Share News

Welfare or Crisis The Unsustainable: సంక్షేమమా సంక్షోభమా

ABN , Publish Date - Sep 21 , 2025 | 12:45 AM

‘మింగ మెతుకు లేదు– మీసాలకు సంపెంగ నూనె’ అన్నది ఒక సామెత! ప్రస్తుతం ఉభయ తెలుగు రాష్ర్టాల పరిస్థితికి ఈ సామెత అచ్చుగుద్దినట్టు సరిపోతుంది. అప్పు చేయనిదే పూట గడవని పరిస్థితి ఉన్నప్పటికీ రెండు రాష్ట్రాల ప్రభుత్వాల మాటలు మాత్రం కోటలు....

Welfare or Crisis The Unsustainable: సంక్షేమమా సంక్షోభమా

‘మింగ మెతుకు లేదు– మీసాలకు సంపెంగ నూనె’ అన్నది ఒక సామెత! ప్రస్తుతం ఉభయ తెలుగు రాష్ర్టాల పరిస్థితికి ఈ సామెత అచ్చుగుద్దినట్టు సరిపోతుంది. అప్పు చేయనిదే పూట గడవని పరిస్థితి ఉన్నప్పటికీ రెండు రాష్ట్రాల ప్రభుత్వాల మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి. తెలుగు రాష్ర్టాలకు ఈ దుస్థితి ఎందుకు వచ్చింది? ఇందుకు ఎవరు కారణం? 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు తెలంగాణ ధనిక రాష్ట్రమని, రాష్ట్రం రెవెన్యూ మిగులులో ఉందని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. అదే సమయంలో విభజిత ఆంధ్రప్రదేశ్‌ రూ.20 వేల కోట్లకు పైగా రెవెన్యూ లోటుతో ఏర్పడింది. 11 ఏళ్లు గడిచేసరికి ధనిక రాష్ట్రమైన తెలంగాణ కూడా అప్పుల కుప్పగా మారింది. అప్పు కోసం వెళితే దొంగను చూసినట్టు చూస్తున్నారని ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అసలు వాస్తవాన్ని బయటపెట్టారు. అంతే, తెలంగాణ పరువు తీస్తావా? అని భారత రాష్ట్ర సమితి నాయకులు ఆయనపై విరుచుకుపడ్డారు. ఇక ఆంధ్రప్రదేశ్‌ విషయానికి వస్తే... ఆ రాష్ట్ర పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టుగా ఉంది. రాష్ట్రం అప్పులు పది లక్షల కోట్లు దాటాయి. అటు ధనిక రాష్ట్రం, ఇటు రెవెన్యూ లోటుతో ఏర్పడిన రాష్ట్రం కూడా కుదేలవడానికి కారణం ఏమిటి? రాజకీయ పార్టీలు బాధ్యతను విస్మరించి అధికారం కోసం పోటీపడుతూ... అపర దానకర్ణుల వలె ప్రజాధనాన్ని పప్పూ బెల్లాల్లా పంచిపెట్టడానికి పోటీపడటంతో రెండు రాష్ర్టాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి. సంక్షేమ పథకాలకు కూడా అప్పులు చేయవలసి వస్తోంది. ప్రభుత్వ ఆస్తులను కుదువ పెట్టడమే కాకుండా, భవిష్యత్‌ ఆదాయాలను కూడా తాకట్టు పెట్టి అప్పులు చేసి సంక్షేమ పథకాలు అమలు చేయడం వల్లనే తెలుగు నాట ప్రస్తుత దుస్థితి దాపురించింది. ఏదో ఒక రాజకీయ పార్టీ అధికారంలోకి రావడం కోసం లేదా ఎవరో ఒకరు ముఖ్యమంత్రి కావడం కోసం సంక్షేమం పేరిట అలవికాని పథకాలను ప్రకటిస్తూ తెలుగు రాష్ర్టాలను దివాలా తీయిస్తున్నారు. కొంతమేరకు భారతీయ జనతా పార్టీని మినహాయిస్తే, మిగతా ప్రధాన రాజకీయ పార్టీలన్నింటికీ ఈ పాపంలో భాగం ఉంది. వివిధ ప్రభుత్వ శాఖలలో చేపట్టిన పనులకు చెల్లించాల్సిన బకాయిలు ఒక్కో రాష్ట్రంలో లక్ష కోట్లు దాటాయి. చివరికి పరిస్థితి ఎంతవరకూ వెళ్లిందంటే, నిర్దిష్టంగా నిధుల లభ్యత ఉన్న పనులకు మినహా మిగతా పనులు చేపట్టడానికి ప్రభుత్వాలు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. దీంతో ప్రజలకు మౌలిక సదుపాయాలు కరువై అల్లాడుతున్నారు. ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని తెలిసి కూడా కొత్త పథకాల ప్రకటనలో రాజకీయ పార్టీలు తగ్గేదేలే అన్నట్టుగా పోటీ పడుతున్నాయి.


