బ్యూటీ విత్ ఏ పర్పస్ ద్వారా మోనికా కెజియా సెంబిరింగ్ (ఇండోనేషియా), హెడ్ టు హెడ్ ఛాలెంజ్ ద్వారా ఇడిల్ బిల్గెన్ (టర్కీ), టాప్ మోడల్ ద్వారా నందిని గుప్తా (భారతదేశం), మల్టీ మీడియా అవార్డు ద్వారా ఓపల్ సుచాతా (థాయిలాండ్).
మిగిలిన సెమీఫైనలిస్టులు వ్యక్తిగత ఇంటర్వ్యూల తర్వాత జడ్జ్‌ల ప్యానెల్ ద్వారా ఎంపిక చేస్తారు. ఈ ఫైనల్ షో సమయంలో నేరుగా వెల్లడిస్తారు.
క్వార్టర్ ఫైనల్స్ నుంచి, ప్రతి ఖండం నుంచి టాప్ 5, ఆ తర్వాత టాప్ 2, చివరిగా నలుగురు ఖండాలకు సంబంధించిన విజేతలు ఎంపికవుతారు. వారు చివరి ప్రశ్నకు సమాధానం ఇవ్వడం ద్వారా కొత్త మిస్ వరల్డ్ ఈ రాత్రికి ఎన్నుకుంటారు.
ప్రస్తుత మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా (71వ మిస్ వరల్డ్) కొత్త మిస్ వరల్డ్ విజేతకు కిరీటం అందజేస్తారు.
ఈ వార్తలు కూడా చదవండి.
Gold Rates Today: సామాన్యులకు షాకింగ్.. పెరిగిన గోల్డ్, తగ్గిన వెండి ధరలు
NIA raids: వరంగల్‌లో ఉగ్ర కలకలం!
Read Latest Telangana News and National News
Updated Date - May 31 , 2025 | 08:38 PM