Share News

Akhilesh On Deepotsav: దీపాలు, కొవ్వొత్తులకు ఖర్చు దండుగ.. అఖిలేష్ వివాదాస్పద వ్యాఖ్యలు

ABN , Publish Date - Oct 19 , 2025 | 03:06 PM

దీపోత్సవ్ సెలబ్రేషన్స్‌ కోసం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం చేస్తున్న ఖర్చును అఖిలేష్ యాదవ్ నిలదీశారు. దీపావళి పండుగను క్రిస్మస్‌ పండుగతో పోల్చి వాళ్ల నుంచి నేర్చుకోవాలని సలహా కూడా ఇచ్చారు.

Akhilesh On Deepotsav: దీపాలు, కొవ్వొత్తులకు ఖర్చు దండుగ.. అఖిలేష్ వివాదాస్పద వ్యాఖ్యలు
Akhilesh Yadav

లక్నో: యావద్దేశం దీపావళి పండుగను సంబరంగా జరుపుకొనేందుకు సిద్ధమవుతున్న వేళ సమాజ్‌వాదీ పార్టీ నేత, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీపోత్సవ్ సెలబ్రేషన్స్‌ కోసం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం చేస్తున్న ఖర్చును నిలదీశారు. దీపావళి పండుగను క్రిస్మస్‌ పండుగతో పోల్చి వాళ్ల నుంచి నేర్చుకోవాలని సలహా కూడా ఇచ్చారు.


లక్నోలో జరిగిన మీడియా సమావేశంలో అఖిలేష్ మాట్లాడుతూ, క్రిస్మమ్ పండుగను ప్రపంచవ్యాప్తంగా నగరాల్లో ఎలా జరుపుకుంటారో చూసి ఇండియా నేర్చుకోవాలన్నారు. 'రాముడి పేరు మీద మీకు ఒక సలహా ఇవ్వాలనుకుంటున్నాను. క్రిస్మస్ పండుగకు ప్రపంచంలోని నగరాలన్నీ ప్రకాశవంతంగా ఉంటాయి. ఆ లైట్లు నెలల తరబడి ఉంటాయి. మనం కొవ్వొత్తులు, దీపాలపై వృథా ఖర్చు చేయడం ఎందుకు? ఈ ప్రభుత్వం నుంచి మనం ఏమి ఆశించగలం? ఈ ప్రభుత్వాన్ని తొలగించాలి. మరిన్ని అందమైన లైట్లు ఉండేలా చూసుకుంటాం' అని అన్నారు.


అయోధ్య వెలిగిపోతుండటం చూడలేకే..

దీపాలకు పెట్టే ఖర్చు వృథా అని, క్రిస్మస్‌ను చూసి నేర్చుకోవాలని అఖిలేష్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ విరుచుకుపడింది. సమాజ్‌వాదీ పార్టీ పాలనలో అయోధ్య చీకట్లలో మగ్గేదని, అయోధ్యలో రామభక్తులపై ఎస్‌పీ ప్రభుత్వం కాల్పులు కూడా జరిపిందని ఆ పార్టీ ప్రతినిధి షెహబాజ్ పూనావాలా ఎద్దేవా చేశారు. అయోధ్య వెలిగిపోతుంటే అఖిలేష్ యాదవ్‌కు కడుపు మండిపోతుంటుందని, ఇదే వ్యక్తులు సైఫైలో గానాబజానాలు నిర్వహిస్తుంటారని, అదే అయోధ్యలో దీపావళి జరుపుకుంటే ఆయనకు సమస్య వచ్చిపడుతుందని అన్నారు. అయోధ్యకు రాముడు తిరిగి వచ్చినప్పుడు విజయానికి చిహ్నంగా దీపాలు వెలిగిస్తుంటారని, చీకటిని పారద్రోలే రోజుగా లక్షలాది మంది రామభక్తుల విశ్వాసానికి దీపావళి ప్రతీకని బీజేపీ నేత గౌరవ్ భాటియా అన్నారు.


మండిపడిన వీహెచ్‌పీ

విదేశీ సంస్కృతిని అఖిలేష్ ప్రోత్సహిస్తున్నారంటూ విశ్వహిందూ పరిషత్ మండిపడింది. హిందువుల కంటే క్రైస్తవులనే ఆయన ఎక్కువగా ఇష్టపడుతున్నారని, జీహాదీలు, మతమార్పిడి ముఠాలకు ఆయన దూత అని వీహెచ్‌పీ ప్రతినిధి వినోద్ బన్సాల్ ఆక్షేపించారు. దీపావళి రోజున క్రిస్మస్ లెక్చర్లు ఇవ్వడం ఏమిటి? క్రిస్మస్ మరో రెండు నెలల్లో వస్తుంది. అసలు ఇప్పుడు ఏ పండుగ జరుగుతోందో కూడా ఆయనకు తెలిసినట్టు లేదు. సనాతన వ్యతిరేక భావజాలాన్ని ఆయన ఎప్పుడు వదిలించుకుంటారు? అని ప్రశ్నించారు.


ఇవి కూడా చదవండి..

దీపావళి వేళ.. ఢిల్లీలో ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం

భూభారహరణం.. నరకాసురుడి మరణం

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 19 , 2025 | 09:57 PM