తెలంగాణ తీరు ఇలా...

11 ఏళ్ల క్రితం నిజంగానే రెవెన్యూ మిగులుతో ధనిక రాష్ట్రంగా ఉండిన తెలంగాణలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్‌ అనేక సరికొత్త సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి అమలు చేశారు. దీంతో అభివృద్ధి పనులకు అప్పులు చేయాల్సిన పరిస్థితిలోకి తెలంగాణ వెళ్లింది. ఎన్నికల్లో ప్రయోజనం పొందడమే పరమావధిగా సంక్షేమ పథకాలను జనంలోకి వదిలారు. హుజూరాబాద్‌కు జరిగిన ఉప ఎన్నికలో ఈటల రాజేందర్‌ను ఓడించేందుకు కేసీఆర్‌ ‘దళితబంధు’ పథకానికి రూపకల్పన చేశారు. ఈ పథకం కింద ఎంపిక చేసిన దళిత కుటుంబాలకు పది లక్షల రూపాయల వంతున పంచిపెట్టారు. అయినా ఆ ఉప ఎన్నికలో అధికార బీఆర్‌ఎస్‌ ఓడిపోయి ఈటల రాజేందర్‌ గెలిచారు. ఆ తర్వాత ‘దళిత బంధు’ పథకం కూడా అటకెక్కింది. దళితులకేనా ‘బంధు’... మాకివ్వరా? అని మిగతా వర్గాల ప్రజలు అలకబూనారు. దీంతో కేసీఆర్‌ పరిస్థితి ఉభయ భ్రష్టత్వం అయింది. అభివృద్ధి పనులకు అవసరమైన నిధుల కోసం హైదరాబాద్‌లోని ప్రభుత్వ భూములను కూడా ఎడా పెడా అమ్మేశారు. అయినా రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతూనే ఉంది. ఈ దశలో ఎన్నికలు రావడం, ఎలాగైనా అధికారంలోకి రావాలన్న పట్టుదలతో కాంగ్రెస్‌ పార్టీ కూడా గ్యారెంటీల పేరుతో సరికొత్త హామీలు ఇచ్చింది. కారణాలు ఏమైనా, 2023 ఎన్నికల్లో కేసీఆర్‌ పార్టీ ఓడిపోయి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నాక రేవంత్‌ రెడ్డికి తత్వం బోధపడటం మొదలైంది. రైతు రుణ మాఫీ కోసం దాదాపు పాతిక వేల కోట్ల రూపాయలు పంచిపెట్టిన కాంగ్రెస్‌ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనం పొందకపోగా... కేసీఆర్‌ ప్రారంభించిన పథకాలకు నిధులు సమకూర్చలేక గుడ్లు తేలేసింది. దీంతో ప్రభుత్వం అప్పుల వేటకు బయలుదేరింది.


ఏపీలో ఆపసోపాలు...

