Rashtriya Swayamsevak Sangh: మతమేదైనా జాతీయతే ప్రధానం
ABN , Publish Date - Sep 25 , 2025 | 06:10 AM
1963 భారత గణతంత్ర దినోత్సవాల్లో కవాతు వందనంలో పాల్గొనటానికి అప్పటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ ప్రత్యేకంగా ఆహ్వానించిన ఒక స్వచ్ఛంద సంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్. చరిత్ర తెలియని ఇప్పటి తరానికి ఇది వింతగా...
1963 భారత గణతంత్ర దినోత్సవాల్లో కవాతు వందనంలో పాల్గొనటానికి అప్పటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ ప్రత్యేకంగా ఆహ్వానించిన ఒక స్వచ్ఛంద సంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్. చరిత్ర తెలియని ఇప్పటి తరానికి ఇది వింతగా అనిపించవచ్చు. కానీ, నెహ్రూ అలా చేయటానికి గల ఒక బలమైన కారణం– 1962 నాటి చైనా దురాక్రమణ వల్ల జరిగిన యుద్ధంలో గాయపడిన సైనికులకు తక్షణ వైద్యం అందేలా చేయటంలోను, శ్రీనగర్ విమానాశ్రయంలో పేరుకుపోయిన మంచు పెళ్లల్ని తొలగించటంలోను ఆరెస్సెస్ స్వయంసేవకులు చేసిన అసాధారణ సేవ. ఆరు దశాబ్దాల తరువాత 2020–2022 కాలంలో కొవిడ్ కారణంగా ఉత్పన్నమైన భయంకర పరిస్థితుల్లో అదే సేవా స్ఫూర్తితో పనిచేసిన స్వచ్ఛంద సంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్. దేశంలో ఏ ప్రమాదాలూ, ఉపద్రవాలూ ఎక్కడ సంభవించినా ఎవరూ ఆహ్వానించకుండా తనంత తానుగా రంగంలోకి దిగి సేవలందించటం సంఘ్ ప్రవృత్తి. ఇంతటి సేవా స్ఫూర్తి కలిగిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆవిర్భవించి ఈ 2025 విజయదశమి నాటికి వందేళ్లు.
1925లో విజయదశమి శుభదినాన కేవలం ఐదుగురు యువకులతో నాగపూర్‌లో కేశవరావు బలిరాం హెడ్గేవార్ ‘రాష్ట్రీయ స్వయం సేవక సంఘా’న్ని స్థాపించారు. కేశవరావు పూర్వీకులు తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాదు జిల్లా బోధన్ దగ్గర కందుకూరు గ్రామానికి చెందినవారు. అక్కడి నుంచి వారు మహారాష్ట్రలోని నాగపూర్ ప్రాంతానికి వలస వెళ్లారు. కేశవరావు పేద కుటుంబంలో జన్మించి, కష్టాలు అనుభవిస్తూనే, కలకత్తాలో డాక్టర్ విద్య పూర్తి చేసారు. ఆయన బాల్యం నుంచి దేశభక్తి, జాతీయవాదం, భారతీయ సంస్కృతి, ఇతిహాసాల పట్ల మక్కువ చూపేవారు. ఆంగ్లేయులను మనదేశం నుంచి పారద్రోలాలనే భావనతో రగిలిపోయేవారు. అయితే, స్వాతంత్ర్యం కోసం పోరాటంలో హింసకు తావుండకూడదని విశ్వసించేవారు. కలకత్తా నుంచి నాగపూర్‌కి తిరిగివచ్చి, స్థానిక యువకులను సమావేశపరిచి వారిని స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొనేలా ప్రోత్సహించారు. వారికి అవసరమైన వ్యాయామశాలలు, అఖాడాలు నిర్వహించారు. కాంగ్రెస్‌లో చేరి బాలగంగాధర తిలక్, మహాత్మగాంధీ, సుభాష్ చంద్రబోస్, డా. ముంజె వంటి నాయకులతో కలిసి పనిచేసి, మహారాష్ట్రలో యువ నాయకుడిగా ఎదిగారు. బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొని కారాగార శిక్ష అనుభవించారు. స్వాతంత్ర్య సమరంలో పాల్గొంటున్న సమయంలోనే ఆయన మనసులో ఒక అంతర్మథనం సాగుతూ ఉండేది. భారతదేశానికి స్వాతంత్ర్యం ఇంతకుముందు లేదా? ఆ స్వాతంత్ర్యాన్ని ఎందుకు కోల్పోయాం? ఎందుకు మన దేశం 700 సంవత్సరాలపాటు బానిసత్వంలో మగ్గింది? ఈ అంతర్మథనం, తర్వాత సుదీర్ఘమైన అధ్యయనం వల్ల ఆయనకు ఒక విషయం స్పష్టమైంది. ఒకప్పుడు ప్రకృతిని ఆరాధించే మన భారతీయతలో ఏకత్వం ఉంది. వర్గం, వర్ణం, భాష, ప్రాంతం, సంప్రదాయం పేరుతో అనైక్యంగా ఉండడం వల్లనే అనేక విదేశీ దండయాత్రల్లో మనం ఓడిపోయాం. తిరిగి దేశానికి పూర్వ వైభవ స్థితిని తేవాలన్న దృఢమైన, అచంచలమైన సంకల్పం ఆయనలో కలిగింది. దేశం కోసం, ధర్మం కోసం, సమాజం కోసం సర్వస్వాన్ని అర్పించి సేవ చేసే యువకుల బృందమే భారతదేశానికి పూర్వ వైభవ స్థితిని తీసుకురాగలదని ఆయన విశ్వసించారు. మన ప్రాచీన ఋషులు, మునులు, సంతులు, తత్త్వవేత్తలు బోధించిన విషయాలను దృష్టిలో పెట్టుకుని, ఆ హిందుత్వం, భారతీయత మూర్తీభవించిన సంఘటిత సమాజాన్ని నిర్మించడానికై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌ను స్థాపించారు.
శిల్పి ఒక రాయిని చెక్కి శిల్పం చేసినట్టుగా, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రతి భారతీయునిలో అంతర్లీనంగా ఉన్న ఉన్న శక్తిని జాగృతం చేసి, ఆ వ్యక్తిని క్రమశిక్షణ, దేశభక్తి, జాతీయతతో నింపటానికి తన శాఖల ద్వారా ప్రయత్నిస్తున్నది. అలాంటి శాఖల విస్తరణే సంఘ్ కార్యం. సంఘ్ ఏనాడూ మతంతో ముడిపడిలేదు. మతమేదైనా జాతీయతే ప్రధానంగా భావించింది. ‘‘ఇది నా మాతృభూమి. నా మాతృభూమి కోసం సర్వస్వాన్ని త్యాగం చేస్తాను. అవసరమైతే ప్రాణ త్యాగమైనా చేస్తాను’’ అన్న సంకల్పం ఉంటే చాలు. అందుకే సంఘ్ ప్రార్థన ‘నమస్తే సదా వత్సలే మాతృభూమి’ అంటూ మొదలవుతుంది.
సంఘ్ స్వయం సేవకులను నిర్మాణం చేస్తుంది. స్వయం సేవకులు తమ బాధ్యతగా సమాజంలో ఉన్నటువంటి అన్ని క్షేత్రాలలో సంఘ్ భావజాలాన్ని, సంఘ్ సిద్ధాంతాన్ని అమలుపరిచేలా బాధ్యతలు తీసుకుంటారు. ఆలా దేశం గర్వించదగిన నాయకుల్ని తయారు చేసింది సంఘ్. అటల్ బిహారీ వాజపేయి, ఎల్.కె. అద్వానీ, భైరన్‌సింగ్ షెకావత్, నానాజీ దేశముఖ్, మురళీమనోహర్ జోషి, బంగారు లక్ష్మణ్, రామనాథ్ కోవింద్, వెంకయ్యనాయుడు, నరేంద్ర మోదీ, రాజనాథ్ సింగ్, నితిన్ గడ్కరీ లాంటి వేలాదిమందిని రాజకీయ క్షేత్రంలోకి పంపింది. వీరేగాక సమాజానికి కనపడని అనేకమందిని, కార్మిక, ధార్మిక, విద్యార్థి, కిసాన్, ఆదివాసీ, సేవా, సామాజిక సమరసతా రంగాల్లోకి పంపింది. ఇంకా వివిధ వృత్తి రంగాలలో కృషి చేసేందుకు ప్రముఖ నాయకులను ఆయా రంగాలకు సంఘ్ కేటాయించింది.
