Tirumala: తిరుమల వెంకన్న.. ది రిచ్ గాడ్
ABN, Publish Date - Sep 21 , 2025 | 09:55 AM
ప్రపంచ సంపన్నుల జాబితాను ఏటా లెక్కలు కట్టి వెల్లడించే ‘ఫోర్బ్స్’ సంస్థ గనుక దేవుళ్లలోకెల్లా ధనవంతులెవరు? అని ఆరా తీసి అంచనా వేస్తే... నెంబర్ వన్ స్థానం బహుశా మన తిరుమల వెంకన్నకే దక్కుతుంది. వేంకటేశుని ధర్మకర్తల మండలి టీటీడీ వార్షిక బడ్జెట్టే రూ.5వేల కోట్లకు పైనే.
ప్రపంచ సంపన్నుల జాబితాను ఏటా లెక్కలు కట్టి వెల్లడించే ‘ఫోర్బ్స్’ సంస్థ గనుక దేవుళ్లలోకెల్లా ధనవంతులెవరు? అని ఆరా తీసి అంచనా వేస్తే... నెంబర్ వన్ స్థానం బహుశా మన తిరుమల వెంకన్న(Tirumala Venkanna)కే దక్కుతుంది. వేంకటేశుని ధర్మకర్తల మండలి టీటీడీ వార్షిక బడ్జెట్టే రూ.5వేల కోట్లకు పైనే. బ్యాంకుల్లోని బంగారు నిల్వల విలువే లక్షన్నర కోట్లు. 20 వేల కోట్ల నగదు డిపాజిట్లు, 10 వేల కోట్ల విలువైన ఆభరణాలున్న వెంకన్న స్వామికి దేశవ్యాప్తంగా ఉన్న భూములు, భవనాల ఆస్తుల విలువెంతో తెలుసా? 2 లక్షల కోట్లు. చిన్నా చితకా కలిపి లెక్క కడితే గోవిందుడి సంపద నాలుగు నుంచి 5 లక్షల కోట్లు దాటుతుందని అంచనా.
వందల ఏళ్లుగా రాజులు, నవాబులు మొదలు సామాన్య భక్తుల దాకా స్వామికి భక్తితో సమర్పిస్తున్నది. ప్రజల్లో భక్తి పెరుగుతున్నట్టే గోవిందుడి సంపద కూడా పెరుగుతూనే ఉంది.
కలియుగ ప్రత్యక్షదైవంగా పేరుపొందిన తిరుమల శ్రీవేంకటేశ్వరుడికి అలంకరించే ఆభరణాలలోని బంగారం బరువెంతో తెలుసా? 650 కిలోలకు పైనే. దీని విలువ రూ.6 వేల కోట్లు. ఈ ఆభరణాలలో పొదిగిన వజ్రాలు, రత్నాలు, కెంపులు వంటి వాటి విలువ కూడా కలిపితే 10 వేల కోట్లు అని అంచనా.
మూలవర్లకు ఏడు కిరీటాలు
తిరుమల గర్భాలయంలోని మూలవర్లకు ప్రతి శుక్రవారం అభిషేకం తర్వాత కొత్త ఆభరణాలను అలంకరిస్తారు. 121 రకాల బంగారు, వజ్రవైఢూర్య, మరకత మాణిక్యాదులతో కూడిన అభరణాలు వీటిలో ఉంటాయి. ఆకాశరాజు సమర్పించిన స్వర్ణకిరీటంతో పాటూ ఆరు వజ్రకిరీటాలు స్వామికి మార్చి మార్చి అలంకరిస్తారు. సహస్రనామ మాల, లక్ష్మీహారం, పచ్చ పొదిగిన కంఠాభరణం, వక్షస్థల లక్ష్మీ, లక్ష్మీ హారాలు, సాలగ్రామ హారం శ్రీవారి మూల విగ్రహంపై దగద్ధగాయమానంగా మెరిసిపోతూ ఉంటాయి. ఇవిగాక స్వామికి అలంకరించే నిత్యాభరణాలు మూడేసి జతలు ఉంటాయి.