తోటి వాడు తొడ కోసుకుంటే తాను మెడ కోసుకున్నట్టుగా ఆంధ్రప్రదేశ్‌లో కూడా సంక్షేమ పథకాల జాతరకు తెర లేపారు. అప్పట్లో ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణలో ప్రారంభమైన అనేక పథకాలను ఆంధ్రప్రదేశ్‌లో కూడా అమలు చేసేందుకు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఆపసోపాలు పడ్డారు. మొత్తానికి ముక్కుతూ మూలుగుతూ ఐదేళ్ల కాలం పూర్తయింది. ఎన్నికలు వచ్చి పడటంతో వృద్ధాప్య పింఛన్లను చంద్రబాబు రెండు వేలకు పెంచారు. అంతటితో ఆగకుండా ‘పసుపూ కుంకుమ’ పేరిట డ్వాక్రా మహిళలకు పదివేల రూపాయల వంతున పంచిపెట్టారు. చంద్రబాబు అధికారం కోల్పోకుండా ఇలాంటి పథకాలు అడ్డుకోలేక పోయాయి. 2014లో తాము అధికారంలోకి వచ్చినట్టేనన్న అతి విశ్వాసంతో ఉండి బోర్లాపడిన జగన్మోహన్‌ రెడ్డి... 2019 ఎన్నికల్లో మాత్రం చాన్స్‌ మిస్‌ కాకూడదని భావించి ‘నవరత్నాలు’ పేరిట సరికొత్త పథకాలను ప్రకటించారు. అనూహ్యంగా 151 సీట్లతో అధికారంలోకి వచ్చారు. ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ఆయన ఎన్నో పిల్లిమొగ్గలు వేశారు. ఐదేళ్లలో సంక్షేమ పథకాల పేరిట దాదాపు రెండున్నర లక్షల కోట్లు పంచారు. ఈ డబ్బు సమకూర్చుకునేందుకు భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వ ఆదాయాన్ని తాకట్టు పెట్టారు. ప్రభుత్వ ఆస్తులను, కార్యాలయాలను కూడా కుదువ పెట్టి అప్పు చేశారు. తన చేతికి ఎముక లేదని, తాను పేదల పెన్నిధినని, అపర దానకర్ణుడినని చెప్పుకొచ్చారు. ఐదేళ్లు గడచిపోయాయి. అన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినా, బటన్లు నొక్కినా 2024 ఎన్నికల్లో జగన్‌రెడ్డికి 11 సీట్లు మాత్రమే వచ్చాయి. తెలంగాణలో కేసీఆర్‌ను గానీ, ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌రెడ్డిని గానీ సంక్షేమ పథకాలు కాపాడలేదు. ఈ వాస్తవాన్ని విస్మరించిన ఆంధ్రప్రదేశ్‌ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2024లో ‘సూపర్‌ సిక్స్‌’ పేరిట సరికొత్త హామీలు ఇచ్చారు. ‘అమ్మ ఒడి’ స్థానంలో తీసుకు వచ్చిన ‘తల్లికి వందనం’ పథకం కింద ఒక కుటుంబంలో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికీ సాలీనా 15 వేల రూపాయల వంతున పంచుతామని ప్రకటించారు. వృద్ధాప్య పెన్షన్ల మొత్తాన్ని ఏకంగా నాలుగు వేలకు పెంచారు. దేశంలో మరే రాష్ట్రంలో కూడా, ఆర్థికంగా అంతో ఇంతో పటిష్ఠంగా ఉన్న తమిళనాడులో కూడా పెన్షన్లు నాలుగు వేలు లేవు. ఇదే కాకుండా మహిళలకు ఏటా 15 వేల వంతున ఇస్తామన్నారు. ఇది ఇంకా అమలు కాలేదు. అమలు అవుతుందన్న గ్యారెంటీ కూడా లేదు. సూపర్‌ సిక్స్‌లో మిగతా వాటిని ముక్కీ మూలిగి అమలు చేస్తున్నారు. ఆటో డ్రైవర్లకు ఏటా 15 వేల వంతున పంచుతామంటున్నారు. జగన్‌రెడ్డి లిక్కర్‌ భవిష్యత్‌ ఆదాయాన్ని కుదువపెట్టగా, చంద్రబాబు అదే బాటలో గనుల ఆదాయాన్ని కుదువపెట్టారు. తమాషా ఏమిటంటే, కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ర్టాన్ని అప్పుల ఊబిలోకి నెడుతున్నారని కాంగ్రెస్‌ పార్టీ ఆరోపించగా, ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం రాష్ర్టాన్ని అప్పులపాలు చేస్తోందని బీఆర్‌ఎస్‌ విమర్శిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా నాడు జగన్మోహన్‌ రెడ్డి పది లక్షల కోట్లు అప్పులు చేశారని తెలుగుదేశం పార్టీ విమర్శించగా, ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్న అప్పులు చూసి జగన్‌ అండ్‌ కో గుండెలు బాదుకుంటున్నారు. ప్రభుత్వాలకు ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా పెరిగి నిధులు మూలుగుతుంటే ప్రజలకు పంచి పెట్టడంలో తప్పు లేదు. అభివృద్ధి చెందిన కొన్ని దేశాలలో పన్ను చెల్లింపుదారులు సీనియర్‌ సిటిజన్లయ్యాక వారు చెల్లించిన సొమ్ములో కొంత మొత్తాన్ని వృద్ధాప్యంలో పెన్షన్‌ రూపంలో తిరిగి చెల్లిస్తారు. మన దేశంలో ఈ వెసులుబాటు లేదు. ఏదైనా కంపెనీ లాభాలు గడిస్తే పన్నులు చెల్లిస్తూనే ఉండాలి. అదే కంపెనీ కర్మకాలి నష్టాల్లోకి వెళితే ప్రభుత్వాలుగానీ, ఆర్థిక సంస్థలు గానీ ముఖం కూడా చూడవు. వ్యక్తిగతంగా ఆదాయపు పన్ను చెల్లించిన వారిని కూడా వృద్ధాప్యంలో ప్రభుత్వాలు ఆదుకోవు. పన్ను చెల్లింపుదారుల జాబితాలో ఉన్నందువల్ల ప్రభుత్వాలు అమలు చేస్తున్న పెన్షన్‌ వంటి సంక్షేమ పథకాలు కూడా వారికి వర్తించవు.


