CM Revanth Reddy: 42 శాతం సాధిస్తాం
ABN, Publish Date - Jul 24 , 2025 | 01:43 AM
కేంద్రం మెడలు వంచైనా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధిస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. గతంలో మూడు వ్యవసాయ నల్లచట్టాలు చేస్తే.. వాటిని ఉపసంహరించుకునేలా చేశామని గుర్తు చేశారు.
కేంద్రం మెడలు వంచైనా తెస్తాం.. రైతు చట్టాల్నీ అలాగే రద్దు చేయించాం
ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్, ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయం ఉన్న మహారాష్ట్రలో ముస్లింలకు రిజర్వేషన్లు అమలవుతున్నాయి. బీజేపీ నేతలకు దమ్ముంటే ఆ రాష్ట్రాల్లో ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని ప్రకటించాలి. గుజరాత్‌లో ముస్లింలకు రిజర్వేషన్లు ఇకపై కూడా అమలు చేస్తామని ఒక ఇంటర్వ్యూలో చెప్పిన అమిత్ షాను బీజేపీ నుంచి సస్పెండ్ చేస్తారా?
- ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
బీసీ రిజర్వేషన్లపై బీజేపీది ద్వంద్వ వైఖరి
అసెంబ్లీలో మద్దతు.. కేంద్రంలో తాత్సారం
రాష్ట్ర బీజేపీ కొత్త అధ్యక్షుడిది వితండవాదం
ముస్లింల సాకుతో బీసీ రిజర్వేషన్లకు మోకాలడ్డు
బండి సంజయ్, కిషన్‌రెడ్డి అడ్డుపడుతున్నారు
దేశానికి రోల్‌మోడల్‌గా తెలంగాణ కులగణన
ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేతపై ఆలోచిస్తున్నాం
రాష్ట్రంలో ప్రతిపక్ష బీఆర్‌ఎ్‌సకు నాయకుడు లేడు
బీఆర్‌ఎ్‌సలో ఇంటిపోరు అంతా ఓ డ్రామా
ఉపరాష్ట్రపతి పదవిని దత్తాత్రేయకు ఇవ్వాలి
తెలంగాణ ప్రజల తరఫున కేంద్రాన్ని కోరుతున్నా
ఢిల్లీలో మీడియా సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి
న్యూఢిల్లీ, జూలై 23 (ఆంధ్రజ్యోతి): కేంద్రం మెడలు వంచైనా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధిస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. గతంలో మూడు వ్యవసాయ నల్లచట్టాలు చేస్తే.. వాటిని ఉపసంహరించుకునేలా చేశామని గుర్తు చేశారు. తొలుత మొండికేసిన బీజేపీ ప్రభుత్వ మెడలు వంచి రద్దు చేయించామని అన్నారు. చివరికి కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్రమోదీ రైతులకు క్షమాపణలు చెప్పాల్సి వచ్చిందన్నారు. బుధవారం ఢిల్లీ తుగ్లక్ రోడ్డులోని ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. బీసీ రిజర్వేషన్లపై బీజేపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని ఆరోపించారు. ‘‘బీజేపీ వాళ్లు వితండవాదం చేస్తున్నారు. శాసనసభలో చర్చ జరిగినప్పుడు తీర్మానానికి బీజేపీ, బీఆర్‌ఎస్, ఎంఐఎం, సీపీఐ మద్దతు ఇచ్చాయి. ఓవైపు తెలంగాణలోని బీజేపీ ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తుంటే.. కేంద్ర బీజేపీ తాత్సారం చేస్తోంది. ఇక ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు రాంచందర్‌రావు మాత్రం ‘మీరెలా చేస్తారు? మీరు హామీ ఇచ్చుకుంటే మీరే చేసుకోండి’ అని అంటున్నారు. లేదంటే ముస్లింలను రిజర్వేషన్ల నుంచి తొలగించండని వితండవాదం చేస్తున్నారు. ఇవాళ బీజేపీకి, కాంగ్రె్‌సకు వేర్వేరు రాజ్యాంగాలు లేవు. అందరికీ అంబేడ్కర్ రాజ్యాంగం ఒక్కటే. ఆ రాజ్యాంగానికి లోబడే రిజర్వేషన్లు పెంచాలంటున్నాం’’ అని రేవంత్‌రెడ్డి అన్నారు. వందేళ్ల నుంచి వాయిదా పడుతూ వస్తున్న బీసీ రిజర్వేషన్లు, కులగణనను తెలంగాణ ప్రభుత్వం విజయవంతంగా పూర్తిచేసిందని తెలిపారు. దేశానికి తెలంగాణ రోల్ మోడల్‌గా నిలిచిందని, దానిని బీజేపీ, బీఆర్‌ఎస్ ఓర్వలేకపోతున్నాయని మండిపడ్డారు.
42 శాతం బీసీ రిజర్వేషన్లతోనే ఎన్నికలకు..
