AP liquor scam: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ముగిసిన సిట్ సోదాలు.. కీలక డాక్యుమెంట్లు స్వాధీనం
ABN , Publish Date - Sep 20 , 2025 | 08:56 AM
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిర్వహించిన సోదాల్లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయని సిట్ అధికారులు తెలిపారు. మద్యం ముడుపులను విదేశాలకు తరలించేందుకు కంపెనీలను వాడుకున్నట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు.
అమరావతి: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ అధికారులు సోదాలు ముమ్మరం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్, చెన్నైలో చేపట్టిన సోదాలు ముగిసినట్లు అధికారులు ప్రకటించారు. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పెద్దనాన్న కుమారుడు వైఎస్ అనిల్ రెడ్డి కార్యాలయాల్లో సమారు 7 గంటల పాటు సోదాలు నిర్వహించినట్లు తెలిపారు. హైదరాబాద్, కొండాపూర్‌లోని వైఎస్ అనిల్ రెడ్డి కంపెనీలో సోదాలు చేసి.. హార్డ్ డిస్క్‌లు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అలాగే.. అనిల్ రెడ్డికి సంబంధించి చెన్నైలో 9 ప్రాంతాల్లో నిర్వహించిన సోదాలు కూడా ముగిసినట్లు అధికారులు వివరించారు.
ఈ సోదాల్లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయని సిట్ అధికారులు తెలిపారు. మద్యం ముడుపులను విదేశాలకు తరలించేందుకు కంపెనీలను వాడుకున్నట్లు గుర్తించారు. ఈ సోదాలతో మరికొన్ని ఆధారాలు సేకరించినట్లు చెప్పారు. ఇటీవలే పలు కంపెనీల నుంచి డైరెక్టర్‌గా వైఎస్ అనిల్ రెడ్డి వైదొలిగినట్లు వెల్లడించారు. డైరెక్టర్‌గా అనిల్ రెడ్డి వైదొలగడానికి కారణాలపై సిట్ అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. కాగా, లిక్కర్ స్కామ్‌లో జగన్‌కు అత్యంత సన్నిహితులు, ఆయన ఆర్థిక వ్యవహారాలన్నీ చక్కబెట్టేవారి పేర్లు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుండడంతో.. ఈ కేసు ఉత్కంఠను రేకెత్తిస్తోంది.
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ అధికారులు దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఈ మేరకు వైఎస్ అనిల్ రెడ్డికి చెందిన కంపెనీలు, ఇళ్లల్లో సిట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆయనకు చెందిన 8 కంపెనీలు, రెండు ఇళ్లల్లో ఏక కాలంలో సోదాలు చేసినట్లు చెప్పారు. చెన్నై, హైదరాబాద్‌లో ఏక కాలంలో సోదాలు కొనసాగినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో.. సోదాలు ముగిసినట్లు అధికారులు వెల్లడించారు.