రేషన్‌ బియ్యమే దిక్కా?

ఇప్పుడు మళ్లీ తెలుగు రాష్ర్టాల విషయానికి వద్దాం! ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిపథంలో దూసుకుపోతున్నాయని ఆయా ప్రభుత్వాలు ప్రకటిస్తున్నాయి. అలాంటప్పుడు పేదరికం తొలగిపోవాలి కదా? అయితే మన రాజకీయ పార్టీల స్వార్థం వల్ల పేదల సంఖ్య కూడా ఎప్పటికప్పుడు పెరుగుతోంది. ఎన్టీఆర్‌ వైద్యసేవ (ఆరోగ్యశ్రీ), ఫీజు చెల్లింపు వంటి పథకాలకు తెల్ల రేషన్‌ కార్డుతో ముడిపెట్టడం ప్రభుత్వాలు చేస్తున్న అతి పెద్ద తప్పిదం. ఈ కారణంగా ప్రభుత్వ ఉద్యోగులు మినహా మిగతా వారందరూ తెల్ల రేషన్‌ కార్డులు సొంతం చేసుకుంటున్నారు. ఆహార భద్రత కార్డులు పొందడానికి కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలను రెండు తెలుగు రాష్ర్టాలలో అమలు చేయడం లేదు. తెలంగాణ జనాభా మూడున్నర కోట్లు కాగా ఆహార భద్రతా కార్డులు, అంటే తెల్ల రేషన్‌ కార్డుల వల్ల లబ్ధి పొందుతున్న వారి సంఖ్య 3 కోట్ల 25 లక్షలు. ఇప్పుడు తెలంగాణలో 1,01,22,324 తెల్ల కార్డులు ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం మరో రెండున్నర లక్షల కార్డులు జారీ చేయబోతున్నది. దీంతో తెల్ల రేషన్‌ కార్డుల లబ్ధిదారుల సంఖ్య 3 కోట్ల 35 లక్షలకు పెరుగుతుంది. అంటే, రాష్ట్రంలో 15 లక్షల మంది మాత్రమే దారిద్య్ర రేఖకు ఎగువన ఉన్నట్టా? ప్రభుత్వ ఉద్యోగులే పది లక్షల మంది ఉన్నారు కదా? రాష్ట్రంలో కార్ల సంఖ్య 25 లక్షలకు పైగా ఉంది. కాంట్రాక్టర్లు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, ఆదాయపు పన్ను చెల్లిస్తున్న ప్రైవేటు ఉద్యోగులు, వివిధ వృత్తుల్లో స్థిరపడిన వారి మాటేమిటి? ఒక్క మాటలో చెప్పాలంటే 15 లక్షల మందిని తీసేస్తే మిగతా ప్రజలంతా దారిద్య్రంలో ఉన్నట్టే! ఇంతకంటే దారుణం ఉంటుందా? తెలంగాణలో తెల్ల రేషన్‌ కార్డుల లబ్ధిదారులకు కిలో రూపాయి వంతున పంపిణీ చేస్తున్న సన్నబియ్యం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై సాలీనా దాదాపు 15 వేల కోట్ల రూపాయల భారం పడుతోంది. 1983లో కిలో రెండు రూపాయలకు బియ్యం పథకాన్ని ఎన్టీఆర్‌ ప్రవేశపెట్టినప్పుడు సంక్షేమ రంగంలో అదొక విప్లవంగా చెప్పుకొన్నారు. నాలుగు దశాబ్దాల తర్వాత కిలో బియ్యం రూపాయికే ఇవ్వడం సంక్షేమం అవుతుందా? రాజకీయ పార్టీల బాధ్యతారాహిత్యం అవుతుందా? ఈ అరాచక ధోరణుల వల్లనే తెలుగు రాష్ర్టాలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడం నిజం కాదా? ఇక... ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 1 కోటి 70 లక్షల కుటుంబాలు ఉండగా, అందులో 1 కోటి 45 లక్షల కుటుంబాలకు తెల్ల రేషన్‌ కార్డులు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో కూడా బియ్యంపై ఏటా 15 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారు. తమాషా ఏమిటంటే, రాష్ట్రంలో మొబైల్‌ కనెక్షన్ల సంఖ్య 8 కోట్ల 20 లక్షలు. ద్విచక్ర వాహనాల సంఖ్య 1 కోటి 22 లక్షలకు పైగా ఉంది. రాష్ట్ర తలసరి ఆదాయం 2 లక్షల 66 వేలు అని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తోంది. ఆదాయపు పన్ను చెల్లిస్తున్న వారి సంఖ్య దాదాపు 40 లక్షల వరకు ఉంది. అన్ని రకాల సంక్షేమ పథకాలకు తెల్ల రేషన్‌ కార్డుతో ముడిపెట్టడం వల్లనే వాటికోసం జనం ఎగబడుతున్నారు. ఈ కార్డు కింద పంపిణీ చేస్తున్న బియ్యం రీ సైకిల్‌ అవుతున్న విషయం బహిరంగ రహస్యం. కుటుంబాల సంఖ్యను మించి తెల్ల రేషన్‌ కార్డులు ఉంటున్నాయని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ వంటి వారు పలు సందర్భాలలో చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఈ విషయం తెలుసు. అయితే, తెల్ల రేషన్‌ కార్డుల ఏరివేతకు పూనుకుంటే రాజకీయంగా మూల్యం చెల్లించవలసి వస్తుందని ఏ రాజకీయ పార్టీ కూడా అందుకు సాహసించడం లేదు. రాష్ర్టాల ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండివుంటే, పోతే పోనీలే ప్రజలే కదా లబ్ధి పొందుతున్నది అని సరిపెట్టుకోవచ్చు. కానీ... ఆ పరిస్థితి లేదు కదా!


విద్య, వైద్యం ముఖ్యం కాదా...

