CM Chandrababu: తొలిరోజు మహానాడు గ్రాండ్ సక్సెస్.. టీడీపీ శ్రేణులకు సీఎం చంద్రబాబు కితాబు
ABN, Publish Date - May 27 , 2025 | 08:01 PM
టీడీపీ ముఖ్య నేతలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. తొలి రోజు మహానాడు జరిగిన తీరుపై సమీక్షించారు. మొదటి రోజు మహానాడు గ్రాండ్ సక్సెస్ అంటూ చంద్రబాబు కితాబిచ్చారు.
కడప: ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా వేదికగా తెలుగుదేశం మహానాడు (TDP Mahanadu) పండుగ మూడురోజుల పాటు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలి వస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని టీడీపీ శ్రేణులు మహానాడు వేడుకలో పాలుపంచుకుంటున్నారు. కార్యకర్తలకు, నేతలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా కడపలో టీడీపీ హై కమాండ్ భారీ ఏర్పాట్లు చేసింది. ఈక్రమంలో మంగళవారం నాడు నిర్వహించిన మహానాడు సూపర్ సక్సెస్ అయింది.
ఈ సందర్భంగా పార్టీ ముఖ్య నేతలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) భేటీ అయ్యారు. తొలి రోజు మహానాడు జరిగిన తీరుపై సమీక్షించారు. మొదటి రోజు మహానాడు గ్రాండ్ సక్సెస్ అంటూ చంద్రబాబు కితాబిచ్చారు. కొందరు నేతలు అద్భుతంగా మాట్లాడారంటూ చంద్రబాబు అభినందనలు తెలిపారు. టైమింగ్ పాటిస్తూనే చక్కగా మాట్లాడిన నేతలకు చంద్రబాబు అభినందనలు చెప్పారు. మహానాడు తొలి రోజున పక్కా టైమింగ్ పాటించడంపై సమావేశంలో ప్రస్తావించారు. రేపు (బుధవారం) కూడా ఇదే తరహాలో సమయపాలన పాటిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు.
మొదటిరోజు ముగిసిన మహానాడు
మహానాడు మొదటిరోజు చంద్రబాబు ప్రసంగంతో ముగిసింది. మంత్రి నారా లోకేష్ ప్రతిపాదించిన ఐదు అంశాలను మహానాడులో బలపరిచారు. క్లస్టర్ ఇన్‌చార్జి నుంచి పార్టీ మండల అధ్యక్షుడి వరకు తీర్మానాలపై మాట్లాడే అవకాశాన్ని టీడీపీ హైకమాండ్ కల్పించింది. నేతలు చేసిన ప్రసంగాలపై వెంటనే ఐవీఆర్‌ఎస్ సర్వే ద్వారా ఫీడ్ బ్యాక్ తెప్పించి చంద్రబాబు చదివి వినిపించారు. రేపు(బుధవారం) మహానాడు రెండో రోజు దివంగత నేత నందమూరి తారకరామారావు జన్మదినం సందర్భంగా నేతలు నివాళులు అర్పించనున్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై మహానాడులో నేతలతో చంద్రబాబు చర్చించనున్నారు. అనంతరం వీటిపై పలువురు నేతలు ప్రసంగిస్తారు. మూడో రోజు (గురువారం) మహానాడు సందర్భంగా కడపలోనే భారీ బహిరంగసభ ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం రెండు గంటలకే బహిరంగ సభ ప్రారంభం కానుంది. సాయంత్రం 5.30 గంటలకే బహిరంగ సభ ముగించాలని టీడీపీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది.
ఈ వార్తలు కూడా చదవండి
థియేటర్ల వివాదం.. జనసేన ఆదేశాలు ఇవే
అది నిరూపించు రాజీనామా చేస్తా.. జగన్‌కు లోకేష్ సవాల్
Read Latest AP News And Telugu News
Updated Date - May 27 , 2025 | 08:58 PM