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతోనే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనే కృతనిశ్చయంతో తమ ప్రభుత్వం ఉందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. హైకోర్టు సైతం 90 రోజుల్లో (సెప్టెంబరు నెలాఖరులోగా) ఎన్నికలు నిర్వహించాలని, 30 రోజుల్లో (జూలై నెలాఖరులోగా) రిజర్వేషన్లు ఖరారు చేయాలని ఆదేశించిందని గుర్తు చేశారు. బీసీలకు విద్య, ఉపాధి రంగాల్లో రిజర్వేషన్లు, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించి తెలంగాణ శాసనసభ పూర్తిస్థాయిలో చర్చించి ఆమోదించిన రెండు బిల్లులను ఆమోదించడంలో కేంద్ర ప్రభుత్వం తాత్సారం చేస్తోందని మండిపడ్డారు. ఈ రెండు బిల్లుల ఆమోదానికి కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు లోక్‌సభ విపక్ష నేత రాహుల్‌గాంధీ, రాజ్యసభ విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గేలను గురువారం కలవనున్నట్లు సీఎం చెప్పారు. సాయంత్రం కాంగ్రెస్ ఎంపీలకు ఈ అంశాన్ని వివరిస్తామన్నారు.
అమిత్ షాను సస్పెండ్ చేస్తారా?
బీసీల రిజర్వేషన్లను అడ్డుకునేందుకు కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, సంజయ్.. ముస్లింలను సాకుగా చూపుతున్నారని సీఎం రేవంత్ ఆరోపించారు. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్, ఆర్‌ఎ్‌సఎస్ ప్రధాన కార్యాలయం ఉన్న మహారాష్ట్రలో ముస్లింలకు రిజర్వేషన్లు అమలవుతున్నాయని తెలిపారు. బీజేపీ నేతలకు దమ్ముంటే ఆ రాష్ట్రాల్లో ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని ప్రకటించాలన్నారు. గుజరాత్‌లో ముస్లింలకు రిజర్వేషన్లు అమలవుతున్నాయని, ఇకపై కూడా అమలు చేస్తామని అమిత్ షా ఒక ఇంటర్వ్యూలో చెప్పిన విషయాన్ని రేవంత్ ప్రస్తావించారు. ఇందుకు బీజేపీ నేతలు ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా? అని ప్రశ్నించారు. తెలంగాణలో తాము చేపట్టిన కుల సర్వేలో 56.4 శాతం బీసీలు ఉన్నట్లు తేలిందని, 17.45 శాతం ఎస్సీలు, 10.08 శాతం ఎస్టీలు, 10.09 శాతం అగ్ర వర్గాలవారు ఉన్నట్లు వెల్లడైందన్నారు. కాగా, 3.09 శాతం మంది తాము ఏ కులానికీ చెందినవాళ్లం కాదని చెప్పారని, ఇదో కొత్త పరిణామమని అన్నారు.
ఓబీసీ రిజర్వేషన్లకు లోక్‌సభ ఎన్నికలు లిట్మస్ టెస్ట్
కులగణన విషయంలో తెలంగాణ ప్రభుత్వం దేశానికి రోల్‌మోడల్‌గా నిలిచిందని సీఎం రేవంత్ అన్నారు. కులగణన చేపట్టబోమని సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించిన కేంద్ర ప్రభుత్వం.. తెలంగాణలో తాము కులగణన చేపట్టాక తమను అనుసరిస్తూ గెజిట్ విడుదల చేసిందని పేర్కొన్నారు. రాబోయే లోక్‌సభ ఎన్నికలు ఓబీసీ రిజర్వేషన్లకు లిట్మస్ టెస్టుగా నిలుస్తాయన్నారు. ఈడబ్ల్యూఎ్‌సకు 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వడంతోనే 50 శాతం రిజర్వేషన్ల పరిమితి అంశం పక్కకు పోయిందన్నారు. అలాగే, స్థానిక సంస్థల్లో ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తివేసే విషయాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నామని మరో ప్రశ్నకు సమాధానంగా సీఎం చెప్పారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష బీఆర్‌ఎ్‌సకు నాయకుడు లేడని రేవంత్ అన్నారు. కేసీఆర్ ఇంట్లోనే కోతుల కొట్లాట ఉందని వ్యాఖ్యానించారు. కుల పెద్దనో, కుటుంబంలోని వ్యక్తో కూర్చుని మాట్లాడితే వారి సమస్య పరిష్కారమవుతుందని, కానీ.. ఇంట్లో పంచాయితీ కేవలం ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకేనని అన్నారు. 2008లో హరీశ్‌రావు ఆనాటి సీఎం రాజశేఖర్‌రెడ్డిని కలిశారని, తర్వాత కులపెద్దలతో చర్చల్లో అంతా సవ్యంగా మారిందని గుర్తు చేశారు. ఆర్డినెన్స్‌ను గవర్నర్ తిప్పిపంపారన్న బీఆర్‌ఎస్ నేతల విమర్శలను రేవంత్‌రెడ్డి ఖండించారు. ‘వాళ్లు పిచ్చోళ్లు.. వాళ్లకు ఏ అవగాహన లేదని చెప్పడానికి ఇది సరిపోదా?’ అని వ్యాఖ్యానింరు. ఏ బిల్లును రాష్ట్రపతి, గవర్నర్‌కు పంపినా క్లారిఫికేషన్ కోరతారని, ఇది సర్వసాధారణమని అన్నారు. ఈ విషయంలో గవర్నర్ ఆఫీసు అడిగితే వెంటనే సమాధానం ఇచ్చామని తెలిపారు.