అవి... వజ్రాల శంఖుచక్రాలు, రత్నాల శంఖుచక్రాలు, రత్నల కర్ణపత్రాలు, రత్నాల మకరకంఠి, రత్నాల కఠిహస్తం, రత్నాల వైకుంఠ హస్తం, స్వర్ణ పద్మపీఠం, స్వర్ణ పాదాలు, అష్టోత్తర శతనామ హారం, సమస్రనామం, సూర్య కఠారి, కడియాలు, కర భూషణాలు, భుజదండ భూషణాలు, నాగాభరణాలు, భుజకీర్తులు, సాలిగ్రామహారం, తిరుక్కాళం, వజ్ర అశ్వత్థపత్ర హారం, ముఖపట్టీ, ఐదు పేటల కంఠి, చంద్రవంక కంఠి, పాగడాలు, కాంచీగునం, అంకెలు, వడ్డాణాలు, గోపు హారం, స్వర్ణ యజ్ఞోపవీతం, తులసీ పత్రహారం, పులిగోరు హారం వంటివి వెంకన్న అలంకార ఆభరణాలు. ఇంకా రెండు వజ్రాల ముఖపట్టీలు, రత్నాలు పొదిగిన ఆభరణాల్లో వైకుంఠ హస్తాలు రెండు, కఠిహస్తం, శంఖాలు, చక్రాలున్నాయి.
నిత్యాలంకారంలో ఉండేవి.. ఆకాశరాజు సమర్పించిన బంగారు కిరీటం, బంగారు ముఖపట్టి, రెండు బంగారు కర్ణపత్రాలు, మరో రెండు బంగారు బావళీలు, బంగారు చక్రం, బంగారు శంఖం, రెండు బంగారు భుజకీర్తులు, రెండు నాగాభరణాలు, కుడి, ఎడమ చేతి బంగారు నాగాభరణలు, మోచేయి ఆభరణం.
ఉత్సవర్లకు 26 కిరీటాలు
తిరుమల మాడవీధుల్లో విహరించే ఉత్సవ మూర్తులను దాదాపు 400 రకాల ఆభరణాలతో అలంకరిస్తారు.
18 బంగారు కవచాలు, పద్మపీఠం, బంగారు తోరణం, పద్మాలు, లక్ష్మీ డాలర్ల హారం, చేతి గంట, కెంపులు పొదిగిన హస్త నాగాభరణం, కఠిహస్తం, వజ్రాల కిరీటం, బందె గోముఖ పళ్లెం, బంగారు ధనుస్సు, తట్ట, నడుము వజ్ర కవచం, సీమ కమలాలు పొదిగిన హారం వంటివి విశేష పర్వదినాలు, ఉత్సవాల సమయాల్లో అలంకరిస్తారు. వివిధ రకాల కిరీటాలే 26 ఉన్నాయి. స్వామికి ఉన్న ఆభరణాల్లో ప్రత్యేకంగా చెప్పుకునేవాటిలో ముఖ్యమైనది 500 గ్రాముల గరుడమేరు పచ్చ. ఉత్సవాల సమయాల్లోనే దీనిని అలంకరిస్తారు.
బంగారు కానుకల వెల్లువ
శ్రీనివాసుడికి తొలుత ఆకాశరాజు బంగారు కిరీటం చేయించాడని చెబుతారు. అయితే 12వ శతాబ్దం వరకు అందిన స్వర్ణాభరణాలు, వస్తువుల వివరాలు ఎక్కడా నమోదు కాలేదు. 12వ శతాబ్దం తర్వాత స్వామికి సమర్పించిన ఆభరణాల వివరాలు కొన్ని శాసనాలలో నమోదయ్యాయి. విజయనగరరాజుల కాలంలో శ్రీవారికి ఆభరణాల వెల్లువ మొదలైంది. వాటిలో కొన్ని...
- బిట్రిష్ పాలనలో చిత్తూరు కలెక్టరుగా పనిచేసిన థామస్ మన్రో పెద్ద గంగాళాన్ని కానుకగా ఇచ్చారు.
- మొగలు చక్రవర్తులైన అక్బర్, జహంగీర్ ముద్రలతో 500 నాణేలతో ఉన్న దండతో పాటు కింగ్ జార్జ్, విక్టోరియా రాణి చిత్రం ఉన్న 492 నాణేలతో ఉన్న హారాలు స్వామికి కానుకగా అందాయి.