ప్రైవేటు విద్యా సంస్థలలో చదువుకుంటున్న విద్యార్థులకు ఫీజుల చెల్లింపు పథకం కింద ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు వేల కోట్లకు చేరుతున్నాయి. ఎన్టీఆర్‌ వైద్య సేవ (ఆరోగ్యశ్రీ) పథకం కింద ప్రైవేటు ఆస్పత్రులకు చెల్లించాల్సిన బకాయిలు వేల కోట్లలో పేరుకుపోతున్నాయి. దాదాపు రెండు దశాబ్దాలుగా అమలులో ఉన్న ఈ రెండు పథకాలకు అవసరమైన నిధులు సమకూర్చకుండా మరింత ఆర్థిక భారం పడే కొత్త పథకాల అమలుకు పూనుకొనే అధికారం రాజకీయ పార్టీలకు ఎవరిచ్చారు? విద్య, వైద్యం విషయంలో అనేక దేశాలలో ప్రభుత్వాలే ఖర్చు భరిస్తుంటాయి. అయితే, అందులో అనేక పరిమితులు ఉన్నాయి. మన దేశంలో, ముఖ్యంగా తెలుగు రాష్ర్టాలలో అర్హత లేకపోయినా అన్ని పథకాలనూ అందరికీ అందిస్తున్నారు. ఇంజనీరింగ్‌ విద్యనే తీసుకుందాం. ప్రభుత్వమే ఫీజు చెల్లిస్తోంది కదా అని తగిన అర్హతలు లేని వారు కూడా ఇంజనీరింగ్‌ కళాశాలల్లో చేరుతున్నారు. వీళ్లు రేపటి నిరుద్యోగులుగా మిగులుతున్నారు. మన దేశంలోనే కాదు, తెలుగునాట కూడా ఒకప్పుడు సిద్ధాంత ప్రాతిపదికన ఎన్నికలు జరిగేవి. ఆ తర్వాత తాము అధికారంలోకి వస్తే ఫలానా అభివృద్ధి పథకం ప్రారంభిస్తామని హామీ ఇచ్చేవారు. ఆ తర్వాత కాలంలో ప్రజలకు డబ్బు పంచడం మొదలైంది. ఇప్పుడది ఆ దశ దాటి ప్రభుత్వ సొమ్ము, అంటే ప్రజల నుంచి ముక్కు పిండి వసూలు చేస్తున్న సొమ్మును సంక్షేమం పేరిట పంచుతామని చెప్పి ఎన్నికల్లో పోటీచేస్తున్నారు.

ఆ దారిలోనే అందరూ...

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఆర్థిక పరిస్థితిపై అవగాహన లేకుండా హామీలు ఇచ్చింది. ఇప్పుడు సదరు హామీలను అమలు చేయలేక దిక్కులు చూస్తోంది. దీంతో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్‌ నాయకులు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. అయితే, ఈ విషయంలో ఆ పార్టీని తప్పు పట్టాల్సింది కూడా లేదు. నాడు కేసీఆర్‌ అయినా, నేడు రేవంత్‌ రెడ్డి అయినా తమ సొంత ఆస్తులు అమ్మి పథకాలను అమలు చేయడం లేదు – చేయరు! ఈ ఇరువురు కూడా అప్పులు చేసి పథకాలను అమలు చేయాల్సిందే. అప్పు దొరికితే సరేసరి, లేనప్పుడే తంటా అంతా! గత కొన్నేళ్లుగా అమలవుతున్న పథకాలను తమ హక్కుగా ప్రజలు భావిస్తున్నారు. అందుకే సంక్షేమ పథకాలు అమలు చేసినంత మాత్రాన అధికారం నిలబెట్టుకోవచ్చునని అనుకోవడానికి లేదు. అయినా రేసులో వెనుకబడి పోకూడదని రాజకీయ పార్టీలు పోటీ పడుతున్నాయి. అప్పు చేసి పప్పు కూడు తింటున్నామా అంటే అది కూడా లేదు! ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు ఏమాత్రం మెరుగుపడ్డం లేదు. రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది.


