Share News

Heavy Rains: దంచికొడుతున్న వాన.. భారీగా ట్రాఫిక్ జామ్

ABN , Publish Date - Jul 23 , 2025 | 04:10 PM

చినుకు పడితే చాలు నగరంలో రహదారులన్నీ వాహనాలతో నిండిపోతున్నాయి. ఈ ట్రాఫిక్ జామ్ కారణంగా.. ఒక కిలోమీటరు దూరం ప్రయాణించాలంటే దాదాపు రెండు గంటల సమయం పడుతోంది.

Heavy Rains: దంచికొడుతున్న వాన.. భారీగా ట్రాఫిక్ జామ్
Heavy Rains

హైదరాబాద్, జులై 23: హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కూకట్‌పల్లి, అమీర్‌పేట, పంజాగుట్ట, ప్యారడైజ్, ప్యాట్నీ, సికింద్రాబాద్, కోఠి, లక్డీకాపూల్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ కారణంగా ఎక్కడికక్కడ వాహనాలు రోడ్లపై నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు.. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో.. వాహనదారులు మరో మార్గం ద్వారా గమ్య స్థానాలు చేరుకుంటున్నారు. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోవడంతో.. పలు మార్గాల్లో అంబులెన్స్‌లు సైతం చిక్కుకు పోయాయి. ఈ నేపథ్యంలో రోగులతోపాటు వారి కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.


తెలంగాణలో గత ఐదు రోజుల నుంచి వరుసగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరి ముఖ్యంగా హైదరాబాద్‌లో వర్షాలు దంచికొడుతున్నాయి. దీని కారణంగా నగరంలోని వివిధ ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లపైకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరడంతో నగర వాసులు పడుతున్న అవస్థలు వర్ణణాతీతంగా ఉంది. సాయంత్రం కాగానే భారీ వర్షం పడుతుండడంతో.. ఉద్యోగులు ఇంటికి చేరుకోవడానికి పెద్ద సాహసమే చేయాల్సి వస్తుంది.


నగరంలోని ప్రతి ప్రధాన కూడలిలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో ఈ ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు పోలీసులు పెద్ద యజ్జమే చేయాల్సి వస్తోంది. భాగ్యనగరంలో కిలోమీటర్ ప్రయాణానికి వాహనదారుడికి జస్ట్ రెండు గంటలు సమయం పడుతుందంటే పరిస్థితి ఆలోచించుకోవచ్చు.


అదీకాక.. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ ప్రకటించింది. బుధవారం ఉదయం నుంచే పలు జిల్లాల్లో కుండపోతగా వర్షం కురుస్తోంది. మరీ ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంతోపాటు శివారు ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. అయితే అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రజలకు వాతావరణ శాఖ స్పష్టంగా సూచించింది. ఇక రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నేటి నుంచి రానున్న నాలుగు రోజులపాటు వరుసగా భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

అలాగే ఉత్తర, ఈశాన్య తెలంగాణ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది. ఈ నేపథ్యంలో గోదావరి నదిలో నీటిమట్టం మరింత పెరుగుతోందంది. నదిలో నీటి ప్రవాహ ఉధృతి పెరుగుతోందని వివరించింది. దీంతో నదీ పరివాహక ప్రాంతాలతోపాటు లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది.


భారీ వర్షాలు నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ, పోలీస్, హైడ్రా, ఎస్‌డీఆర్ఎఫ్ బృందాలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. భారీ వర్షాల కారణంగా వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది.


ట్రాఫిక్ అలర్ట్..

మరోవైపు చిన్న వాన పడితే చాలు హైదరాబాద్ మహానగరం రోడ్లన్నీ వాహనాలతో నిండిపోతున్నాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. కిలోమీటరు దూరం ప్రయాణించాలంటే.. గంటలు గంటలు పడుతున్న పరిస్థితి నెలకొంటుంది. దాంతో నగర వాసులు రహదారులపై నిత్య నరకం అనుభవిస్తున్నారు.

Traffic-3.jpg


భారీ వర్షాల కారణంగా.. ఇవాళ (బుధవారం) సాయంత్రం నగరంలోని వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య ఏర్పడనుంది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాలకు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. అలాగే తప్పనిసరి పరిస్థితుల్లోనే బయటకు రావాలని నగరవాసులకు ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. లేకుంటే తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని ప్రజలకు చెబుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నీట్‌లో స్థానిక కోటాపై తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 23 , 2025 | 06:06 PM