- శ్రీవేంకటేశ్వర హేచరీస్ 13 కేజీల కిరీటం, గోయెంకా 10 కేజీల కిరీటాలను అందజేశారు.
- రత్నాల కంఠి, వరద హస్తాలు, 7 కిలోల రత్నాల మకరకంఠి, బంగారు వస్ర్తాలు వంటి ఆభరణాలు కానుకగానే స్వామికి అందాయి.
- 2009లో గాలి జనార్దన్‌రెడ్డి రూ.42 కోట్ల విలువ చేసే వజ్రాల కిరీటాన్ని స్వామికి సమర్పించాడు.
- తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం తరుపున రూ.5.2 కోట్ల విలువైన 19.072 కిలోల బరువున్న రెండు స్వర్ణాభరణాలు అందజేశారు.
- లలిత్ బాసిన్ బంగారు గంగాళం, పాత్రలు అందజేశారు.
- 2021లో ఎం అండ్ సీ ప్రాపర్టీస్ సంస్థ 3.604 కేజీల బంగారు బిస్కెట్లు విరాళంగా ఇచ్చింది. అదే ఏడాది అజ్ఞాత భక్తులు 5.3 కిలోల బరువు కలిగిన బంగారు కఠి, వరద హస్తాలను అందజేశారు.
- ఈ ఏడాది మే నెలలో సంజీవ్ గోయెంకా బంగారు కఠి, వరద హస్తాలను కానుకగా ఇచ్చారు.
శ్రీకృష్ణదేవరాయలు సమర్పించిన ఆభరణాలు
శ్రీకృష్ణదేవరాయలు పాలించిన 21 ఏళ్లు తిరుమలకు స్వర్ణయుగమేనని చెబుతుంటారు. తిరుమల క్షేత్రాన్ని ఏడుసార్లు సందర్శించిన శ్రీకృష్ణదేవరాయలు విశేష కానుకలతో స్వామివారి భాండాగారాన్ని స్వర్ణమయం చేశారు.
- 1513 ఫిబ్రవరి 10న మొదటిసారి దేవరాయులు శ్రీవారిని దర్శించుకుని నవరత్న ఖచిత కిరీటాన్ని సమర్పించారు.
- అదే ఏడాది మే 2న మళ్లీ స్వామి దర్శనానికి వచ్చిన ఆయన శ్రీవారికి పాలు నైవేద్యంగా సమర్పించటానికి 374 తులాల బంగారు గిన్నె, ఉత్సవమూర్తులకు మూడు కిరీటాలు ఇచ్చారు.
- జూన్ 13వ తేదీన స్వామిని దర్శించుకుని, శ్రీవారి నిత్యసేవల కోసం మాన్యాలు రాసివ్వటంతో పాటు నవరత్నఖచిత ఆభరణాలు సమర్పించారు.
- జూలై 6న దర్శనానికి వచ్చినపుడు 30 వేల బంగారు నాణేలతో అభిషేకం చేశారు. పలు బంగారు ఆభరణాలను కానుకలుగా ఇచ్చారు.
- 1515 అక్టోబర్ 25న వచ్చినపుడు మకరతోరణం సమర్పించారు.
- 1517 జనవరి 2న ఆనంద నిలయానికి బంగారుపూత పూర్తి అయిన సందర్భంగా రాయులవారు మరోసారి తిరుమలకు వచ్చారు.
- 1521 ఫిబ్రవరి 17న చివరిగా తిరుమలకు వచ్చినపుడు, పీతాంబరంతో పాటు అత్యంత విలువైన వజ్రాలు, ఇతర బంగారు ఆభరణాలు సమర్పించారు.
శ్రీకృష్ణదేవరాయులు సమర్పించిన ఈ విలువైన ఆభరాణాలేవి ప్రస్తుతం లేవు. మిరాశీ వ్యవస్థ రద్దు కాకముందే వీటిని కరిగించినట్టు 20 ఏళ్ల క్రితమే టీటీడీ ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. 1952లో టీటీడీ ఆధ్వర్యంలోకి వచ్చిన ఆభరాణలలో ఇవేవీ లేవు.
