Delhi: పెళ్లికి ఒప్పుకోలేదని.. ఐదో అంతస్తు నుంచి తోసేశాడు..
ABN, Publish Date - Jun 25 , 2025 | 10:45 AM
పెళ్లి చేసుకునేందుకు నిరాకరించిందని 19 ఏళ్ల యువతిని దారుణంగా హత్య చేశాడు ఓ యువకుడు. బుర్ఖాతో ఇంట్లోకి ప్రవేశించి ఆమెను ఐదు అంతస్తుల భవనం నుంచి తోసివేసిన అమానుష ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది.
Neha Murder Case Delhi: ఆమె అతడిని సోదరుడిగా భావించి చనువుగా మాట్లాడుతూ ఉండేది. కానీ, కొన్నాళ్ల తర్వాత అతడు తన వికృత స్వరూపాన్ని బయటపెట్టుకున్నాడు. పెళ్లి చేసుకుందామంటూ ఆ యువతిని వేధించసాగాడు. ఈ బాధలు భరించలేక అతడికి దూరంగా ఉండటం మొదలుపెట్టిందామె. తిరస్కారాన్ని తట్టుకోలేక అవమానంతో రగిలిపోయాడు. తనకు తప్ప మరెవరికీ దక్కకూడదనే దుర్భుద్ధితో ఒక రోజున బుర్ఖా ధరించి యువతి ఇంట్లోకి దూరాడు. ఆమె తండ్రి అడ్డొస్తున్నా బలవంతంగా టెర్రస్ పై నుంచి తోసేసి దారుణంగా హత్య చేశాడు.
ఢిల్లీలో జరిగిన ఈ విషాదకర ఘటన కలకలం రేపుతోంది. 19 ఏళ్ల నేహాను ఆమె సోదరసమానుడిగా భావించే తౌహిక్ అనే యువకుడు దారుణంగా హత్య చేశాడు. పెళ్లి చేసుకునేందుకు నిరాకరించిందనే కోపంతో ఈ ఘెరానికి పాల్పడ్డాడు. మంగళవారం ఈశాన్య ఢిల్లీలోని జ్యోతి నగర్ ప్రాంతంలో ఉన్న నేహా ఇంట్లోకి దొంగచాటుగా బుర్ఖా వేసుకుని ప్రవేశించిన తౌహిక్.. తండ్రి అడ్డుకుంటున్నా ఆమెను బలవంతంగా ఐదో అంతస్తు నుంచి కిందికి తోసేశాడు. యువతి భవనంపై నుంచి కిందపడిన వెంటనే చుట్టుపక్కల వారంతా గమనించి సమీపంలోని జీటీబీ ఆస్పత్రికి తరలించారు. అయినా ప్రయోజనం లేకపోయింది. చికిత్స పొందుతూ మరణించింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, 12వ తరగతి పూర్తిచేసిన నేహా కుటుంబానికి అండగా నిలబడేందుకు ఓ చమురు కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఇక తౌహిక్ అశోక్ నగర్ ప్రాంతంలోని ఒక దుకాణంలో పనిచేస్తున్నాడు. వీరు ఇరువురికీ దాదాపు 3 సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. ఆమె అతడిని అన్నగా భావించి ప్రతి ఏడాది రాఖీపౌర్ణిమ నాడు రాఖీ కూడా కట్టేది. అయితే, కొన్ని నెలల నుంచి తౌహిక్ నేహాను పెళ్లి చేసుకోమంటూ వేధించసాగాడు. ఆమె నాకలాంటి అభిప్రాయంలేదని తెగేసి చెప్పింది. దీంతో కొన్నాళ్లుగా నిన్ను నాశనం చేస్తానంటూ బెదిరించడం మొదలుపెట్టాడు తౌహిక్. కొన్ని రోజుల క్రితమే ఈ విషయాన్ని నేహా తన తల్లితో పంచుకుంది. అంతలోనే, బుర్ఖా వేషంలో ఇంట్లోకి దూరి ఈ దారుణానికి ఒడిగట్టాడు తౌహిక్. హత్య చేసి పరారైన నిందితుడిని ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ జిల్లాలోని టాండాలో పోలీసులు అరెస్టు చేశారు. దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
గదిలోకి కత్తితో వెళ్లిన నవ వధువు.. కంగుతిన్న వరుడు
తెల్ల జుట్టు నల్లగా మారాలంటే.. ఈ రసం తాగాలి..
For National News And Telugu News
Updated Date - Jun 25 , 2025 | 02:26 PM