కర్ణాటకలో రోడ్లు గుంతలమయంగా ఉన్నాయని, అవి మెరుగుపడే అవకాశం కూడా కనపడటం లేదని, అంచేత తాము మరో రాష్ర్టానికి తరలిపోవాలని ఆలోచిస్తున్నట్టు ‘బ్లాక్‌ బక్‌’ కంపెనీ వ్యాఖ్యానించింది. కర్ణాటకకు అయినా, తెలంగాణకు అయినా, ఆంధ్రప్రదేశ్‌కు అయినా ఇంతకన్నా తలవంపు ఏమి ఉంటుంది? పెట్టుబడులను ప్రోత్సహిస్తామంటున్న పాలకులు బ్లాక్‌ బక్‌ కంపెనీకి ఏమి సమాధానం చెబుతారు? విద్యుత్‌ సరఫరా గురించి చెప్పేది ఏముంది? ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణాలకు నిధులు ఉండవు. సంక్షేమ వసతి గృహాల మెస్‌ బిల్లులు కూడా సకాలంలో చెల్లించరు. దీంతో ఆహార నాణ్యత లోపిస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రులలో సిబ్బంది కొరత ఉండనే ఉంది. అత్యవసరమైన మందులు ఉండవు. ఇలా చెప్పుకొంటూ పోతే అంతుండదు. ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు కూడా పేరుకుపోతున్నాయి. పదవీ విరమణ సందర్భంగా ఉద్యోగులకు చెల్లించాల్సిన మొత్తాలను చెల్లించలేక పదవీ విరమణ వయసు పెంచుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇవే పరిస్థితులు. సూపర్‌ సిక్స్‌ అమలు చేస్తావా? చస్తావా? అని ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి ఒత్తిడి తెస్తున్నారు. ఇవాళ కాకపోతే రేపు సూపర్‌ సిక్స్‌ అమలవుతాయి. నిన్నటిదాకా జగన్‌రెడ్డి అప్పులు చేయడం, తాకట్టు పెట్టడం చేశారు. ఇప్పుడు చంద్రబాబు అదే పని చేస్తారు. అంతిమంగా మునిగిపోయేది రాష్ట్రమే. చంద్రబాబు కంపెనీలుగానీ, జగన్‌రెడ్డి కంపెనీలుగానీ ఆ భారాన్ని భరించవు కదా! రెండు రాష్ర్టాలలోనూ ప్రభుత్వాలు చెల్లించాల్సిన బకాయిలు లక్షల కోట్లకు చేరాయి. చిన్నా చితకా పనులు చేసిన వారు సకాలంలో బిల్లులు పొందలేక నలిగిపోతున్నారు. ఇదే అదనుగా గతంలో లేని విధంగా, బిల్లులు చెల్లించాలంటే ‘నాకేంటి’ అని అడగడం మొదలైంది. ఇది వరకు పనులు కేటాయించినందుకే కమీషన్లు తీసుకొనేవారు. ఇప్పుడు బిల్లులు చెల్లించడానికి కూడా కమీషన్లు తీసుకోవడం ప్రారంభించారు. దీంతో పనుల అంచనాలు పెరుగుతున్నాయి. కోటి రూపాయలతో పూర్తయ్యే పనికి రెండు కోట్లతో అంచనాలు రూపొందిస్తున్నారు. ఇక్కడ కూడా ప్రజలే బాధితులు. ఒకవైపు సంక్షేమం పేరిట పంపకాలకు పాల్పడుతూ మరో వైపు అవినీతికి గేట్లు ఎత్తుతున్నారు. ఈ అవినీతి సొమ్ములో కొంత మొత్తాన్ని ఎన్నికల సమయంలో ప్రజలకు పంచుతున్నారు. ఒక్కొక్కరికి వంద– రెండు వందలతో మొదలైన పంపకం ఇప్పుడు వేలకు చేరింది. గతంలో పేదలకు మాత్రమే డబ్బు పంచేవారు. ఇప్పుడు మొత్తం ఓటర్లకు పంచాల్సి వస్తోందట! అనేక చోట్ల భూస్వాములు, వ్యాపారులు, ఇతర ధనవంతులు, ప్రభుత్వ అధికారులు కూడా సిగ్గు లేకుండా డబ్బు తీసుకుంటున్నారు. ఇదంతా ఒక విష వలయంగా మారింది.


