Tirupati: తిరుపతిలో తెలంగాణ యువకుడి హత్య
ABN, Publish Date - Sep 25 , 2025 | 01:17 PM
తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆర్‌గొండ గ్రామానికి చెందిన తమన్నగారి సతీష్‌కుమార్ (23) తిరుపతిలో హత్యకు గురయ్యారు. ఆర్టీసీ బస్టాండు సమీపంలోని రైలు పట్టాల పక్కన ఈ ఘాతుకం జరిగింది. తిరుపతి రైల్వే సీఐ ఆశీర్వాదం తెలిపిన ప్రకారం.. ఆర్‌గొండ గ్రామానికి చెందిన సతీష్ కుమార్ ఒక్కడే కుమారుడు.
- రైలు పట్టాల పక్కన ఘాతుకం
తిరుపతి: తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి(Kamareddy) జిల్లా రాజంపేట మండలం ఆర్‌గొండ గ్రామానికి చెందిన తమన్నగారి సతీష్‌కుమార్ (23) తిరుపతిలో హత్యకు గురయ్యారు. ఆర్టీసీ బస్టాండు సమీపంలోని రైలు పట్టాల పక్కన ఈ ఘాతుకం జరిగింది. తిరుపతి రైల్వే సీఐ ఆశీర్వాదం తెలిపిన ప్రకారం.. ఆర్‌గొండ గ్రామానికి చెందిన సతీష్ కుమార్ ఒక్కడే కుమారుడు. ప్రైవేటు విద్యాసంస్థలో పీఈటీగా పనిచేస్తున్న ఇతడికి ఏడాది కిందట వివాహమైంది. గత ఆగస్టు నెలలో వివాహ వార్షికోత్సవం జరిగింది.
తర్వాత ఆయన భార్య అలిగి వెళ్లిపోయింది. తర్వాత పీఈటీ ఉద్యోగాన్ని మానేసిన సతీష్ కుమార్ ఖాళీగా ఉన్నారు. ఈనెల 22న కామారెడ్డి నుంచి రాయలసీమ ఎక్స్‌ప్రెస్(Rayalaseema Express)లో బయలుదేరి మంగళవారం మధ్యాహ్నం తిరుపతికి చేరుకున్నారు. ఆర్టీసీ బస్టాండు వద్దనున్న ఓ దుకాణంలో మద్యం తాగినట్లు పోలీసులు చెబుతున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో గానీ బుధవారం మధ్యాహ్నం దాదాపు 12.30 గంటల ప్రాంతంలో ఆర్టీసీ బస్టాండుకు సమీపంలోని రైల్వే ట్రాక్ పక్కన, 91-40 విద్యుత్ స్తంభం వద్ద దుండగులు పగులకొట్టిన మద్యం సీసాతో ఇతడి గొంతు కోశారు.
వారి నుంచి తప్పించుకున్న సతీష్ కొంత దూరం పరుగెత్తు కుంటూ వెళ్లి కింద పడి మృతి చెందినట్లు అక్కడి పరిస్థితులను బట్టి తెలుస్తోంది. పట్టాల పక్కన మృతదేహం ఉన్న విషయాన్ని కొందరు రైల్వే ప్రయాణికులు రైల్వే ఎస్‌ఐ రత్నమాలకు ఫోనుచేసి సమాచారమిచ్చారు. దీంతో రైల్వే సీఐ ఆశీర్వాదం, ఎస్‌ఐ ధర్మేంద్ర రాజు, తిరుపతి ఈస్ట్ సీఐ శ్రీనివాసులు, డాగ్ స్క్వాడ్, ఫొరెన్సిక్ అధికారులు జయశ్రీ, డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ రాజేష్ గాంధీ, వేలిముద్ర నిపుణులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
హత్యకు ఉపయోగించిన మద్యం సీసా, పీఈటీగా పనిచేసిన ఐడీ కార్డు, ఆధార్, పాస్‌పోర్టు, రైలు టికెట్, సెక్యూరిటీ గార్డు పోస్టుకు సంబంధించి రెజ్యూమ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఐడీ కార్డుల్లోని సెల్‌ఫోను నెంబర్ల ఆధారంగా కుటుంబీకులకు సమాచారం అందించారు. సాయంత్రం తిరుపతి రైల్వే ఇన్‌చార్జి డీఎస్పీ శ్రీనివాసాచారి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ హత్యకు కారణం ఆయన గ్రామానికి సంబంధించి ఎవరితోనైనా ఆర్థిక లావాదేవీలా లేదా వివాహేతర సంబంధమా?
లేకుంటే మద్యం మత్తులో స్థానికంగా ఘర్షణ పడటంతో హత్య చేశారా అనే కోణాల్లో రైల్వే సీఐ ఆశీర్వాదం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రుయాస్పత్రికి తరలించారు.
డాగ్ స్క్వాడ్‌తో పరిశీలన
మృతదేహం వద్ద నుంచి ఆర్టీసీ బస్టాండు దగ్గర్లోని బార్ వద్దకు.. అక్కడ్నుంచి అంబేడ్కర్ విగ్రహం, మళ్ళీ బస్టాండులోని వినాయక విగ్రహం వరకు పోలీస్ జాగిలం టైగర్ వెళ్లి ఆగిపోయింది. దీన్ని బట్టి హంతకులు హత్య చేశాక బస్సులో పారిపోయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బంగారం ధరలో స్వల్ప తగ్గుదల.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News
Updated Date - Sep 25 , 2025 | 01:19 PM