1940లో కేశవరావు బలిరాం హెడ్గేవార్ పరమపదించిన తరువాత మాధవ్ సదాశివ గోల్వాల్కర్ (గురూజీ) సర్ సంఘ్ ద్వితీయ చాలక్‌గా 1940 నుంచి 1973 వరకు దాదాపు 33 సంవత్సరాల పాటు నిరంతర తపోదీక్షతో దేశమంతటా పర్యటిస్తూ పనిచేసారు. అప్పటివరకు కేవలం మహారాష్ట్ర ప్రాంతానికే పరిమితమైన సంఘాన్ని అఖిల భారతీయ స్థాయిలో విస్తృతపరిచారు. దేశవ్యాప్తంగా సంఘ్ శాఖలను, ప్రచారక్ (సన్యాసిగా) వ్యవస్థను ఉద్యమ స్థాయిలో విస్తరించారు. సమాజంలోని అన్ని రంగాలలో సంఘ్ సంస్థలను నిర్మాణం చేసి వాటికీ ప్రచారకులను పంపించారు. గురూజీ 1973లో పరమపదించారు.
గురూజీ తదనంతరం బాల సాహెబ్ దేవరస్‌గా ప్రసిద్ధి చెందిన మధుకర్ దత్తాత్రేయ దేవరస్ 1973 నుంచి సర్ సంఘ్ తృతీయ చాలక్‌గా బాధ్యతలు చేపట్టారు. హిందూ సమాజంలో లోతుగా పేరుకుపోయిన అంటరానితనం, అస్పృశ్యత, దేవాలయ ప్రవేశ నిరాకరణ, కులాంతర వివాహాల వ్యతిరేకత లాంటి సామాజిక రుగ్మతల నివారణకై కృషి చేయాలని, దళిత గిరిజన సమాజానికి సేవ చేసి, వారిని సంఘటితం చేయాలనీ ఆయన పిలుపు ఇచ్చారు. ఈ పిలుపు మేరకు స్వయం సేవకులందరు వేలాదిగా బస్తీల్లో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. సంఘ్ ‘సేవా భారతి’ పేరుతో విద్య, వైద్య, నైపుణ్య శిక్షణ తదితర కార్యక్రమాలు ప్రారంభించింది. ఈనాడు ‘సేవ భారతి’ దేశవ్యాప్తంగా 373 జిల్లాల్లో 35,560 శాఖలతో సేవలు అందిస్తున్నాయి. ఇప్పుడు ‘సామాజిక సమరసత’ జాతీయ స్థాయిలో పెద్ద ఉద్యమంగా సాగుతోంది.
1975 అత్యవసర పరిస్థితి సమయంలో ఇందిరా గాంధీ ప్రభుత్వం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌పై నిషేధం విధించింది. ఆమె నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యానికి పట్టిన గ్రహణాన్ని ఎదుర్కోవడానికి సంఘ్ అన్ని రాజకీయ పక్షాలను, నాయకులను ఏకతాటి మీదకు తీసుకువచ్చేందుకు కృషి చేసింది. లోక్ సంఘర్ష్ సమితి ఆధ్వర్యంలో ప్రముఖ సోషలిస్టు నాయకులైన జయప్రకాశ్ నారాయణ్, మొరార్జీదేశాయ్ లాంటి మహోన్నత నాయకులతో కలిసి సంఘ్ ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం చేపట్టింది. భారతదేశ చరిత్రలో రెండవ స్వాతంత్ర్య సంగ్రామం అనదగినంత ప్రాముఖ్యత కలిగిన ఈ ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటంలో అనేకమంది స్వయం సేవకులు ప్రాణాలు పణంగా పెట్టి పోరాడారు.
1947లో దేశ విభజన సమయంలో లక్షలాదిమంది కాందిశీకుల శిబిరాలను నిర్వహించి, వారికి రక్షణ కల్పించి సంఘ్ అండగా నిలబడింది. 1977లో ఆంధ్రప్రదేశ్‌లోని దివిసీమలో వచ్చిన పెను ఉప్పెనకు ఊళ్ళకు ఊళ్ళే తుడిచి పెట్టుకుపోయిన సందర్భంలో సంఘ్ తన స్వయం సేవకులను వెంటనే రంగంలోకి దించింది. ఆయా సహాయ కార్యక్రమాలకు ఆరెస్సెస్ సైక్లోన్ రిలీఫ్ కమిటీలు ఏర్పాటు చేసి అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఉప్పెన ఉధృతికి శవాల దిబ్బలుగా మారిన ఊళ్లల్లో ప్రత్యేకంగా ‘శవ సేన’ పేరుతో ఒక బృందాన్ని తయారు చేసి మరణించిన వారి అంతిమ సంస్కారాలు నిర్వహించే బాధ్యతను సంఘ్ తీసుకుంది. తుపానుతో తీవ్రంగా నష్టపోయిన మూలపాలెం గ్రామాన్ని విరాళాల సహాయంతో పునర్నిర్మించి, ‘దీనదయాళ్‌పురం’గా నామకరణం చేసి, అక్కడున్న అందరికీ పక్కా ఇళ్లు నిర్మించింది. వాటిని అప్పటి కేంద్ర విదేశాంగమంత్రి అటల్ బిహారీ వాజపేయి, ముఖ్యమంత్రి చెన్నారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగానే ప్రముఖ గాంధేయవాది ప్రభాకర్ జీ ‘‘ఆరెస్సెస్ అంటే రెడీ ఫర్ సెల్ఫ్‌లెస్ సర్వీస్ (Ready for Selfless Service)’’ అని కొనియాడారు.
సంఘ్ ఏనాడూ హింసను బోధించదు. హింసను ప్రోత్సహించదు. కేరళ, ఈశాన్య భారత రాష్ట్రాలలో దేశ వ్యతిరేకశక్తులు సంఘ్ కార్యకర్తల మీద దాడులు చేశాయి. కిరాతకంగా ప్రాణాలు తీశాయి. కానీ సంఘ్ ఏనాడూ ఇలాంటి చర్యలకు పాల్పడలేదు. కుల, వర్ణ, వర్గ వివక్షలకు అతీతంగా సంఘ్ నిర్మాణం జరిగింది. అందుకే ఈ శక్తి అచంచలమైంది. అలా నిర్మితమైంది కాబట్టే ఆరెస్సెస్ ఇద్దరు సమర్థులైన, నీతిమంతులైన ప్రధానమంత్రుల్ని ఈ దేశానికి అందించగలిగింది. వందేళ్ళ క్రితం అయిదుగురితో ప్రారంభమైన ఆరెస్సెస్ ఇవ్వాళ దేశంలో కోట్లాది స్వయం సేవకులతో భరతమాత సేవకి తనని తాను పునరంకితం చేసుకుంటోంది.
బండారు దత్తాత్రేయ
పూర్వ గవర్నర్, హర్యానా
వార్తలు కూడా చదవండి..
కృష్ణమ్మకు వరద పోటు.. ప్రభుత్వం అలర్ట్
అసెంబ్లీలో ఆమోదం పొందనున్న పలు బిల్లులు
For More AP News And Telugu News