ఆభరణాల పర్యవేక్షణ
1933లో టీటీడీ ఏర్పాటైంది. తిరుమల ఆలయంలో ఉన్న ఆభరణాలన్నింటినీ 1952లో టీటీడీ స్వాధీనం చేసుకుంది. అయినప్పటికీ ఆభరణాలన్నీ వంతులో ఉండే ప్రధాన అర్చకుల అధీనంలోనే ఉండేవి. నాలుగు మిరాశీ అర్చక కుటుంబాల నుంచి ఏడాదికి ఓ అర్చకుడికి కైంకర్యాలు చేసే వంతు వచ్చేది. అలా వంతు వచ్చిన అర్చకుడే స్వామికి చెందిన అభరణాలని తన ఆధీనంలో ఉంచుకుని అలంకరణకు వినియోగించేవారు. తన వంతు పూర్తికాగానే తర్వాతి వంతు అర్చకుడికి అప్పగించేవారు. 1987లో మిరాశీ వ్యవస్థను రద్దు చేశారు. ప్రస్తుతం అలంకరణలకు వినియోగించే ఆభరణాలు పారుపత్తేదారు పర్యవేక్షణలో ఉంటాయి.
బ్యాంకుల్లో 13 టన్నుల బంగారం
తిరుమల శ్రీనివాసుడికి భక్తులు సమర్పించే బంగారు ఆభరణాలు, వస్తువులు పెరిగిపోతూనే ఉన్నాయి. దీంతో అలంకరణకు వినియోగించేవి మినహా మిగిలినవాటిని మింట్ ద్వారా కరిగించి, శ్రీవారి డాలర్లుగా మార్చేవారు. వీటిని భక్తులకు విక్రయించేవారు. 2008 వరకు ఈ విధానం కొనసాగింది. దీనిపై విమర్శలు రావడంతో బంగారమంతా బ్యాంకుల్లో డిపాజిట్ చేయటం మొదలుపెట్టారు. మొదటిసారి 2010 మే 23వ తేదీన 1,075 కిలోల బంగారాన్ని డిపాజిట్ చేశారు. 2019 నాటికి బంగారు నిల్వలు 7 టన్నులకు చేరుకున్నాయి. ఇక, 2022 సెప్టెంబర్ 30 నాటికి 10,258 కేజీలు ఉన్నట్టు అప్పటి అధికారులు శ్వేతపత్రం ద్వారా స్పష్టం చేశారు. 2025 ఆగస్టు నాటికి ఈ నిల్వలు దాదాపు 13 వేల కిలోలకు చేరాయి. బంగారంపై బ్యాంకులు వడ్డీగా బంగారాన్నే టీటీడీకి ఇస్తాయి. ఇలా ఏడాదికి దాదాపు రూ.200 కేజీలు వడ్డీ రూపంలో జతవుతోంది. బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన బంగారం విలువ లక్షన్నర కోట్ల పైనే అని అంచనా. డిపాజిట్ చేస్తున్న బంగారు ఆభరణాల్లో వజ్రాలు, రత్నాలు, వైఢూర్యాలు వంటివి కూడా ఉన్నందున వీటి విలువ ఇంకా ఎక్కువ ఉండొచ్చు.
హుండీ ద్వారా ఏటా టన్ను బంగారం
శ్రీవేంకటేశ్వరునికి భక్తులు సమర్పించే ఆభరణాల సంఖ్య పెరిగిపోవడంతో వాటిని అలంకరించే అవకాశమే రావడంలేదు. దీంతో ముందుగా టీటీడీ అనుమతి తీసుకునే ఆభరణాలు చేయించి సమర్పించాలని నిబంధన పెట్టింది. దీంతో భక్తులు హుండీ ద్వారా బంగారు ఆభరణాలు సమర్పిస్తున్నారు. ఇలా రోజుకు 2 కేజీల బంగారం హుండీ ద్వారానే శ్రీవారికి లభిస్తోంది. నెలకు 60 నుంచి 70 కేజీలు చొప్పునా ఏటా హుండీ ద్వారానే సుమారు టన్ను బంగారం లభిస్తున్నట్టు అంచనా.