దత్తాత్రేయను ఉపరాష్ట్రపతిని చేయాలి: ముఖ్యమంత్రి రేవంత్
ఉపరాష్ట్రపతి పదవిని తెలంగాణ నేత బండారు దత్తాత్రేయకు ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. జగదీప్ ధన్ ఖడ్ ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేయడం దురదృష్టకర పరిణామమన్నారు. గతంలో ఏపీకి చెందిన వెంకయ్యనాయుడుకు ఉపరాష్ట్రపతి పదవి లభించిందని, ఇప్పుడు తెలంగాణకు చెందిన నేతను ఆ పదవిలో నియమించాలని అన్నారు. బీజేపీలో బీసీలకు అన్యాయం చేస్తున్నారని రేవంత్ ఆరోపించారు. బీసీ వర్గానికి చెందిన దత్తాత్రేయను గవర్నర్ పదవి నుంచి తొలగించారని, బీసీ అయిన బండి సంజయ్‌ను రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తొలగించి.. రాంచందర్‌రావుకు కట్టబెట్టారని విమర్శించారు. తమ ప్రాంత నాయకుల తలల్ని ఎన్డీఏ ప్రభుత్వం పూర్తిగా కోసేసిందని వ్యాఖ్యానించారు. అక్కడి నుంచి అసలు నాయకత్వమే లేకుండా చేయడమనే కుట్ర దీని వెనుక ఉందని ఆరోపించారు. దత్తాత్రేయకు ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వడం ద్వారా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడాలని కోరారు. అయితే తాను ఈ డిమాండ్‌ను తెలంగాణ ప్రజల తరఫున చేస్తున్నానని, ఇండియా కూటమి తరఫున కాదనితెలిపారు. అది ఏఐసీసీ స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయమన్నారు. ఈ విషయంపై కాంగ్రెస్ నాయకత్వంతో తెలంగాణ పక్షాన మాట్లాడతానన్నారు. దత్తాత్రేయ పేరు మోదీ ప్రకటిస్తే తాను ఇండియా కూటమి నేతలతో కూడా మాట్లాడతానని చెప్పారు. దత్తాత్రేయకు పదవి ఇస్తే తెలంగాణలో బీసీలకు న్యాయం జరిగినట్లు కూడా అవుతుందని అన్నారు. మోదీ బీసీ కాదని, కన్వర్టెడ్ బీసీ అని రేవంత్ వ్యాఖ్యానించారు.
రేపు క్యాబినెట్ భేటీ
బీసీల 42శాతం రిజర్వేషన్ల ఆర్డినెన్స్, స్థానిక ఎన్నికలపై చర్చించే అవకాశం
హైదరాబాద్, జూలై 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర మంత్రివర్గ సమావేశం శుక్రవారం (25న) జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలోని ఆరో అంతస్తు క్యాబినెట్ హాల్‌లో సాయంత్రం 4 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. ఈ మేరకు తమ శాఖలకు సంబంధించిన ఎజెండా అంశాలను పంపించాల్సిందిగా అన్ని శాఖల ముఖ్యకార్యదర్శులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు బుధవారం ఆదేశించారు. కాగా, బీసీల 42 శాతం రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నిర్వహించనున్న ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు మహిళలకు మరో పథకాన్ని ప్రారరంభించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. మహాలక్ష్మి పథకంలో భాగంగా 18 ఏళ్లు దాటిన యువతులు, మహిళలకు నెలకు రూ.2,500 చొప్పున భృతిని అందించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది. దీనిపై క్యాబినెట్ సమావేశంలో చర్చించే అవకాశముంది. ఇక బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉంది. బీసీ రిజర్వేషన్ల బిల్లును పార్లమెంటులో ఆమోదింపజేసుకోవడానికి ప్రభుత్వం పలు రకాలుగా ప్రయత్నిస్తోంది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబరు 30లోపు నిర్వహించాల్సి ఉంది. బీసీ రిజర్వేషన్ల అంశం తేలితే తప్ప.. ఎన్నికల వ్యవహారం తేలేటట్లు లేదు. దీనిపైనా క్యాబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
దంచికొడుతున్న వాన.. భారీగా ట్రాఫిక్ జామ్
రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు
Read latest Telangana News And Telugu News
Updated Date - Jul 24 , 2025 | 07:17 AM