ఆగేది ఎప్పుడు.. ఆపాల్సింది ఎవరు?

సంక్షేమ పథకాల ప్రకటనలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి కొంత బాధ్యతగా వ్యవహరించారు. రైతులకు ఉచిత విద్యుత్‌, ఫీజు చెల్లింపులు, ఆరోగ్యశ్రీ వంటి పథకాలు అమలు చేసినా... 2009 ఎన్నికల్లో గట్టెక్కేందుకు మరికొన్ని పథకాలు ప్రకటించాలని సన్నిహితులు సూచించగా, ‘రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నాకు తెలుసు. ఇంతకంటే ఎక్కువ చేయలేం. గెలిస్తే గెలుస్తాం లేదంటే లేదు’ అని కరాఖండిగా చెప్పారట! ఈ విషయంలో ఆయనను అభినందించాల్సిందే. ఈ నేపథ్యంలో పిల్లి మెడలో ఎవరు గంట కట్టాలన్నది ప్రశ్నగా మన ముందు ఉంది. వరాల జల్లు కురిపించడంలో వెనుకబడకూడదని అన్ని రాజకీయ పార్టీలూ భావిస్తున్నాయి. సంక్షేమ పథకాల పేరిట డబ్బు పంచిపెట్టినంత మాత్రాన ప్రజలు మళ్లీ మళ్లీ గెలిపిస్తున్నారా? అంటే అదీ లేదు! ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలూ ప్రజలకు డబ్బు పంచుతున్నాయి. అయితే, ప్రజలు మాత్రం తాము అనుకున్న వారికే ఓటు వేస్తున్నారు. ఇరు పార్టీలు డబ్బు ఇచ్చాయి కదా అని సగం ఓట్లు ఒకరికి, మిగతా సగం ఓట్లు మరొకరికీ వేయడం లేదు. ఈ డబ్బు పంపకంలో రాజకీయ పార్టీలు అలసిపోయే రోజు ఎంతో దూరంలో లేదు. అలాగే సంక్షేమ పథకాల రేసుకు ఎక్కడో ఒక చోట ఫుల్‌ స్టాప్‌ పడకపోతే పథకాలు పొందని ప్రజలు, పన్నులు చెల్లిస్తున్న వారు ఏదో ఒక రోజు రోడ్ల మీదకు వస్తారు. తెలుగు రాష్ర్టాలు రాజకీయ పార్టీల సొంతం కాదు. భావి తరాలకు ఇక్కడ మంచి భవిష్యత్తు ఉండాలి. అలా జరగాలంటే రాజకీయ పార్టీలను కట్టడి చేయడానికి ప్రజలే పూనుకోవాలి. ముఖ్యమంత్రులు వస్తుంటారు – పోతుంటారు. నష్టపోయేది రాష్ర్టాలు– అక్కడ నివసించే ప్రజలే! సో.. పౌర సమాజమే చొరవ తీసుకొని హద్దులు మీరుతున్న సంక్షేమ పథకాల అమలుకు నిరసనగా ప్రజలను చైతన్య పరచాలి. లేని పక్షంలో రెండు తెలుగు రాష్ర్టాలు కోలుకోలేని విధంగా అప్పుల ఊబిలో కూరుకుపోతాయి!

ఆర్కే

ఈ వార్తలు కూడా చదవండి

ఓటు చోరీ.. రాహుల్ గాంధీ తుస్సు బాంబులేశాడు.. రామచందర్ రావు సెటైర్లు

మహిళలను బీఆర్‌ఎస్ ఇన్సల్ట్ చేస్తోంది.. మంత్రి సీతక్క ఫైర్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 21 , 2025 | 12:45 AM