రూ.20 వేల కోట్ల డిపాజిట్లు
హుండీలో భక్తులు సమర్పించే కానుకలను కార్పస్‌ఫండ్‌గా పరిగణించి, వీటిలో 60 శాతం డిపాజిట్ల రూపంలో బ్యాంకుల్లో జమ చేస్తున్నారు. ఇలా ఇప్పటికి రూ.20 వేల కోట్లు వివిధ బ్యాంకుల్లో టీటీడీకి నిల్వలున్నాయి. 2011లో రూ.5,410 కోట్లు బ్యాంకుల్లో ఉండేది. 2022 సెప్టెంబర్ 30వ తేదీ నాటి లెక్కల ప్రకారం శ్రీవారి డిపాజిట్లు రూ.15,938 కోట్లకు చేరుకున్నాయి. ప్రస్తుతం టీటీడీకి రూ.20 వేల కోట్లు వివిధ బ్యాంకుల్లో డిపాజిట్లుగా ఉన్నాయి. వీటి ద్వారా వడ్డీ రూపంలో ఏటా రూ.1,600 కోట్లు వస్తుండటం విశేషం.
రూ.2 లక్షల కోట్ల ఆస్తులు
ఏడు కొండల్లో కొలువైన వెంకన్నకు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు అనేక ప్రదేశాల్లో భవనాలు, భూముల రూపంలో ఆస్తులు ఉన్నాయి. ఇవన్నీ భక్తులు సమర్పించినవే. 1974 నుంచి 2014 వరకు వరకు ఉన్న ఆస్తుల్లో దాదాపు 113 ఆస్తులను అప్పటి టీటీడీ పాలకులు విక్రయించేశారు. 2009 నాటి లెక్కల ప్రకారం 4,143.67 ఎకరాల భూములు, భవనాలను వెంకన్న పేరిట ఉండేవి. వాటి విలువను రూ.33,447 కోట్లుగా నిర్ధారించారు. నిజానికి అప్పటి మార్కెట్ ధర ప్రకారం వాటి విలువ దాదాపు రూ.లక్ష కోట్లు. ఆతర్వాత 2022 సెప్టెంబర్‌లో లెక్కలు తీశారు. దేశవ్యాప్తంగా 960 ప్రాంతాల్లో 7,123 ఎకరాల్లో భూమి (భవనాలతో కలిపి) ఉంది.
వాటి విలువ ప్రభుత్వ ధర ప్రకారం రూ.85 వేల కోట్లుగా టీటీడీ ప్రకటించింది. కానీ ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం వాటి విలువ దాదాపు రూ.1.5 లక్షల కోట్లు ఉండవచ్చని అంచనా. 2025 ఆగస్టు నాటికి స్వామి ఆస్తులు మరికొంత మేర పెరిగాయి. 1,003 ప్రాంతాల్లో 7,400 ఎకరాలకు స్వామి ఆస్తులు చేరాయి. ఇందులో 170 ప్రాంతాల్లో 1,400 ఎకరాలు వ్యవసాయ భూమి ఉంది. 830 ప్రాంతాల్లో 6 వేల ఎకరాల్లో వ్యవసాయేతర భూములు గోవిందుని పేరుపై ఉన్నాయి. వీటి విలువల ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం అంచనా కడితే రూ.2 లక్షలు కోట్లు ఉండచ్చు.
మళ్లీ భక్తులకే!
భక్తులిచ్చిన సొమ్మును వెంకన్నస్వామి ఏదో రూపంలో తిరిగి భక్తుల కోసమే వెచ్చిస్తుంటాడు. హిందూ ధర్మపరిరక్షణ, వ్యాప్తికే కాక సామాజిక సేవలకూ వేల కోట్లు టీటీడీ వినియోగిస్తోంది. అనేక విద్యాసంస్థలు, ఆస్పత్రులు, వేదపాఠశాలలు నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా ఆలయాల నిర్మాణాలకు స్వామి సొమ్ముని వినియోగిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సరికొత్త స్థాయికి బంగారం, వెండి ధరలు..
Read Latest Telangana News and National News
Updated Date - Sep 21 , 2025 | 09:59 AM