Lunar Eclipse 2025: 'బ్లడ్ మూన్' గురించి ప్రతి విద్యార్థి తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే!
ABN, Publish Date - Sep 07 , 2025 | 08:02 PM
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు అరుదైన సంపూర్ణ చంద్రగ్రహణ అద్భుతాన్ని వీక్షించే క్షణం ఆసన్నమైంది. ఏకంగా 82 నిమిషాల పాటు ఆకాశంలో రక్తవర్ణంలో మెరిసిపోయే చంద్రుడి సోయగాలు కనువిందు చేయనున్నాయి. ఈ సందర్భంగా విద్యార్థులు తప్పక పరిశీలించాల్సిన విషయాలు ఇవే అంటున్నారు ఖగోళ శాస్త్రజ్ఞులు..
ఈ రాత్రి ఆకాశంలో అద్భుతం జరగబోతోంది. తెల్లగా మెరిసిపోతూ చల్లని వెన్నెల కాంతులు పంచే చందమామ అరుణ వర్ణంలో గంటకు పైగా దర్శనమివ్వనున్నాడు. ఈ అరుదైన ఖగోళ ఘటననే 'బ్లడ్ మూన్' అని పిలుస్తారు సైంటిస్టులు. చంద్రుడు, సూర్యుడి మధ్యకు భూమి వచ్చినప్పుడు భూమి నీడ చంద్రునిపై పడి చంద్రగ్రహణం సంభవిస్తుంది. ఈ సమయంలో భూమి నీడ చంద్రుడిపై పడి ఎరుపు రంగులో కనిపిస్తుంది. ఇవాళ రానున్న చంద్రగ్రహణం అత్యంత అరుదైనది. ఈ చంద్రగ్రహణం ఇవాళ రాత్రి 8:58 గంటలకు ప్రారంభమై.. సెప్టెంబర్ 8న తెల్లవారుజామున 2:25 గంటల వరకు కొనసాగుతుంది. సుదీర్ఘంగా 82 నిమిషాల పాటు చంద్రగ్రహణం ఉండబోతోంది. రాత్రి 11:01 నుండి 12:23 గంటల మధ్య చంద్రుడు పూర్తిగా ఎర్రగా కనిపిస్తాడు. 2018 తర్వాత దేశంలోని అన్ని ప్రాంతాలలో కనిపించనున్న మొదటి 'బ్లడ్ మూన్' ఇదే కానుంది.
చంద్రగ్రహణం సమయంలో చంద్రుడు ఎర్రగా ఎందుకు మారతాడు?
భూమి సూర్యుడు, చంద్రుల మధ్యకు వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అప్పుడు భూమి నీడ నేరుగా చంద్రునిపై పడి దానిని కప్పేస్తుంది. ఇక భూమి నీడ అంబ్రా, పెనుంబ్రా అనే రెండు భాగాలను కలిగి ఉంటుంది. అంబ్రా ప్రత్యక్ష సూర్యకాంతి పడని చీకటి, మధ్య భాగం. పెనుంబ్రా సూర్యరశ్మి పాక్షికంగా మాత్రమే నిరోధించబడిన తేలికైన, బాహ్య ప్రాంతం. సంపూర్ణ చంద్రగ్రహణం సమయంలో, చంద్రుడు పూర్తిగా ప్రత్యక్ష సూర్యకాంతి పడని చీకటి భాగం (అంబ్రా)లోకి ప్రవేశిస్తాడు. ఆ సమయంలో చందమామ నల్లగా అదృశ్యమయ్యే బదులు రాగి లేదా ఎరుపు రంగులో ప్రకాశిస్తుంది. దీనినే 'బ్లడ్ మూన్' అంటారు. ఈ ఎరుపు రంగుకు ప్రధాన కారణం 'రేలీ స్కాటరింగ్'. సూర్యాస్తమయాలు, సూర్యోదయాలు ఎరుపు రంగులో కనిపించేది ఇందువల్లే.
ఉదాహరణకు సూర్యకాంతి భూమి దట్టమైన వాతావరణం గుండా వెళ్లినప్పుడు నీలం, ఆకుపచ్చ వంటి తక్కువ తరంగదైర్ఘ్యాలు(Wave Lengths) చెల్లాచెదురుగా అయిపోతాయి. అందుకే ఆకాశం నీలం రంగులో కనిపిస్తుంది. కానీ, ఎక్కువ తరంగదైర్ఘ్యం (Wave Length) కలిగిన కాంతి (ఎరుపు లేదా నారింజ రంగు) వాతావరణంలోకి చెల్లాచెదురుగా వెళ్ళడానికి బదులుగా భూమి చుట్టూ వంగి చంద్రుడిని చేరుకుంటుంది. ఇది ఎరుపు లేదా రాగి రంగులో కనిపించేలా చేస్తుంది. ఇందువల్లే చంద్రుడు ఎరుపు రంగులో కనిపిస్తాడు.
ఎవరు స్పష్టంగా చూడగలరు?
ఈ రోజు వచ్చే చంద్రగ్రహణాన్ని భూమి జనాభాలో దాదాపు 87% మంది కొంత భాగాన్ని అయినా చూడగలుగుతారు. ఆసియా (భారతదేశం, చైనా, జపాన్, ఆగ్నేయాసియాతో సహా), ఆఫ్రికా, ఆస్ట్రేలియా, యూరప్‌లలోని ప్రజలు స్పష్టంగా వీక్షించగలుగుతారు. తూర్పు యూరప్, న్యూజిలాండ్, పశ్చిమ కెనడా, అలాస్కాలలో పాక్షికంగా కనిపిస్తుంది. కానీ, ఉత్తర అమెరికా, తూర్పు దక్షిణ అమెరికాల్లో వాళ్లు చూసేందుకు అవకాశం లేదు.
భారతీయ శాస్త్రం ఏం చెప్పింది?
భారతీయ గణిత శాస్త్రజ్ఞుడు, ఖగోళ శాస్త్రవేత్త ఆర్యభట్ట (476-550 CE) చంద్రగ్రహణాన్ని నక్షత్రాలు, గ్రహాలు, చంద్రులు, గ్రహశకలాలు, తోకచుక్కలు, గెలాక్సీలు వంటి ఖగోళ వస్తువుల పరస్పర చర్య ద్వారా ఏర్పడిన సహజ ప్రక్రియగా అభివర్ణించాడు. ఈ విశ్వ సంఘటనలను అర్థం చేసుకోవడంలో సైన్స్ పాత్రను చూపిస్తూ చంద్రగ్రహణ సమయాలను ఖచ్చితంగా అంచనా వేశాడు. చంద్రగ్రహణం అనేది అరుదైన ఖగోళ సంఘటన (ప్రతి ఒకటి నుండి మూడు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది) మాత్రమే కాదు. విశ్వం రహస్యాలు, అందాలను గుర్తుచేస్తుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రజెంట్ సార్.. జేఎన్‌టీయూ కాలేజీలో కిటకిటలాడుతున్న తరగతి గదులు
గేట్ 2026 రిజిస్ట్రేషన్ స్టార్ట్.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే..
Read Latest Telangana News and National News
Updated Date - Sep 07 , 2025 | 08:22 PM