Congress vs BRS: భూపాలపల్లిలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్‌ఎస్... పరిస్థితి ఉద్రిక్తం
ABN , Publish Date - Sep 20 , 2025 | 12:37 PM
భూపాలపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఎమ్మెల్యే దంపతుల ఆధ్వర్యంలో ఇసుక అక్రమ రవాణా నడుస్తోందని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తున్నారు
జయశంకర్ భూపాలపల్లి, సెప్టెంబర్ 20: జిల్లాలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్‌ఎస్‌గా (Congress vs BRS) పరిస్థితులు మారాయి. ఇసుక అక్రమ దందాకు సంబంధించి ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్న పరిస్థితి. ఇసుక అక్రమ దందాపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య పరస్పర ఆరోపణలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఈ వ్యవహారానికి సంబంధించి రెండు పార్టీ నేతలు ధర్నాకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో భూపాలపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఎమ్మెల్యే దంపతుల ఆధ్వర్యంలో ఇసుక అక్రమ రవాణా నడుస్తోందని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తున్నారు. దీంతో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి, ఆయన భార్య జ్యోతి దిష్టిబొమ్మల దహనానికి హస్తం పార్టీ నేతలు పిలుపునిచ్చారు.
అయితే కాంగ్రెస్ నేతలే ఇందిరమ్మ ఇళ్ల పేరుతో అక్రమ దందా చేస్తున్నారని బీఆర్‌ఎస్ శ్రేణులు ఆరోపిస్తూ నిరసనలకు పిలుపునిచ్చారు. విషయం తెలిసిన పోలీసులు పరిస్థితిని అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా ఇరు పార్టీలకు చెందిన నేతలను గృహనిర్బంధం చేశారు. టేకుమట్ల, మొగుళ్ళపల్లి, భూపాలపల్లి మండలాల వ్యాప్తంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలను హౌస్ అరెస్టులు చేశారు. భూపాలపల్లిలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ దిష్టిబొమ్మను బీఆర్‌ఎస్ నేతలు దహనం చేశారు. జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు.
ఇవి కూడా చదవండి
సూపర్ మార్కెట్‌కు వెళ్తున్నారా... జాగ్రత్త సుమీ
నాలుగవ రోజుకు సోదాలు.. కీలక డాక్యుమెంట్లు స్వాధీనం
Read Latest Telangana News And Telugu News