Seethakka Slams BRS: మహిళలను బీఆర్‌ఎస్ ఇన్సల్ట్ చేస్తోంది.. మంత్రి సీతక్క ఫైర్
ABN , Publish Date - Sep 20 , 2025 | 01:08 PM
వడ్డీ లేని రుణాలు మహిళలకు ఇప్పించి, వడ్డీ ప్రభుత్వం కడుతోందని మంత్రి సీతక్క వెల్లడించారు. 95 శాతం మహిళలు సక్రమంగా తీసుకున్న ఋణాలు చెల్లిస్తున్నారని తెలిపారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 20: పేదల సంక్షేమానికి, మహిళా సంక్షేమానికి పెద్ద పీట వేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని మంత్రి సీతక్క (Minster Seethakka) స్పష్టం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే పొదుపు సంఘాలు ఏర్పాటయ్యాయని గుర్తుచేశారు. రుణాలు తీసుకుని లక్షల మంది లబ్ది పొందుతున్నారని తెలిపారు. ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు, పెట్రోల్ బంక్‌లు, సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకుంటున్నారన్నారు. వడ్డీ లేని రుణాలు మహిళలకు ఇప్పించి, వడ్డీ ప్రభుత్వం కడుతోందని మంత్రి వెల్లడించారు. 95 శాతం మహిళలు సక్రమంగా తీసుకున్న ఋణాలు చెల్లిస్తున్నారని తెలిపారు.
ఉచిత బస్సుపై బీఆర్ఎస్ వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆడవాళ్ళు ఒక్క దగ్గర ఉండరని, కొట్టుకుంటారు అని మహిళలను ఇన్సల్ట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సులకు మహిళలను ఓనర్లుగా మార్చామని అన్నారు. పెట్రోల్ బంక్‌లు నిర్వహిస్తూ మహిళలు తమ సత్తా చాటుతున్నారని కొనియాడారు. నగరంలో 35 చోట్ల ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు నడిపిస్తున్నారన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేసే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ముందుకెళ్తున్నారని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం ఇచ్చే పథకాలపై బీఆర్ఎస్ నాయకులు చేసే దుష్ప్రచారం నమ్మొద్దన్నారు.
వైఎస్ ప్రభుత్వంలో మహిళలు కూడబెట్టిన డబ్బులను, కేసీఆర్ ప్రభుత్వం తినేసిందని ఆరోపించారు. ప్రస్తుతం కొన్ని మహిళా సంఘాలు డిఫాల్టర్లుగా మారడానికి గత ప్రభుత్వమే కారణమని మండిపడ్డారు. గతంలో వాళ్ళు ఇచ్చిన బతుకమ్మ చీరలు వాళ్ల బిడ్డలు, భార్యలు, బంధువులు కట్టుకోలేదన్నారు. బతుకమ్మ పండగకు కూడా కాంగ్రెస్‌పైన విష ప్రచారం చేసి పాట విడుదల చేశారని ఫైర్ అయ్యారు. పండగను ఉపయోగించుకుని రాజకీయ దుష్ప్రచారం చేస్తున్నారంటూ మంత్రి సీతక్క తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఇవి కూడా చదవండి
భూపాలపల్లిలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్‌ఎస్... పరిస్థితి ఉద్రిక్తం
సూపర్ మార్కెట్‌కు వెళ్తున్నారా... జాగ్రత్త సుమీ
Read Latest Telangana News And Telugu News