Ponguleti Srinivasa Reddy: రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు
ABN , Publish Date - Jul 23 , 2025 | 06:46 AM
రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల పరిష్కారం విషయంలో రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తప్పవని
రెవెన్యూ దరఖాస్తుల పట్ల నిర్లక్ష్యం వద్దు: పొంగులేటి
హైదరాబాద్, జూలై 22(ఆంధ్రజ్యోతి): రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల పరిష్కారం విషయంలో రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తప్పవని, నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని సస్పెండ్ చేసేందుకు ప్రభుత్వం వెనకాడదని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో కొంత మంది అధికారులు రైతులను ఇబ్బంది పెడుతున్నారని, ఇలాంటి ఫిర్యాదులు పునరావృతం కాకుండా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సచివాలయంలోని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావులతో కలిసి రెవెన్యూ మంత్రి మంగళవారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెవెన్యూ సదస్సుల్లో 8.65 లక్షల దరఖాస్తులు వచ్చాయని, ఇందులో ప్రధానంగా సాదాబైనామా, సర్వే నంబరు మిస్సింగ్, అసైన్డ్ భూముల వివాదాలు, వారసత్వ హక్కులకు సంబంధించిన దరఖాస్తులు 6 లక్షల వరకు ఉన్నాయని తెలిపారు. ఆగస్టు 15లోపు వీలైనన్ని సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు.
ఇందిరమ్మ ఇళ్లపై దృష్టి పెట్టండి..: పొంగులేటి
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో సమస్యలు తలెత్తకుండా కలెక్టర్లు నిత్యం పర్యవేక్షణ చేయాలని మంత్రి పొంగులేటి సూచించారు. ప్రభుత్వం ఉచితంగా అందించే ఇసుక.. లబ్ధిదారులకు చేరేలా చూడాల్సిన బాధ్యత కలెక్టర్ల మీదనే ఉందన్నారు. ఇంటి నిర్మాణం కోసం మట్టిని తరలించే లబ్ధిదారుల మీద పోలీసులు కేసులు పెట్టడం సరికాదన్నారు. జాబితాలతో సంబంధం లేకుండా నిరుపేదలు ఉంటే ఇళ్లు కేటాయించాలని చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కోర్టును ఆశ్రయించిన మహిళ.. సీజేఐ ఆసక్తికర వ్యాఖ్యలు
ధన్‌ఖఢ్ రాజీనామా వెనుక నితీష్‌ను తప్పించే కుట్ర.. ఆర్జేడీ ఆరోపణ
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి