CAPS Gold IT Raids: నాలుగవ రోజుకు సోదాలు.. కీలక డాక్యుమెంట్లు స్వాధీనం
ABN , Publish Date - Sep 20 , 2025 | 09:38 AM
క్యాప్స్ గోల్డ్ యజమానులు, బంధువుల ఇళ్లలోనూ సోదాలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 50 లక్షలు, బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకుంది ఐటీ.
హైదరాబాద్, సెప్టెంబర్ 20: క్యాప్స్ గోల్డ్ కేసులో ఐటీ సోదాలు (IT Raids) కొనసాగుతున్నాయి. నాలుగవ రోజు ఐటీ అధికారులు చేపట్టిన తనీఖీల్లో పలు కీలక డ్యాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ బెంగళూరు, ముంబయిలలో ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. క్యాప్స్ గోల్డ్ కంపెనీ ఈ ఏడాదిలో 20 వేల కోట్లకు పైగా బిజినెస్ చేసింది. క్యాప్స్ గోల్డ్ యజమానులు, బంధువుల ఇళ్లలోనూ సోదాలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 50 లక్షలు, బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకుంది ఐటీ. బ్యాంక్ లాకర్లను అధికారులు పరిశీలించారు. హ్యాకర్ల సాయంతో ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లను ఓపెన్ చేయిస్తున్నారు ఐటీ అధికారులు. ట్యాక్స్ చెల్లింపులపై కంపెనీ డైరెక్టర్ చందా సుధీర్‌ను అడిగి తెలుసుకున్నారు. నేడు చందా డైరెక్టర్ చందా శ్రీనివాసును విచారించి మరికొన్ని వివరాలు అడిగి తెలుసుకోనున్నారు ఐటీ అధికారులు.
కాగా.. గత మూడు రోజులుగా ప్రముఖ బంగారం షాపులు, యజమానుల ఇళ్లలో వరుసగా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. పన్ను చెల్లింపుల్లో బంగారం యజమానులు అవకతవలకు పాల్పడినట్లు ఐటీ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సోదాలు జరుగుతున్నాయి. ప్రధానంగా క్యాప్స్ గోల్డ్ కంపెనీకి చెందిన చైర్మన్, డైరెక్టర్ల ఇళ్లలో వరుసగా రైడ్స్ కొనసాగుతున్నాయి. క్యాప్స్ గోల్డ్ కంపెనీకి వాసవి రియల్ ఎస్టేట్ సంస్థతో అనుబంధం ఉన్నట్లు గుర్తించిన ఐటీ... ఆ సంస్థ యజమానుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహించింది. క్యాప్స్ గోల్డ్ కంపెనీకి హోల్‌సేల్‌గా ఉన్న సంస్థల్లోనే సోదాలు జరిపిన ఐటీ అధికారులు భారీగా పన్ను చెల్లింపుల్లో అవకతవకలకు పాల్పడినట్లు గుర్తించారు. అంతేకాకుండా బ్లాక్ మార్కెట్ నుంచి బంగారం కొనుగోలు చేసి సరఫరా చేస్తున్నట్లుగా కూడా అధికారుల సోదాల్లో బయటపడింది.
ఇవి కూడా చదవండి
మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే.
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ముగిసిన సిట్ సోదాలు.. కీలక డాక్యుమెంట్లు స్వాధీనం
Read Latest Telangana News And Telugu News