Bihar Assembly Elections: వారసుల హవా.. అన్ని పార్టీలదీ అదే తీరు
ABN, Publish Date - Oct 19 , 2025 | 05:41 PM
ఆర్జేడీ సుప్రీం లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు, రాజకీయ వారసుడు తేజస్వి యాదవ్ వరుసగా మూడోసారి రఘోపూర్ నియోజకవర్గం పోటీ చేస్తున్నారు. మాజీ మంత్రి శకుని చౌదరి కుమారుడు సమ్రాట్ చౌదరిని తారాపూర్ అభ్యర్థిగా బీజేపీ నిలబెట్టింది.
పాట్నా: గల్లీ నుంచి ఢిల్లీ వరకూ ఏ ఎన్నికలు జరిగినా సహజంగానే టిక్కెట్ల కేటాయింపులో రాజకీయ వారసులకు పెద్దపీట వేయడం కనిపిస్తుంటుంది. ప్రస్తుత బిహార్ అసెంబ్లీ ఎన్నికలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. రాజకీయ నేతల కుమారులు, భార్యలు, బంధువులకు గణనీయంగానే అన్ని పార్టీలు టిక్కెట్లు ఇచ్చాయి.
ఆర్జేడీ నుంచి బీజేపీ వరకూ
ఆర్జేడీ సుప్రీం లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు, రాజకీయ వారసుడు తేజస్వి యాదవ్ వరుసగా మూడోసారి రఘోపూర్ నియోజకవర్గం పోటీ చేస్తున్నారు. మాజీ మంత్రి శకుని చౌదరి కుమారుడు సమ్రాట్ చౌదరిని తారాపూర్ అభ్యర్థిగా బీజేపీ నిలబెట్టింది. ఆర్జేడీ నేత ఒసామా సాహెబ్ రఘునాథ్‌పూర్ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన గ్యాంగ్‌స్టర్ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన దివంగత నేత మహమ్మద్ షహబుద్దీన్ కుమారుడు. పలువురు ఇతర నాయకులు కూడా తమ వారసులను బరిలోకి దింపారు. ఆర్ఎల్ఎస్‌పీ చీఫ్ ఉపేంద్ర కుష్వాహ భార్య స్నేహలత ఇప్పుడు ససరామ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రా కుమారుడు నితీష్ మిశ్రా ఈ ఎన్నికల్లో జాంఝార్‌పూర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు.
భార్యలు, కుమార్తెలు, కోడళ్లు
కేంద్ర మంత్రి జితిన్ రామ్ మాంఝీ కోడలు దీపా మాంఝీ సైతం ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్ మనుమరాలు జాగృతి ఠాకూర్.. ముర్వా నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నారు. జేడీయూ ఎంపీ గిరిధారి ప్రసాద్ కుమారుడు చాణక్య ప్రసాద్ రంజన్‌కు బెల్హార్ నుంచి ఆర్జేడీ టిక్కెట్ ఇచ్చింది. ఇతరుల్లో ఎల్జేపీ ఎంపీ వీణా దేవి కుమార్తె కోమల్ సింగ్ (గైఘాట్ నియోజకవర్గం), జేడీయూ ఎంపీ లవ్లీ ఆనంద్ కుమారుడు చేతన్ ఆనంద్ (నబీన్‌నగర్) దివంగత బీజేపీ నేత నవీన్ కిషోర్ సిన్హా కుమారుడు నితిన్ నవీన్ (బంకిపుర-బీజేపీ), బీజేపీ నేత గంగా ప్రసాద్ చౌరాసియా కుమారుడు సంజీవ్ చౌరాసియా (డిఘా), ఆర్జేడీ సీనియర్ నేత శివనంద్ తివారీ కుమారుడు రాహుల్ తివారీ (షాపూర్) ఉన్నారు.
వీరు కూడా..
బీజేపీ దివంగత నేత విషేశ్వర్ ఓఝా కుమారుడు రాకేష్ ఓఝా సైతం షాపూర్ నుంచి పోటీ చేస్తున్నారు. ఇటీవలే ఆర్జేడీలో చేరిన మాజీ ఎంపీ సూరజ్‌భాన్ సింగ్ భార్య వీణాదేవి మోకమా నుంచి, గ్యాంగ్‌స్టర్ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన మున్నా శుక్లా కుమార్తె శివానీ శుక్లా లాల్‌గంజ్ నియోజవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ విజయ్ కుమార్ కుమారుడు రిషి మిశ్రాకు జాలే నియోజకవర్గం నుంచి టిక్కెట్ ఇచ్చింది.
విశ్లేషకులు ఏమంటున్నారు?
రాజకీయ పార్టీలు భిన్న సిద్ధాంతాలు, రాజ్యంగ విలువలు, ప్రజాస్వామ్య సిద్ధాంతాలతో పనిచేస్తుంటాయని, పేరున్న కుటుంబాల నుంచి వచ్చిన వారికి సహజంగానే రాజకీయాల్లో సులభంగా ప్రవేశం ఉంటుందని ఎకనామిస్ట్ విద్యార్థి వికాస్ అభిప్రాయపడ్డారు. విద్యలో బీహార్ వెనుకబాటుతనం దీనికొక ప్రధాన కారణమని, జనాభాలో 14.71 శాతం మందే పదో తరగతి పాసయినట్టు ఇటీవల జరిపిన ఒక సర్వేలో తేలిందని చెప్పారు. సామాజిక చైతన్యం అంతగా లేకపోవడంతో ఆనువంశిక అభ్యర్థులను ప్రమోట్ చేయడం రాజకీయ పార్టీలకు చాలా తేలికవుతుందని అన్నారు. కాగా, సామన్య కార్యకర్తలకు ఎన్నికల్లో పోటీ చేయాలనే కోరిక దాదాపు కలగానే మిగిలిపోతుందని, ఎన్నికల్లో గ్లామర్ అనేది కీలకం కావడంతో సామన్య కార్యకర్తలను పక్కనపెట్టేస్తుంటారని ఆర్జేడీ ప్రతినిధి మృత్యుంజయ్ తివారీ అంగీకరించారు. బీజేపీ ప్రతినిధి నీరజ్ కుమార్ ఇందుకు ఒకింత భిన్నంగా స్పందించారు. తమ పార్టీ మాత్రం సంస్థల్లో కష్టపడి పనిచేసిన వారికి మాత్రమే ప్రాధాన్యతనిచ్చినట్టు చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీనే ఇందుకు ఒక ఉదాహరణ అని, ఆయనకు పార్టీలోని అన్ని స్థాయిల్లోనూ పనిచేసిన నేపథ్యం ఉందని చెప్పారు.
ఎన్నికల తేదీలు
బిహార్‌లోని 243 అసెంబ్లీ స్థానాలకు రెండు విడతలుగా నవంబర్ 6,11 తేదీల్లో పోలింగ్ జరుగనుంది. నవంబర్ 14న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.
ఇవి కూడా చదవండి..
దీపాలు, కొవ్వొత్తులకు ఖర్చు దండుగ.. అఖిలేష్ వివాదాస్పద వ్యాఖ్యలు
దీపావళి వేళ.. ఢిల్లీలో ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Oct 19 , 2025 | 05:47 PM